Monday, December 22, 2025


స్వర్ణ నారాయణ గారు ప్రారంభించిన పల్లవి రీడర్స్ క్లబ్ సమూహం లో నేను ఉండడం వలన నాకు అనేక రకాల పుస్తకాల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతోంది. అలా నా దృష్టికి వచ్చిన ఒక పుస్తకం శ్రీ పద్మ ఆంగ్లం లో రచించిన మరియు అరుణా ప్రసాద్ గారు తెలుగులోకి అనువదించిన 'గ్రామ దేవత' పుస్తకం. నాకు మనుషులకన్నా కూడా దేవతలను ప్రేమించే అలవాటు ఉండడం వలన ఆ పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించేసుకున్నాను. వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా చదవడం మొదలెట్టేసాను. ఈ పుస్తకం చదువుతుంటే, నాకు గ్రామ దేవతలతో ఉన్న అనుభవాలు  గుర్తుకు వచ్చాయి. ఆ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూనే సమీక్ష చేసాను. 

బాల్యంలో నాకు తట్టు పోసింది. శరీరం అంతా కురుపులు లేచాయి. స్నానం లేదు, పానం లేదు. వేపాకు రసం పూసిన గుర్తు కొద్దిగా ఉంది. మందులూ, మాకులతో కాకుండా వేపాకులతో నాకు ట్రీట్మెంట్ జరిగింది. పది రోజుల తరువాత వేపాకు వేసిన ఉష్ణోదకం తో స్నానం చేయించారు. తరువాత ఇప్పుడు అనంతపురం రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద ఉన్న పెద్దమ్మ గుడికి మా పితామహులు పిలుచుకుని వెళ్లారు. అక్కడ అమ్మవారికి ఒక టెంకాయ సమర్పించినట్టు నాకు గుర్తు. అదే నేను మొదటిసారి ఒక గ్రామ దేవత గుడికి వెళ్ళడం. వైష్ణవ సంప్రదాయం లో పుట్టి పెరగడం వలన గ్రామ దేవతలకు నేను కొద్దిగా ఎడంగానే ఉన్నానని చెప్పవచ్చు. మా పితామహి కూడా గూళ్యం లో ఆమెకు గ్రామ దేవత అయిన కొల్లాపురమ్మ కనిపించిందని నాతో అప్పుడప్పుడు చెప్పేది. ఇటీవల గూళ్యం వెళ్లినప్పుడు కొల్లాపురమ్మను చూసి వచ్చాను. అలాగే గూళ్యంలో యేటి గట్టున ఉన్న సుబ్బరాయడి గుడి కూడా చూసివచ్చాను. 

ఏడవ తరగతిలో ఉండగా నాన్నకు ఉరవకొండ బదిలీ అయ్యింది. అప్పుడు మేము చందా వెంకట స్వామి ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లము. చాలా పెద్ద ఇల్లు. ఇంటి బయట రెండు విశాలమైన అరుగులు. అసలు ఆ వీధిలోనే ఏదో mysticism ఉన్నట్టుగా నాకు ఆ బాల్యంలో అనిపించేది. అప్పుడే నాకు ఇంకో గ్రామ దేవత పరిచయం అయ్యింది. ఆమెనే ఏడు తలల తాయమ్మ. మా చిన్న మేనత్త ఒక సారి నిద్రలో కిర్లుకుని లేచినప్పుడు, ఆమెకు ఈ ఏడు తలల తాయమ్మ దర్శనమయ్యిందని మా ఇంట్లో మిగిలిన ఆడవాళ్లు నిర్దారించేసారు. మా మేనత్త ను కూడా దబాయించి అది నిజమని నమ్మేలా చేసారు. ఇప్పుడు కూడా ఆమె దానిని నిజమని నమ్ముతూ నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా నాకు దాని గురించి చెపుతూ ఉంటుంది. తమాషా ఏమంటే మేము ఉరవకొండలో ఉన్న మూడేళ్ల కాలంలో ఏ రోజు కూడా ఏడు తలల తాయెమ్మ గుడికి వెళ్లలేదు. అసలు ఆ గుడి ఉందో లేదో కూడా నాకు ఇప్పటికీ తెలియదు. కానీ నాకు ఒకటి మాత్రం అర్థమయ్యింది. మనకు మంచి జరిగినా, చెడు జరిగినా దానికి కారణం దేవతలే అని జనం నమ్ముతారని. ఎందుకిలా???? వారికి ఇతర వ్యాపకాలు లేవా!!!!! నాకు తెలిసిన మరో ఉదంతం చెపుతాను. మా బంధు వర్గం లో ఒక అబ్బాయికి ఆట్లమ్మ పోసింది. ఆమె ఉగ్ర దేవత అని, ఉపశమించాలంటే నీరా తాగాలని ఎవరో సలహా ఇచ్చారు. ఇక ఆ తండ్రి నీరా తేవడానికి వెళ్లి, తెలిసో తెలియకో ఏకంగా కల్లు తెచ్చి, పిల్లోడికి ఒక గుటక వేయించి, తనో రెండు గుటకలు వేసాడు. నిషా తండ్రీ, కొడుకులకు నషాళానికి అంటడంతో కల్లు సేవించడం అలవాటై కూచుంది. ఇప్పటికీ  ఆ తండ్రీ కొడుకులు ఆ అలవాటు మానలేదు మరి.  

ఇదే ఉరవకొండ లో ఉండగానే ఆ ఇంటి అరుగుల మీదనో, లేదా ఇంటి వరండా లోనో తాత పోతన  భాగవతం చదువుతుంటే వింటూ ఉండేవాడిని. భాగవత సంప్రదాయం లో యోగ మాయ ప్రస్తావన వస్తుంది. ఆ యోగమాయే ఈ గ్రామ దేవతలని మా పితామహులు చెప్పేవారు. నిజానికి  యోగమాయగా రూపాంతీకరణం ఎలా జరిగిందో ఈ 'గ్రామ దేవత' పుస్తకంలో చక్కగా వివరించారు. సింధూ నాగరికత లో మొదలైన అమ్మ తల్లి ఆరాధన ఎలా గ్రామ దేవతలుగా పరిణామం చెందిందో, తరువాత బౌద్ధం, జైనం మరియు వైదిక మతాలు ఈ గ్రామ దేవతారాధనను వివిధ రూపాలలో ఎలా కొనసాగించాయో చక్కగా వివరించారు. 

మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీ దేవతలుగా చెలామణి అయిన వారు పితృస్వామ్య వ్యవస్థ ప్రారంభమైన తరువాత కనుమరుగై వారి స్థానంలో పురుష దేవతలు ఎలా వచ్చారో ఉదాహరణాలతో ఈ పుస్తకంలో వివరించారు. ఆదిమ వ్యవస్థలో నగ్నంగా మలచబడిన ఈ దేవతలు తరువాత నగ్నత్వాన్ని వదిలించుకోవడం జరిగింది. దీనికి కారణం బ్రాహ్మణీకరణ. బ్రాహ్మణ పూజారులు వచ్చిన తరువాత దేవతలకు పట్టు వస్త్రాలు కట్టడం మొదలయ్యింది. నగ్నత్వాన్ని నాగరిక ప్రపంచం అంగీకరించకపోవడమే దీనికి కారణం. ఇప్పుడు చాలా దేవతల గుడులలో వస్త్రాలంకరణ సేవలు జరుగుతున్నాయి. దేవతా మూర్తికి ధరింపజేసిన చీరా, రవికలను వేలం వేసి మరీ అమ్ముతున్నారు. ఆదిమ వ్యవస్థలో నగ్నత్వం సహజత్వానికి, పునరుత్పత్తి శక్తికి ప్రతీక. ఈ నాగరిక ప్రపంచంలో కూడా కొన్ని చోట్ల దేవతలు నగ్నత్వాన్ని నిలుపుకున్నారు. అలంపూరులో రేణుకా దేవి విగ్రహం ఇందుకు ఉదాహరణ. ఆదిమ వ్యవస్థలో దేవతా విగ్రహం లో తల, కాళ్లు, యోని మాత్రమే మలచబడేవి. ఇవన్నీ ప్రకృతి యొక్క పునరుత్పత్తి శక్తికి ప్రతీకలు. వైదికం నగ్నత్వాన్ని ఇష్టపడదు. లజ్జా గౌరి పృష్ట భాగాన్ని లంగోటి వంటి వస్త్రంతో అలంకరించడం బ్రాహ్మణీకరణలో భాగమై ఉంటుంది. ఆదిమ నగ్న దేవతా రూపాలని మొదట బౌద్ధ జైనాలు తమలో కలుపుకుంటే, తరువాత శైవ, వైష్ణవాలు ఈ దేవతా మూర్తులకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి తమలో కలిపేసుకున్నాయి. శైవం గ్రామ దేవతల వ్యవస్థను పూర్తిగా ఆక్రమించి వేసింది. చాలా మంది గ్రామ దేవతలు శివుడి భార్యలుగా చెలామణి కావడం ప్రారంభించారు.  కొన్ని చోట్ల మాత్రం దేవతలు తమ నగ్నత్వాన్ని నిలుపుకున్నాయి. మధురకు చెందిన ఒక శిల్పంలో దేవత తన ఎడమ చన్నును పట్టుకుని, ఎడమ చేత్తో యోని భాగాన్ని చూపిస్తూ ఉండడం పునరుత్పత్తి శక్తిని, పోషణను సూచించే అంశంగానే పరిగణించాలి. 

శ్రీవత్సం అనే లాంఛనం ఒక చిక్కుముడిలా మొదలై స్త్రీ రూపంగా ఎలా మారిందో చక్కగా వివరించారు. ఇదే శ్రీవత్సం బౌద్ధుల సిరిగా మారి తరువాత లక్ష్మీ దేవిగా రూపాంతరం చెందింది అని చక్కగా వివరించారు. వైష్ణవం లో విష్ణువు వక్షస్థలం మీద ఉన్న మచ్చను శ్రీవత్సం అంటారు. బ్రాహ్మణులలో శ్రీవత్స గోత్రం వారు ఉన్నారు. 'శ్రీ వత్స వక్షా శ్రీవాసః శ్రీనిధి శ్రీ విభావనః " అని నేను నిత్యం విష్ణు సహస్రనామం అనుసంధానం చేసేటప్పుడు చెప్పుకుంటూనే ఉంటాను. గజ లక్ష్మీ దేవత పరిణామం గురించి చక్కగా వివరించారు. 

బాటలో గంగమ్మ గురించి చదువుతుంటే నాకు గుత్తి వద్ద ఉన్న బాటలో సుంకులమ్మ గుర్తుకు వచ్చింది. గంగ జాతరంటే చిత్తూరు, తిరుపతి ప్రాంతాలలో చూడాలి. పురుషులు స్త్రీ వేషాలను ధరించి బూతులతో చెలరేగి పోతారు. వెంకటగిరి పోలేరమ్మ జాతరలో కూడా బూతుల తంతు విస్తృతంగానే కనిపిస్తుంది. వెంకటగిరి పోలేరును నేను చాలా కాలం క్రితం చూసాను. తిరుపతి తాతయ్య గుంట గంగ జాతరను చాలా సార్లే చూసాను. జాతర చివరి రోజు గంగమ్మ చెంప నరుకుతారు. 'తిరుపతి కథలు'  అనే పుస్తకంలో ఒక తాగుబోతు గంగమ్మతో రచ్చకేసుకున్న కథనం భలే ఉంది. అసలు ఈ గ్రామ దేవతలది వేరే జోనర్ అనుకుంటాను. కల్యాణదుర్గం లో అక్కమ్మ జాతర కూడా చూసాను. రెడ్డమ్మ కొండ కూడా చూసాను. సమయపురం మారియమ్మ ను దర్శించుకున్నాను. ఒక్కోచోట ఒక్కో కథ.  రేణుకా ఎల్లమ్మ కథలు చాలానే ప్రచారంలో ఉన్నాయి. నేను రేణుకా దేవి గురించి దత్త చరిత్రలో మొదటిసారి చదివాను. నేను కోడూరు వద్ద ఉన్న చిన్న ఓరంపాడులో పనిచేసేటప్పుడు బస్సులో పోతూ ఉంటే నాకు మాతంగి గుడి ( చాలా చిన్నది) ఒకటి రోడ్డుకి వారగా కనిపించేది. తిరుమల లో కూడా గంగమ్మ గుడి ఉందట. 

గ్రామ దేవత పూజలు మొదటగా చిహ్నాలతో మొదలయ్యాయి. దానిలో ఒక చిహ్నం ఘటం. ఈ ఘటమే వైదికంలో కలశంగా వ్యవహరించబడుతోంది. ఈ కలశం ప్రతి వైదిక తంతులోనూ కనిపించాల్సిందే. కొన్ని చోట్ల చిల్లుల కుండను కూడా అమ్మవారి ప్రతీక గా వాడతారు. ఈ ఘటం ఘట్టం చదువుతుండంగా మా మామగారు కాలంచేసారు. అప్పుడు కర్త అయిన మా బావమరిది చేసే అపరకర్మ చూస్తుంటే నాకు ఘటం యొక్క ప్రాధాన్యత తెలిసి వచ్చింది. అసలు ఘటం దేనికి ప్రతీక????? కుండ పూర్ణత్వానికి ప్రతీక. అలాగే గర్భానికి ప్రతీక. శరీరాన్ని కూడా ఘటం అనే అంటారు. చావుతో ఈ ఘట భ్రాంతి తొలగిపోతుంది. నిప్పు మోయడానికి, నీరు మోయడానికి కూడా కుండనే ఉపయోగిస్తారు. మట్టి తో చేయబడిన కుండ విరిగి మట్టిలో కలిసిపోయినట్టే, దేహం కూడా మట్టిలో నుంచి వచ్చి మట్టిలో కలిసిపోతుంది అని కుండ సూచిస్తుంది. 'విడిచి పోవు కుండకు విభ్రాంతి పడుదురు' అని వేమన మనల్ని హెచ్చరిస్తాడు. వేమన ఓ మొండి ఘటం లెండి!!!!!. ఫలప్రదాయిని దేవత చిహ్నమైన కుండ ఇంకా ఇలా తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. గ్రామ దేవతలను పుట్ట మన్ను రూపంలో, పుట్ట రూపంలో పూజించడానికి కారణం కూడా మట్టితో మనకున్న అనుబంధమే. చక్రం, నందిపాదం, శంఖం లాంటి లాంఛనాలు పూర్తీగా బ్రాహ్మణీకరణ చెందాయి. వీటిలో కొన్ని విష్ణు చిహ్నాలుగా మారిపోతే, కొన్ని శైవ లాంఛనాలుగా చెలామణి అవుతున్నాయి. 

ఇక పద్మం అన్ని మతాలలో కనిపిస్తుంది. లక్ష్మికి మరో పేరు కమల. పద్మం లో మహా లక్ష్మి ఆసీనురాలై ఉంటుంది. తామర తూడుకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఈ పద్మ చిహ్నమే వైష్ణవంలో పుండరీకాక్ష తత్వంగా రూపాంతరం చెంది ఉండొచ్చు. దేనినీ అంటుకోని తత్వం పద్మ పత్రానిది. 'నళినీ దళ గత జలమతి తరళం' అనే శ్లోకాన్ని మీరు వినే ఉంటారు.  ఒకప్పుడు పద్మం రూపంలో సూచించబడిన ఫల ప్రదాయిని తరువాత ప్రసిద్ద దేవతగా మారిపోయింది. దేవతలు కామ రూపులు అని అందుకే అంటారేమో!!!!!! వారికి ఈ కామ రూప తత్వాన్ని ఇచ్చింది మనమే కదా!!!!

ఇక గ్రామ దేవత ఉపాసనతో పెనవేసుకు పోయిన నాగ చిహ్నం గురించి ఈ పుస్తకం లో చాలా సమాచారమే ఉంది. జంట సర్పాల విగ్రహాలు అనేకం ప్రతి గ్రామంలో రావి చెట్టు కింద కనిపిస్తాయి. దేవత ద్విలింగ జీవి అని ఈ విగ్రహాలు తెలియజేస్తాయి. ఈ నాగులే తరువాతి కాలం లో బౌద్ధం మరియు జైనం లోకి కూడా ప్రవేశించారు. బౌద్ధ జాతక కథలలో ముచికుందుడు ఒక ప్రసిద్ధ నాగ సర్పం. నేను భాగవతంలో తక్షక, కాళీయుడు సర్పాల గురించి చదివాను. ఫల ప్రదాయిని గా గ్రామ దేవత ఉన్న కాలం నుంచి ప్రసిద్ద దేవతల కాలం వరకు కూడా  ఈ నాగ దేవతా చిహ్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. నాగారాధన మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాలలో కూడా కనిపిస్తుంది. ఈ నాగ దేవతా చిహ్నానికే పురుష రూపం ఇచ్చి ఆదిశేషుడిగా మార్చి వైష్ణవం తనలో కలిపేసుకుంది. ఈ సంప్రదాయం ప్రకారం ఈ భూమికి ఆధారం ఆదిశేషుడే. శైవం కూడా నాగ దేవతకు పురుష రూపం ఇచ్చి సుబ్రమణ్యుడిగా మార్చింది. గ్రామాలలో ఈ సుబ్రమణ్యుడినే సుబ్బరాయుడిగా పిలుస్తారు. నేను కుక్కే, పంపనూరు మరియు నాగలమడక ప్రాంతాలలో సుబ్రమణ్యుడి గుడులు చూసాను. రాహు కేతువులను కూడా సర్ప రూపాల లోనే ఇప్పటికీ కొలుస్తున్నారు. సంతాన సాఫల్యత కోసం సుబ్రమణ్యుడిని ఆరాధిస్తారు. కర్ణాటక లోని ఘాటీ లో సుబ్రమణ్య స్వామి గుడి ఉంది. అలాగే విదురాశ్వత్థం అనే ఊరిలో కొన్ని వేల నాగ ప్రతిమలు చూసాను. నాగ ప్రతిష్ట చేస్తే సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజలలో నేటికీ ఉంది. ఈ నాగ ప్రతిమల చారిత్రక పరిణామం గురించి ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. 

సతీ సహగమనం చేసిన స్త్రీలు దేవతలుగా కొలవబడుతున్నారు. ఆత్మ త్యాగం చేసుకున్న ముసలమ్మ లాంటి వారు మా అనంతపురంలో దేవతలుగా పూజలందుకుంటున్నారు. స్త్రీని బలి చేసేది మనుషులే, తిరిగి ఆ అపరాధ భావన నుంచి బయట పడడానికి వారిని దేవతలుగా చేసేది మనుషులే. మన మానసిక భావనలే దేవతలుగా పోత పోసుకున్నాయి. 

ఈ పుస్తకం చదువుతుంటే నాకు తిరుపతి చుట్టు పక్కల ప్రాంతాలలో జరిగే ద్రౌపదమ్మ జాతరలు గుర్తుకు వచ్చాయి. ఈ జాతరలో పొంగళ్లు నైవేద్యంగా పెడతారు. నల్ల పోచమ్మ కథ చాలా బాగుంది. గరిగెమ్మ కథలో కరుణ రసం  ఆవిష్కరించబడింది. మానవ నాగరికతా వికాసంలో ప్రతి భావోద్వేగానికి ఒక దేవత, ప్రతి సమస్యకు ఒక దేవత, ప్రతి సన్నివేశానికి ఒక దేవతను రూపొందించడం జరిగింది. దైవ భావన అనాది కాలంగా మానవాళికి ఒక ఆలంబన అని తెలుస్తోంది. 

తెలియని వాటిని, కనపడని వాటిని ప్రేమించడం మనిషి లక్షణం. అందుకే నేను దేవుళ్లను ప్రేమిస్తాను. మీరు కూడా ఈ గ్రామ దేవత పుస్తకం చదివి మీ భావనామయ జగత్తును సుసంపన్నం చేసుకోండి. దేవతలను, ఆ మాటకొస్తే ఎవరినైనా ప్రేమించకున్నా పర్లేదు....  ద్వేషించకండి. యద్భావం తద్భవతి. 

స్వస్తి 

స్వర్ణ నారాయణ గారు ప్రారంభించిన పల్లవి రీడర్స్ క్లబ్ సమూహం లో నేను ఉండడం వలన నాకు అనేక రకాల పుస్తకాల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతోంది. అ...