మన చరిత్ర - ఏటుకూరు బలరామమూర్తి
అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి 1991 వ సంవత్సరంలో డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటపడ్డాను. నా పరిస్థితి "Hello student how are you? After studies who are You?" అన్నట్టు ఉండేది. నా మార్కెట్ విలువ దారుణంగా పడిపోయింది. నేను చదివిన కోర్సుకు కూడా విలువ పడిపోయింది. ఒక రకమైన identity crisis లోనికి జారిపోయాను. నాకూ, నేను చదివిన కోర్సుకు మార్కెట్ విలువ తగ్గి పోవడానికి కారణం కొత్తగా మొదలైన కంప్యూటర్ కోర్సులు. నాకు డిగ్రీలో వచ్చిన అత్తెసరు మార్కులకు పీజీ సీట్ కూడా రాకపోవడంతో, నా జీవితం లోకి ఒక శూన్యత ప్రవేశించింది. అప్పుడు నా దృష్టి సివిల్ సర్వీసెస్ శిక్షణ వైపు మళ్లింది. అప్పుడు వెంటనే హైదరాబాద్ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న R C Reddy Coaching Center చేరిపోయాను. ఇక్కడ నేను ఆ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించానా !లేదా ! అనేది అప్రస్తుతం. కానీ ఆ కాలంలో నేను చదివిన చాలా పుస్తకాలు నా చారిత్రక మరియు తాత్విక దృక్పథాలను సమూలంగా మార్చేసాయి. అలా ఆ కాలంలో నేను చదివిన పుస్తకమే పైన పేర్కొన్న ఏటుకూరి బలరామమూర్తి రచించిన మన చరిత్ర. మార్క్సిస్ట్ తాత్విక కోణం లో రచించిన ఈ పుస్తకం చదివి నేను మార్క్సిస్ట్ అయ్యాను అని చెప్పను కానీ, అంతకు ముందు నాలో ఉన్న చాదస్తపు వైదికపు పోకడలు సడలడం మాత్రం మొదలెట్టాయి. ఇప్పటికీ నాలో కొన్ని అలాంటి పోకడలు అవశేషాలుగా మిగిలిపోయి ఉండొచ్చు. ఈ పుస్తకంలో నాకు నచ్చిన అంశాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. నా అభిప్రాయం ప్రకారం ప్రతి స్టూడెంట్ డిగ్రీ స్థాయిలోనే ఈ పుస్తకం చదవాలి. ఇలా అప్పుడెప్పుడో చదివిన ఈ పుస్తకం గురించిన ప్రస్తావన ఇప్పుడెందుకు అంటారా?
నేను రోజూ వెళ్లే కాలేజీ కాక, తరచూ సందర్శించే ప్రదేశాలు గుళ్లూ, గోపురాలు. వీటికంటే కూడా నేను తరచూ వెళ్ళేది విశాలాంధ్ర పుస్తకాల షాప్. అలా ఇటీవల విశాలాంధ్ర లోకి తొంగిచూసిన నాకు ఈ మన చరిత్ర కనపడడంతో కొని చదవడం మొదలెట్టాను. వయసుతో పాటు నాలో పరిపక్వతనో, అపరిపక్వతనో వచ్చి చేరే ఉంటుంది కదా!!!! ఇప్పుడు ఈ పుస్తకం చదివి చూస్తే ఎలా ఉంటుంది అనే ఉత్సుకతతో కొన్నాను. తరువాత NPTEL పరీక్ష ఉండడం తో వెంటనే చదవలేకపోయాను. పరీక్ష సెప్టెంబర్ 20, 2025 తేదీన ముగియడంతో వెంటనే చదవడం మొదలెట్టాను. ఈ పుస్తకంలోని విషయాలకు కాలదోషం పట్టలేదని చదవడం మొదలెట్టిన కాసేపటికే నాకు అర్థం అయ్యింది.
ఈ పుస్తకం విద్యార్థులకు చరిత్ర పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. ఈ పుస్తకం చదవడం ద్వారా నేను తెలుసుకున్న అంశాలు, వాటికి సంబంధించిన వివరణలు క్రింద పేర్కొంటున్నాను.
- భారత దేశ నాగరికతను ఆర్యులు ప్రారంభించలేదు. ఆర్యుల రాకకు పూర్వమే భరత ఖండంలో Urban Civilization గా పేరుగాంచిన సింధూ నాగరికత మహోజ్వలంగా విలసిల్లింది. వేదాలలో హిందూ అనే పదం లేదు. ఇప్పుడు ఎక్కువగా మనం చదువుతున్నది రాచరిక చరిత్రే కానీ సామాజిక చరిత్ర కాదు. "ఏ యుద్దం ఎందుకు జరిగెనో , ఏ రాజ్యం ఎన్నాళ్లుందో , తారీఖులు, దస్తావేజులు ఇది కాదోయ్ చరిత్ర సారం" అనే విషయం మనకు తెలిసిన తరువాతనే, మనం చరిత్ర చదివే తీరు మారింది. చరిత్రను అర్థం చేసుకునే తీరు మారింది.
- పురాణాలలో చాలా వరకు కుటుంబ కలహాలు వర్ణించబడ్డాయి. శాపాల సందడి ఎక్కువగా కనపడుతుంది. బ్రాహ్మణ, క్షత్రియుల వైరాలు చరిత్ర గతిని మార్చాయి. సమాజంలో మిగిలిన వర్ణాల చరిత్ర నమోదు చేయబడలేదు.
- యుద్ధాలన్నిటిని మతాల మధ్య చిచ్చుగా చూడలేము. మతానికి, రాజ్యానికి ఏ కాలంలోనైనా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. రాజ్యం ఏదో ఒక మతం తో అంటకాగుతుంది. దీనికి వైదిక, జైన మరియు బౌద్ధ మతాలు ఏ మాత్రం మినహాయింపులు కావు. అసలు రాజులను ఆశ్రయించకుంటే మతాలు మనుగడ సాగించలేవు. కాబట్టి ఏ మతాన్ని ప్రత్యేకించి నిరసించాల్సిన పనీ లేదు. ఏ మతాన్ని నెత్తికెత్తుకోవాల్సిన పనీ లేదు.
- ప్రాచీన శిలాయుగపు ఆనవాళ్లు బళ్ళారి ప్రాంతంలో కూడా కనిపించాయి. పీఠభూముల్లోనే ప్రాచీన శిలా యుగపు మానవుడు సంచరించాడు. ఇక సికింద్రాబాదు లోని బేగంపేట విమానాశ్రయం వద్ద నవీన శిలా యుగానికి చెందిన సమాధులు కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాలలో కనిపించే రాక్షస గుళ్లు ఇలాంటి సమాధులే. ఆది మానవుడి సమాధులు కళ్యాణదుర్గం ప్రాంతం లో కూడా కనిపిస్తాయి.
- మానవ నాగరికత ప్రస్థానం ఆఫ్రికా నుంచి మొదలయ్యినట్టు ఉంది. భారత దేశం లోకి మొదటగా ఆఫ్రికా ఖండం నుంచి నెగ్రిటో జాతి వారు వచ్చారు. తరువాత మధ్యధరా ప్రాంతం నుంచి ప్రోటో ఆస్ట్రలాయిడ్ తెగ వారు వచ్చారు. ద్రావిడులుగా తరువాత పిలవబడిన వారు కూడా మధ్యధరా వాసులే. వీరి దేహ ఛాయ నలుపు. కుండలు చేయడం, కందమూల ఫలాల సేకరణ ఆస్ట్రలాయిడ్ తెగ నుంచి మనకు వచ్చి చేరిన నైపుణ్యాలు.
- హరప్పా ను గురించి ప్రజానీకానికి తెలియజేసినది కనింగ్ హామ్. బెనర్జీ మొహంజొదారో గురించి చాలా సమాచారాన్నే అందించాడు. సింధూ నాగరికత చాలా విస్తృతమైనది. ఇనుము తెలియకున్నా రాగి, కంచు లాంటి లోహాలు వీరికి తెలుసు. సింధూ నగరాల నమూనాలు పరిశీలిస్తే మేడలు, మిద్దెలు, వాణిజ్య సముదాయాలు ఉన్నట్టు అర్థం అవుతుంది. మాతృ స్వామ్య వ్యవస్థ ఉండేది. సర్ జాన్ మార్షల్ ఈ నాగరికత గురించి చాలా విషయాలు ఏకరువు పెట్టాడు. సింధూ ప్రజలు పత్తి, ఉన్ని వాడకం తెలిసిన వారు. వ్యవసాయం తెలుసు. చిత్ర లిపి కలిగిన వారు. సింధూ నాగరికతా కాలం నాటి చిత్రాలలో మేక, దున్న, వృషభం, ఖడ్గ మృగం లాంటి జంతువులు కనిపిస్తాయి. దిసమొలతో ఉన్న స్త్రీ విగ్రహాలు కనిపిస్తాయి. మొహంజొదారో ప్రాంతంలో కనిపించిన Dancing Girl గురించి అందరికీ తెలిసిందే కదా!!!లింగాకారాలు కనిపించాయి కానీ వాటికి మత ప్రాధాన్యత ఉందో లేదో తెలియలేదు. పశుపతి పూజ కనిపిస్తుంది. అమ్మ తల్లి ఆరాధన కనిపిస్తుంది. ఋగ్వేదం లో లింగ పూజ చేసే వారి గురించి ఉన్న నిరసన వాక్యాలు ఆర్యులు సింధూ ప్రజల మధ్య వైషమ్యాలను తెలియజేస్తాయి. ఆర్యులకు, ఆది శైవానికి మధ్య ఘర్షణ జరిగి ఉండొచ్చు అంటారు రచయిత. అద్దాలు, దువ్వెనలు ఆనాటికే కనిపెట్టేసారు మరి. అంటే సౌందర్య లాలస మొదలయ్యింది. కొప్పులో దువ్వెనలు ఉంచుకున్న స్త్రీ, పురుష విగ్రహాలు సింధూ నాగరికతా కాలంలో కనిపిస్తాయి. జూద గృహాలు కూడా ఉన్నట్టే ఉన్నాయి. మా కోచింగ్ సెంటర్ లో చెప్పిన ఒక విషయం ఇప్పుడు గుర్తుకు వస్తోంది. సింధూ నాగరికతా కాలంలో aristocracy ఉండేది అని చెప్పారు. స్త్రీ యోని నుండి ఒక వృక్షం పైకి వస్తున్న చిత్రం కూడా ఆ కాలం నాటిదే. స్త్రీని ఉత్పత్తి శక్తికి కేంద్రంగా వర్ణించే ప్రయత్నం కావొచ్చు ఇది. హరప్పా అనే పేరు ప్రాచీన ఆది శైవాన్ని సూచిస్తుందా? చరిత్రకారులే చెప్పాలి మరి!!!!
- సింధూ నాగరికత కాలంలోనే నర బలులు ఉండేవి. స్త్రీని పురుషుడు వధిస్తున్న చిత్రం దీనికి నిదర్శనం. శవాలను మొదట్లో ఖననం చేసేవారు. ఎందుకంటే ఆత్మ శరీరం తో పాటుగా జన్మ తీసుకుంటుంది అని అప్పట్లో నమ్మే వారు. అందుకే శరీరాన్ని పాతి పెట్టేవారు. తరువాత శరీర భ్రాంతి ఉడిగిన కాలంలో ఆత్మ ప్రాధాన్యం పెరిగింది. అప్పట్నుంచి శవాల దహనం మొదలయ్యింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పీటముడి తెగనే లేదు స్వామి!!!! చావు, పుట్టుకల చుట్టూ చాలా తతంగమే చేరి పోయింది.
- తరువాత కాలంలో గుర్రాలెక్కి, విల్లంబులు ధరించి ఆర్యులు సింధూ ప్రజల మీద విరుచుకు పడ్డారు. మొహంజొదారోను మృతుల దిబ్బ చేసి వదిలారు. సింధూ నాగరికత ద్రావిడ నాగరికత. ఆర్యుల రాకతో ద్రావిడులకు, ఆర్యులకు మధ్య యుద్దాలు జరిగాయి. వ్యవసాయ నాగరికత ప్రధానంగా జీవిస్తున్న సింధూ ప్రజలు శాంతి కాముకులు. యుద్దం వారికి తెలియదు. ఆర్యులు సంచార తెగలు. ఇనుము తెలియడం వలన కత్తులు చేసుకుని, గుర్రాల మీద తెగబడ్డారు.
- తరువాత కాలంలో ఆర్య ద్రావిడ తెగలు కలిసిపోయాయి. ఆర్యుల మొదటి గ్రంథం ఋగ్వేదానికి, ఇరానియన్ల గ్రంథం ఆవేస్తా కి చాలా పోలికలే ఉన్నాయి. ఇరానియన్లే ఆర్యన్లయ్యారా???? ఆర్యులకు, ఇరానియన్లకు కూడా దైవమైన మిత్ర నే ఇప్పుడు సూర్యుడిగా మనం ఆరాధిస్తున్నాము. వేదాలలో చెప్పబడిన ఇంద్రుడు ఆర్య ప్రతినిధి. ద్రవిడులు నిర్మించిన పురాలను నాశనం చేసేవాడు కాబట్టి ఇంద్రుడిని పురంధరుడు అని కూడా పిలిచేవారు. వేదాల నుంచి పురాణాలకు వచ్చేసరికి ఇంద్ర ప్రాశస్త్యం తగ్గింది. దైవాసుర సంఘర్షణలు, త్రిపురాసుర సంహారం లాంటి కథలన్నీ బహుశా ఆర్య ద్రావిడ సంఘర్షణలు కావొచ్చు.
- సుదాస్ అనే గణాధిపతి పది మంది శత్రు రాజులను రావి నదిలో ముంచి చంపేస్తాడు. సుదాస్ భరత వంశజుడైన ఆర్యుడు. ఇతను చంపిన పది మంది రాజులు కూడా ఆర్యులే. అంటే ఆర్య తెగలు ఒకే సారి భరత ఖండంలోకి ప్రవేశించలేదు. అలలు, అలలుగా వచ్చారు. తరువాత వచ్చిన వారు, అంతకు ముందు వచ్చిన వారితో ఘర్షణ పడ్డారు. సుదాస్ పురోహితుడే విశ్వామిత్రుడు. సుదాస్ తదనంతర కాలంలో విశ్వామిత్రుడిని తొలగించి వశిష్టుడిని పురోహితుడిగా చేస్తాడు. బహుశా అందుకే విశ్వామిత్రుడికి, వశిష్టుడికి మధ్య వైరం మొదలైఉంటుంది. దీనిని బ్రహ్మర్షి, రాజర్షి వైరంగా పురాణాలు చిత్రీకరించాయి. విశ్వామిత్రుడు పురాణ వాఙ్మయంలో కొన్ని చోట్ల ఉదాత్తంగా, మరికొన్ని చోట్ల తద్విరుద్దంగా కనిపిస్తాడు. రామాయణం లో రామచంద్రుడికి అస్త్ర, శస్త్ర మంత్రాలు నేర్పింది విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడు రాముడుకి ఉపదేశించిన బల, అతి బల మంత్రాలు యుక్త వయసులో చాపల్యం కొద్దీ నేను పఠించేవాడిని. ఇలా మంత్రాలకు నాకు రాలిన చింతకాయలు నా దగ్గర ఇప్పటికే చాలా పోగుపడ్డాయి. చాలా చోట్ల పురాణాలలో మనకు ఋషులు కనిపిస్తారు. ఎంతో తపస్సు చేసి పరస్పరం శాపాలు పెట్టుకునే వారు వీళ్లు. మనం నామవాచకాలుగా అనుకునే విశ్వామిత్ర, వశిష్ట, వేద వ్యాస మరియు శంకర శబ్దాలు నిజానికి సర్వనామాలు. తమకంటే కాస్త ముందుగా భారత దేశంలో స్థిరపడిన ఆస్సీరియన్ తెగ వారినే ఆర్యులు అసురులు అన్నారు. ద్రావిడ దాసులనే దస్యులన్నారు. దస్యులే శూద్రులుగా మారి ఉంటారు.
- సమిష్టి జీవన విధానానికి ప్రతీక అయిన యజ్ఞం తరువాత కాలంలో మత కర్మ అయ్యింది. దానిలోకి అతి మానుష శక్తులు ప్రవేశించాయి. వేద కాలం లో ఉన్న గణాలలో ఉత్పత్తి, పంపకం మరియు స్త్రీ, పురుష సంబంధాలు అన్నీ సామూహిక కార్యాలే. సమిష్టి భావనకు ప్రతీకనే బ్రహ్మ. సొంత ఆస్తి లేని రోజులు అవి. గణాలనే వైరాజ్యాలు అనేవారు. యజ్ఞ కర్మలు పురోహిత వర్గం చేతిలోకి వెళ్లిపోయాయి. బానిస వ్యవస్థ అవశేషంగా వర్ణ వ్యవస్థ రూపొందింది. పురోహితులు చాలా తంతులు ప్రవేశపెట్టారు. అన్నీ వారికి లాభం చేకూర్చేవే. దేవతలకు బలులు ఇస్తూ, తాము దానాలు తీసుకునేవారు. దానాలను తప్పనిసరి చేస్తూ దాన శ్రుతులను ఏర్పరిచారు. దీని వలననే హరిశ్చంద్రుడు, రంతి దేవుడు లాంటి వారు కుదేలయ్యారని రచయిత చెప్పడం సందర్భోచితంగా అనిపిస్తుంది. బ్రాహ్మణులు వ్యవసాయం కూడా చేసేవారు అప్పట్లో. ఖాండవ దహనం అర్జునుడు చేసింది బ్రాహ్మణుడికి ఆ భూభాగం దానం ఇయ్యడానికే కదా!!! ఇప్పుడైతే బాపన సేద్యం భత్యం చేటు అనే మాట వాడుకలోకి వచ్చింది.
- పాలు పితికే బాధ్యత కూతురిది కాబట్టి ఆమెను దుహిత అన్నారు. పశువు నడకను దూరానికి ప్రమాణంగా భావించారు కాబట్టి గవ్యూతీ అనే పదం ఏర్పడింది. వేద కాలంలో వేయించిన ధాన్యాన్ని దానా అని, రొట్టె ను అపూపం అని, పిండిని కరంభం అని పిలిచేవారు. ఇలాంటి పద బంధాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలలో చాలానే కనిపిస్తాయి. గ్రీక్, లాటిన్ మరియు కెల్టిన్ భాషలకు, సంస్కృతానికి చాలా దగ్గర సంబంధం ఉంది మరి.