YOGA DAY CELEBRATIONS IN GOVT ARTS COLLEGE, ANANTAPUR ON 21 JUNE 2025
అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానం లో అధ్యాపకులందరూ జూన్ 21, 2025 న వ్యాయామ అధ్యాపకులు శ్రీ రామ్ మరియు ప్రిన్సిపల్ పద్మ శ్రీ గారి ఆధ్వర్యం లో యోగ మార్గం పట్టారు. 200 మంది అధ్యాపకులు మరియు అధ్యాపకేతర ఉద్యోగులు సుమారు రెండు గంటల పాటు వివిధ యోగాసనాలు వేసారు. ఈ కార్యక్రమానికి యాంకర్ గా ఆంగ్ల అధ్యాపకులు అహ్మద్ వ్యవహరించారు.
అసలు ఈ యోగం అంటే ఏమిటి? ఈ కాలేజీ లో చదవడమే ఒక యోగం. అలాంటిది ఈ కాలేజీ లో పనిచేయడం మహా యోగం. అందరికీ ఆ యోగం పట్టకపోవచ్చు. అలా ఈ కాలేజీ లో చదువు చెపుతుండడం వల్ల మేమంతా యోగ మార్గంలో పయనిస్తున్నట్టే లెక్క.
"యోగ: కర్మ సుకౌశల:" అని కృష్ణుడి నిర్వచనం. అంటే Skill in action is Yoga" అని అర్థం. అంటే వృత్తి లో నైపుణ్యమే యోగం అని రూఢార్థం. దీని వలన ఒరిగేదేమి? జరిగేదేమి? అంటే "యోగః చిత్త వృత్తి నిరోధక:" అని ఫల శృతి చెపుతారు. అంటే యోగం చేస్తే మనసు నిలిచిపోతుంది. మరి "మనసు నిలిపివేస్తే మాయ పోగట్టదా" అంటారు కదా!!!! కాబట్టి యోగా చేస్తే శరీరం, మనసు మరియు మెదడు మీద ఆధిపత్యం వస్తుంది. త్రికరణ శుద్ది వస్తుంది. మనస్యేకమ్ , వచస్యేకమ్ , కర్మణ్యేకమ్ మహాత్మనాత్ అన్నారు. అంటే యోగ మార్గం లో పయనిస్తే అందరూ కూడా మహాత్ములవుతారు. మనస్సే లేని అమనస్క యోగం సిద్దిస్తుంది.
ఈ యోగాన్ని సోపాన మార్గం లో , అంటే అంచెలంచెలుగా సాధన చేయాలి. శరీరాన్ని మొదట నియంత్రించడం నేర్చుకుంటే మనసు మీద ఆధిపత్యం వస్తుంది. శరీరాన్నే అదుపు చేయలేని వాళ్లు, మనసును ఎలా నియంత్రిస్తారు? ఉట్టి కెక్కలేని అమ్మ స్వర్గానికి ఎలా ఎక్కుతుంది? కాబట్టి దీనిని సాధించడానికే భారతీయులందరూ జూన్ 21 న యోగాసనాలు వేసారు. ఒక్కో ఆసనం, ఒక్కో శారీరక రుగ్మతను తొలగిస్తుంది. ఒక్కో ఆసనానికి ఒక్కో రకమైన కర్మను తొలగించే శక్తి ఉంటుంది. ప్రతి ఆసనం మన శరీరంలోని షడ్చక్రాలలో ఏదో ఒక చక్రాన్ని క్రియాశీలకం చేసే సామర్థ్యం కలిగిఉంటుంది. మొదట "ఆసన సిద్ది " వస్తే, తరువాత "ఆశయ సిద్ది" వస్తుంది. కూచోవడమే చేతకాని వాడు కుప్పి గంతులు ఎలా వేస్తాడు?
ఈ యోగా లో మొదటి అంశం శ్వాస మీద నియంత్రణ. మనసును కట్టడి చేయాలి అంటే శ్వాసను కట్టడి చేయాలి. కాబట్టి మొదటగా అధ్యాపకులందరూ కూడా ప్రాణాయామం చేసాము. మనందరిదీ "ఎక్కే శ్వాసా, దిగే శ్వాస" కాబట్టి శ్వాస మీద ఆధిపత్యం పొందే ప్రయత్నం చేసాము. తరువాత అనేక ఆసనాలు వేసాము.
ఇప్పుడు అన్నిటి కంటే గొప్ప యోగం ఏంటో నాకు తెలిసి వచ్చింది. అది వేమన పద్యం ద్వారా తెలియజేస్తాను. "ఆసనాది విద్యలభ్యాస విద్యలు, మానసంబు కలిమి మధ్యమంబు, ఊరకుండుటెల్ల ఉత్తమ యోగంబు, విశ్వదాభిరామ వినుర వేమ" . ఊరికే ఉండేవాడిని ఊరంతా కలిసినా ఏమీ చేసుకోలేదు అనేది అందుకే. ఈ ఊరికే ఉండడాన్నే యోగ పరిభాష లో స్థితప్రజ్ఞత అంటారు. అదే యోగం యొక్క పరాకాష్ఠ. యోగా వలన వచ్చేది సమాధి స్థితి. సమాధి అంటే అందరికీ జీవితం చివరలో వచ్చే సమాధి కాదు. అది ఎలాగూ వస్తుంది. యోగం లో సమాధి అంటే "అన్నీ ఉన్న స్థితి, ఏదీ కాబట్టని స్థితి" .
యోగాసనాలు వేయడం ముగిసిన తరువాత ప్రిన్సిపల్ పద్మ శ్రీ గారు, శ్రీరామ్ గారితో కలిసి అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. చివరగా జగత్ ఫార్మా వారు ఇచ్చిన ORS ద్రవం పుచ్చుకుని అందరం ఇంటి దారి పట్టాము.
సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయః
సర్వే భద్రాణి పశ్యన్తి
మా కశ్చిత్ దు:ఖ భాగ్భవేత్
"మనం ఎవ్వరమూ కూడా యోగంతో వియోగం పొందకుందుము గాక"