Thursday, June 26, 2025

                               Multiple Activities in Our College Today 

1. Meeting is convened in the examination committee with the members of staff council regarding the conduct of internals, practical, CSP and internship for instant candidates. 

2. Later in the evening, we joined the meeting addressed by the District Collector and Superintendent of Police as a part of Nasha Mukth Bharath. 

I have also added the press clippings of my yesterday's programme held at Kadapa 
















Wednesday, June 25, 2025

  Drug Free India- Need of the Hour & Fostering Adaptability in the 21st Century Teaching Profession























    SKR & SKR Government College (A) (W), Kadapa Hosts Dual Programs on Critical Topics

Kadapa, June 25, 2025 – SKR & SKR Government College (A) (W), Kadapa, successfully hosted two impactful programs today: "Drug-Free India: Need of the Hour" in the morning session and "Fostering Adaptability in the 21st Century Teaching Profession" in the afternoon. Both events featured G.L.N. Prasad, Lecturer in Zoology, Government College (A), Anantapur, as the esteemed resource person.

Morning Session: Drug-Free India: Need of the Hour

The "Drug-Free India" program, organized by the Department of Chemistry, aimed to raise awareness about the pervasive issue of drug addiction. The session commenced with a crucial keynote introduction by Dr. V. Saleem Basha, Principal, setting the stage for the chief guest's address.

Mr. G L N Prasad delivered an insightful talk, explaining various types of drugs, including opioids and cannabinoids, and detailing their devastating impact on individuals and society. He also shed light on the complex processes of addiction and de-addiction. The newly constructed seminar hall, with its excellent ambience, provided an aesthetic backdrop for the event, which saw the participation of nearly 200 students and staff members. The session concluded with students offering valuable feedback.

Afternoon Session: Fostering Adaptability in the 21st Century Teaching Profession

In the afternoon, under the banner of IQAC and organized by Dr. Krishna Veni, a thought-provoking session on "Fostering Adaptability in the 21st Century Teaching Profession" took place. Mr. G L N  Prasad led a comprehensive discussion on the significant changes in traditional classroom teaching methodologies. A key focus was the essential shift from teacher-centric to student-centric learning methods, preparing educators for the evolving educational landscape.

 

 


Saturday, June 21, 2025

    YOGA DAY CELEBRATIONS IN GOVT ARTS COLLEGE, ANANTAPUR ON 21 JUNE 2025 

















అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానం లో అధ్యాపకులందరూ జూన్ 21, 2025 న వ్యాయామ అధ్యాపకులు శ్రీ రామ్ మరియు ప్రిన్సిపల్ పద్మ శ్రీ గారి ఆధ్వర్యం లో యోగ మార్గం పట్టారు. 200 మంది అధ్యాపకులు మరియు  అధ్యాపకేతర ఉద్యోగులు సుమారు రెండు గంటల పాటు వివిధ యోగాసనాలు వేసారు. ఈ కార్యక్రమానికి యాంకర్ గా ఆంగ్ల అధ్యాపకులు అహ్మద్ వ్యవహరించారు. 
అసలు ఈ యోగం అంటే ఏమిటి? ఈ కాలేజీ లో చదవడమే ఒక యోగం. అలాంటిది ఈ కాలేజీ లో పనిచేయడం మహా యోగం. అందరికీ ఆ యోగం పట్టకపోవచ్చు. అలా ఈ కాలేజీ లో చదువు చెపుతుండడం వల్ల మేమంతా యోగ మార్గంలో పయనిస్తున్నట్టే లెక్క. 
"యోగ: కర్మ సుకౌశల:" అని కృష్ణుడి  నిర్వచనం. అంటే Skill in action is Yoga" అని అర్థం. అంటే వృత్తి లో నైపుణ్యమే యోగం అని రూఢార్థం. దీని వలన  ఒరిగేదేమి? జరిగేదేమి? అంటే "యోగః చిత్త వృత్తి నిరోధక:" అని ఫల శృతి చెపుతారు. అంటే యోగం చేస్తే మనసు నిలిచిపోతుంది. మరి "మనసు నిలిపివేస్తే మాయ పోగట్టదా" అంటారు కదా!!!! కాబట్టి యోగా చేస్తే శరీరం, మనసు మరియు మెదడు మీద ఆధిపత్యం వస్తుంది. త్రికరణ శుద్ది వస్తుంది. మనస్యేకమ్ , వచస్యేకమ్ , కర్మణ్యేకమ్ మహాత్మనాత్ అన్నారు. అంటే యోగ మార్గం లో పయనిస్తే అందరూ కూడా మహాత్ములవుతారు. మనస్సే లేని అమనస్క యోగం సిద్దిస్తుంది. 
ఈ యోగాన్ని సోపాన మార్గం లో , అంటే అంచెలంచెలుగా సాధన చేయాలి. శరీరాన్ని మొదట నియంత్రించడం నేర్చుకుంటే మనసు మీద ఆధిపత్యం వస్తుంది. శరీరాన్నే అదుపు చేయలేని వాళ్లు, మనసును ఎలా నియంత్రిస్తారు? ఉట్టి కెక్కలేని అమ్మ స్వర్గానికి ఎలా ఎక్కుతుంది? కాబట్టి దీనిని సాధించడానికే భారతీయులందరూ జూన్ 21 న యోగాసనాలు వేసారు. ఒక్కో ఆసనం, ఒక్కో శారీరక రుగ్మతను తొలగిస్తుంది. ఒక్కో ఆసనానికి ఒక్కో రకమైన కర్మను తొలగించే శక్తి ఉంటుంది. ప్రతి ఆసనం మన శరీరంలోని షడ్చక్రాలలో ఏదో ఒక చక్రాన్ని క్రియాశీలకం చేసే సామర్థ్యం కలిగిఉంటుంది. మొదట "ఆసన సిద్ది " వస్తే, తరువాత "ఆశయ సిద్ది" వస్తుంది. కూచోవడమే చేతకాని వాడు కుప్పి గంతులు ఎలా వేస్తాడు? 
ఈ యోగా లో మొదటి అంశం శ్వాస మీద నియంత్రణ. మనసును కట్టడి చేయాలి అంటే శ్వాసను కట్టడి చేయాలి. కాబట్టి మొదటగా అధ్యాపకులందరూ కూడా ప్రాణాయామం చేసాము. మనందరిదీ "ఎక్కే శ్వాసా, దిగే శ్వాస" కాబట్టి శ్వాస మీద ఆధిపత్యం పొందే ప్రయత్నం చేసాము. తరువాత అనేక ఆసనాలు వేసాము. 
ఇప్పుడు అన్నిటి కంటే గొప్ప యోగం ఏంటో నాకు తెలిసి వచ్చింది. అది వేమన పద్యం ద్వారా తెలియజేస్తాను. "ఆసనాది విద్యలభ్యాస విద్యలు, మానసంబు కలిమి మధ్యమంబు, ఊరకుండుటెల్ల ఉత్తమ యోగంబు, విశ్వదాభిరామ వినుర వేమ" . ఊరికే ఉండేవాడిని ఊరంతా కలిసినా ఏమీ చేసుకోలేదు అనేది అందుకే. ఈ ఊరికే ఉండడాన్నే యోగ పరిభాష లో స్థితప్రజ్ఞత అంటారు. అదే యోగం యొక్క పరాకాష్ఠ. యోగా వలన వచ్చేది సమాధి స్థితి. సమాధి అంటే అందరికీ జీవితం చివరలో వచ్చే సమాధి కాదు. అది ఎలాగూ వస్తుంది. యోగం లో సమాధి అంటే "అన్నీ ఉన్న స్థితి, ఏదీ కాబట్టని స్థితి" . 
యోగాసనాలు వేయడం ముగిసిన తరువాత ప్రిన్సిపల్ పద్మ శ్రీ గారు, శ్రీరామ్ గారితో కలిసి అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. చివరగా జగత్ ఫార్మా వారు ఇచ్చిన ORS ద్రవం పుచ్చుకుని అందరం ఇంటి దారి పట్టాము. 

                                                      సర్వే భవంతు సుఖినః 
                                                      సర్వే సంతు నిరామయః 
                                                      సర్వే భద్రాణి పశ్యన్తి 
                                                      మా కశ్చిత్ దు:ఖ భాగ్భవేత్  

                  "మనం ఎవ్వరమూ కూడా యోగంతో వియోగం పొందకుందుము గాక" 


Thursday, May 29, 2025



జనారణ్యంలో పుట్టి పెరిగిన నాకు అడవి అంటే అంతుచిక్కని భయం. ముందే నేను అనంతపురం జిల్లా వాడిని. ఒక్క పెన్నహోబిలం  చిట్టడువులు తప్ప చిన్నతనం లో ఇంకే అడవినీ  చూడలేదు. తరువాత యుక్త వయసులో తిరుపతికి మకాం మార్చడం వల్ల శేషాచలం అడవులతో అనుబంధం పెరిగింది. ఆ అనుబంధం కూడా నడక దారికి ఇరువైపులా ఉన్న అడవితోనే. అంతకు మించి శేషాచలం కొండల మీద అడవిలోకి సాహసించి వెళ్లలేక పోయాను. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో జంతుశాస్త్ర ఆచార్యుడి గా పనిచేస్తున్న రాజశేఖర్ మాత్రం ఉద్యోగం రాక ముందే బంగారు బల్లి మీద ప్రయోగాలు చేస్తూ శేషాచలం అడవుల్లో ప్రొఫెసర్ నందగోపాల్ గారితో పాటు తెగ తిరిగాడు. అప్పుడు అంతో, ఇంతో విన్నాను అడవి గురించి. ఈ మిత్రుడితోనే నేను అదే బంగారు బల్లి కోసం అహోబిలం అడవుల్లో కాళ్ల నొప్పి పుట్టే వరకు తిరిగాను. బంగారు బల్లి కనపడక పోయినా కూడా నాకు మాత్రం అడవి మీద అనురక్తి పెరిగింది. అడవి ఒళ్లంతా మా నరసింహ స్వామి సాక్షిగా తడమాలి అనిపించింది. నా భక్తి యాత్రలో భాగంగా శ్రీశైలం వెళ్లినప్పుడు, నల్లమల అడవుల్లో రాత్రి ప్రయాణం వెన్నులో చలి పుట్టించింది. మేము కారులో వెళుతుంటే, రోడ్డు నిదానంగా దాటుతూ ఒక పాము  కనపడింది.  జీవితంలో భయం అనేది ఒక విచిత్రమైన అనుభవం. భయపడినప్పుడే మనకు జీవితం తీవ్రత తెలుస్తుంది అంటాడు ఆచార్య రజనీష్. 

ఇలా అడవి మీద మమకారం పెంచుకున్న నేను కొన్ని బలీయమైన కారణాల వలన అడవిలో కొన్ని రోజులు గడపడం లాంటి సాహస కృత్యాలు చేయలేక పోయాను. నా భయాల వల్ల నాకు ఇప్పటికీ అడవి అంతుచిక్కని ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇలా నా అటవీ సందర్శన కాంక్ష పెరుగుతూ ఉన్న ప్రస్తుత తరుణంలో , నన్ను ఛాయా బుక్. కామ్ లో ఉన్న  "లంకమల దారుల్లో" అనే travelog వివరాలు ఆకర్షించాయి. పోస్ట్ లో ఆ పుస్తకం వచ్చినప్పుడు , అడవి మొత్తం నా ఇంటికి నడిచి వచ్చిన సంబరం అయ్యింది.  నాకు మొదటే ట్రావెలాగ్ పుస్తకాలంటే తగని మక్కువ. అసలు ఈ లంకమల దారుల్లో పుస్తకం చదువుతుంటే నాకైతే  "counter clockwise studies" చేస్తున్నట్టుగా అనిపించింది.  పుస్తకం పేజీలు తిప్పుతుంటే నేను నా గతంలోకి జారుకున్నాను. నా ఉద్యోగ ప్రస్థానం కడప జిల్లా రైల్వే కోడూరు వద్ద ఉన్న చిన్న ఓరంపాడు లో మొదలయ్యింది. అక్కడ కొత్తగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ పెట్టారు. అక్కడ నాకు 2002లో పోస్టింగ్ ఇవ్వడం తో కడప జిల్లాతో నా అనుబంధం మొదలయ్యింది. ఓబులవారి పల్లె రైల్వే స్టేషన్ లో inter city రైలు దిగి, చేతిలో కారియర్ బ్యాగ్ తో చిన్న ఓరంపాడు కు నేనూ, నా సీనియర్ మిత్రుడు గంగాధర్ రెడ్డి మూడు కిలోమీటర్ల మేర ప్రతి రోజు నడిచి చేరుకునేవాళ్లం. అంతే గాక ప్రతి వేసంగి సెలవుల్లో స్పాట్ వాల్యుయేషన్ కోసం కడప జిల్లా కేంద్రం లో మకాం వేసేవాడిని. విష్ణు ప్రియా లాడ్జీ లో దిగే వాడిని. ఇలా నా ఉద్యోగ ప్రస్థానం కడప లో జరుగుతున్న సమయం లో రచయిత వివేక్ పుస్తకం లో ప్రస్తావించిన ప్రదేశాలు చూడడం తటస్థించింది. లంకమల ఆడవులంతా వివేక్ ఆత్మ పరుచుకున్నట్టే అనిపించింది పుస్తకం చదువుతుంటే. నేను ఈ అడవుల గుండానే కొన్ని నెలల  క్రింద సిద్దవటం నుంచి బద్వేల్ దగ్గర ఉన్న లక్ష్మీ పాళ్యెం అగ్రహారానికి వెళ్లాను. ఈ పుస్తకం అప్పుడే చదివి ఉంటే, డిపార్ట్మెంట్ వారి సహకారంతో కొద్దిగా అడవి లోపలికి వెళ్ళేవాడినేమో!!!!

అడవి సౌందర్యం అంతా దాని స్వేచ్ఛ లోనే ఉంది. ఈ పుస్తకం చదవక ముందు నాకు అసలు అడవులు ఎందుకు తగలడతాయో తెలిసింది కాదు. అడవి తనను తాను కాల్చుకోవడం ద్వారానే పునరుజ్జీవనం పొందుతుందని, కొన్ని విత్తనాలు కాలితే తప్ప మొలకెత్తవనే ప్రకృతి రహస్యం నాకు అవగతమయ్యింది. ప్రతి అడవి మాఘం, పాల్గుణం లో కాలి బూడిదయ్యేది తిరిగి చిగురించడానికే. వైశాఖానికంతా అడవి తనను తాను ఎలా సిద్దం చేసుకొంటుందో చక్కగా వర్ణించారు ఈ పుస్తకంలో. అడవిలో నడవడం వలన సహజమైన పద్దతిలో nature healing జరుగుతుంది. అడవి స్థల కాల పరిస్థితులకీ అతీతంగా ఎలా నిలబడగలిగిందో  నాకు అర్థమయ్యింది.  గోజీతలు, కొండ పిచ్చుకలు, అడవి కోళ్లు , బెల్లగాయిల గురించిన వర్ణన చదివేటప్పుడు అడవిని మొత్తం కాన్వాస్ మీద చిత్రీకరించినట్టనిపించింది. యానాదులంటే, అనాది కాలంగా ప్రకృతిలో కలసి మమేకమై జీవించేవారని ఎంత చక్కగా తెలియజేశారో ఈ పుస్తకం లో. మధ్యవర్తుల ఉచ్చులో పడి మోసపోతున్న వలస కూలీల గురించి తెలుసుకున్నప్పుడు బాధేసింది. పుస్తకం లో ఒక చోట 'ఉతిత్తీరు .. ఉతిత్తీరు ' అని అరిచే ఉత్తిసిత్తు గాడు తారసపడ్డాడు. పక్షులు రకరకాల ధ్వనులు ఎలా చేస్తాయో ఒక జువాలజీ మాస్టారు గా నాకు తెలిసి ఉండడం వలన ఇలాంటి వర్ణనలను నేను బాగా ఎంజాయ్ చేసాను. రచయిత కేవలం అడవి ప్రయాణాన్ని అక్షరీకరించడంతో ఆగలేదు. ఆయన ప్రయాణంలో తారసిల్లిన యానాదుల జీవన విధానాలను సేకరించి, వాటిని ఆర్డీవో వెంకట రమణ గారి దృష్టికి తీసుకువెళ్లారు. వారికి ఆధార్ కార్డులు మంజూరు అయ్యేలా చేసారు. ఆ విధంగా ఈ రచన ఒక సామాజిక ప్రయోజనాన్ని సాధించింది. 

మిట్టమానుపల్లె వద్ద బ్రిటీష్ సైనికుడిని చంపిన మల్లుగాడి గురించి చదివినప్పుడు, ఇలాంటి అజ్ఞాత స్వాతంత్ర సమర యోధులు ఎందరు ఉన్నారో కదా అనిపించింది. మిన్నాగు విషం నాకి మల్లుడు బలవంతుడైన తీరు ఆసక్తి కరంగా ఉంది. దివిటీ పట్టుకుని తిరిగే ఈ మల్లన్నను, నిశీధి సమయం లో సానితో రతి చేస్తుండగా బంధించి, సూరు బొక్కల్లో నుంచి ఈటెల తో పొడిపించి చంపించిన బ్రిటీష్ వాడి జిత్తులమారితనం గురించి చదివినప్పుడు నా మనసు మిన్నాగు విషం పడిన తొణకల బావి నీటిలా తొణికింది, వణికింది. తెల్లదొర మనసు మిన్నాగు కంటే విషపూరితం కదా!!!!! దివిటీ మల్లిగాడి "ఉన్నోళ్లను కొట్టు, లేనోళ్లకు పెట్టు" అనే నినాదం ఇంకా ఆ లంకమల లో మారుమోగుతున్నట్టే ఉంది. లంకమలలో  ఒకప్పుడు ఏనుగులు తిరిగి ఉండొచ్చు అనే విషయం నాకు చాలా ఆసక్తిని కలిగించింది. 

కార్తె మారే ముందు, మారిన తరువాత లేచే పుట్టగొడగులను ఇబ్బడి, ముబ్బడిగా పండించడం ఎలానో ఈ తరాలు నేర్చుకుంటే, ఆకలి సమస్యలు కొందరికైనా తీరొచ్చు. మన బతుకుల్లోని చాలా సమస్యలకు అడవి పరిష్కారం చూపిస్తుందనేది నిజం. కానీ మనం అడవి నుంచి దూరంగా జరిగిపోయాము. నది నుంచీ దూరంగా వచ్చేసాము. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కడప జిల్లా ప్రవాసినై ఉన్నప్పుడు సగిలేరు సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలకు practical examiner గా వెళ్లాను. అప్పుడే కాశిరెడ్డి నాయన జీవ సమాధి అయిన జ్యోతి ని చూసాను. ఎప్పుడో 2004 మాట ఇది.  అహోబిలంకు అక్కడ నుంచి నడక దారి ఉందని అప్పుడే  విన్నాను. మునుపు నే రాసిన సమీక్షలు చదివిన వారికి నేనో భక్తుడను అనే విషయం అర్థమై ఉంటుంది. జ్యోతి క్షేత్రాన్ని 2004 లో   దర్శించినప్పుడు నేనో చిన్న బత్తాయిని, ఇప్పుడు పెద్ద బత్తాయిని అంతే తేడా. అప్పట్లో ఏ రోజో ఒక రోజు జ్యోతి నుంచి అహోబిలం వరకు నడిచి పోక పోతానా అని అనుకున్నాను. కానీ ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. నడక ప్రయాణం చేయాలంటే బద్దకం ఉండకూడదు. ప్రయాణానికి కావలసింది ప్రణాళిక. నాకు లోపించింది అదే. అందునా అడవులంటే పులి ఉంటుందేమో అన్న గిలి. నాకున్న భయం నాలోని భక్తిని చంపేసింది. ఈ లంక మల దారుల్లో పులి రెండు కాళ్ల మనిషిని ఎందుకు వేటాడదో చక్కగా వివరించారు. మా జువాలజీ లో ప్రతి వేటాడే జంతువుకి తను భక్షించే జీవికి సంబంధించిన  ఒక image ఉంటుందని చెపుతారు. దానినే prey image అంటారు. అందుకే పులి రెండు కాళ్ల మనిషిని వేరే విధి లేకుంటే తప్ప వేటాడదు. ఈ పులి గిలి వల్లనే నేను జ్యోతి నుంచి అహోబిలం వరకు నడక చేపట్టలేక పోయాను. ఏదో 'మారం రాజశేఖర్' పుణ్యమా అని అహోబిలం అడవుల్లో కొద్దిగా తిరిగాను అంతే. 

నాకు అడవంటే భయం పెరగడానికి మరో కారణం మిత్రులతో కలిసి రైల్వే కోడూరు దగ్గర ఉన్న గుండాల కోన కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటన. గుండాల కోన లోపలికి వెళ్లాము జీపుల్లో. మాకు గైడ్ గా ఆ కాలేజీ లో చదువుతున్న ఒక స్టూడెంట్ వ్యవహరించాడు. వాడు ముందుండి నడిపిస్తే, మేము వాడి వెనక నడిచాము. గుండాల కోన గాంభీర్యాన్ని చూస్తే నాకు గుండెల్లో వణుకు మొదలయ్యింది. ఏ వైపు చూసినా కూడా కోట గోడల్లా ఆకాశాన్ని చుంబిస్తున్న తూర్పు కనుమలు. మా జీపు ముందుగా ఉన్నట్టుండి ఒక నక్కల గుంపు వచ్చింది. కొన్ని నక్కలు  నా నక్క జిత్తులను పసిగట్టినట్టుగా నన్ను వింతగా చూసాయి. నేను నా నక్క వినయాలతో వాటిని పక్కదావ పట్టించాను. మా మిత్రులలో ఒకడు మన అదృష్టం పెంచుకోవడానికి జీపు దిగి వాటి తోకలు తొక్కుదాం అని కూడా ప్రతిపాదించాడు. పంచతంత్రంలో కరటక, దమనకులనే నక్కల గురించి వినడమే గానీ, వాటిని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి. అక్కడ నుంచి కోన వద్దకు మమ్మల్ని మా స్టూడెంట్ గైడ్ పిలుచుకువెళ్లాడు. మా మిత్రులంతా ఆ నీళ్ల గుంటలో ఈతలు కొడుతుంటే, నేను మాత్రం బిక్కు, బిక్కు మంటూ ఒక గుండు మీద కూచున్నాను. అక్కడ ఒక బిలం ఉండడం గమనించాను. సాధారణంగా అడవుల్లో నీటి కుంట దగ్గరికి దాహం తీర్చుకోవడానికి క్రూర మృగాలు వస్తాయనే విషయం నా బుర్రకు తట్టి ఇంకా భయం వేసింది. అందరి ఈత ఉత్సాహం నీరు గారిన తరువాత, మాతో తీసుకుపోయిన ఏవో తినుబండారాలు తిన్నాము. వెనక్కు వచ్చేటప్పుడు మా స్టూడెంట్ గైడ్ కు స్మృతి భంగమై , 'అయ్యోర్లు !!!! తోవ మరిచితిని' అని అనడంతో మా అందరి పరిస్థితి తినింది అరగక హిమాలయాలకు వెళ్లి, అక్కడ చిక్కుకున్న ప్రవరాఖ్యుడి లాగా అయిపోయింది. నాకే ఎందుకో అనుమానం పెను భూతమై వేధించి, ఆ సగటు విద్యార్థిని పక్కకు పిలుచుకు వెళ్లి " రేయ్ !!! నాయనా!!! నీకు పుణ్యం ఉంటుంది. నిజం చెప్పు నీకు మాలో ఎవరి మీద కోపం ఉంది?????" అని అడిగాను. వాడో గడుసు పిండంలా ఉన్నాడు. "భలే కనుక్కున్నారు సర్!!!! మా ఇంగ్షీషు సర్ అంటే నాకు కసి. నన్ను మా క్లాస్ అమ్మాయిల ముందు ఇంగ్షీషులో తిట్టాడు సర్!!! అందుకే ఈ దోవ మరచినట్టు నటిస్తున్నాను" అన్నాడు. "ఒరేయ్ !!! ఆ ఇంగ్షీషు సర్ తరపున నేను క్షమాపణ చెపుతాను రా!!!! నీవు కనికరించకుంటే నేను ఏ నక్క తోక పట్టుకునో  ఈ అడవి దాటాలి రా!!!" అని మొరపెట్టుకున్నాను. తరువాత ఆ శిష్య రత్నం మమ్మల్ని ఎలాగోలా అడవి బయటకు తీసుకువచ్చి విసిరేశాడు లెండి. అప్పట్నుంచి నాకు అడవి అంటే ఒకటే భయం.  

స్థానికులు వంట చెరుకు కోసం అడవులను నరకకుండా ఉండటానికి సీమ తుమ్మ చెట్లను అప్పట్లో నాటించారని పుస్తకం చదివిన తరువాతనే తెలిసింది. వీటి విత్తనాలను అప్పట్లో హెలికాఫ్టర్స్ లో చల్లించారనే ముచ్చట బాగుంది. కానీ అప్పట్లో అడవి రక్షణ కోసం నాటిన సీమ తుమ్మ చెట్లే ఇప్పుడు స్థానిక వృక్ష జాతులను కబళిస్తున్నాయి. కంచే చేను మేయడం అంటే ఇదేనేమో. 

కలివి కోడి అస్థిత్వాన్ని ప్రపంచానికి చాటిన ఐతన్న, ఆ కలివి కోడిని చూడడం కోసం పక్షి శాస్త్రజ్ఞుడైన భరత్ భూషణ్ లంకమలకు రావడం, బాంబే నుంచి సలీం అలీ గారు ఉరుకుల పరుగుల మీద రావడం, కానీ సలీం అలీ గారు వచ్చే లోపే ఆ పక్షి ప్రాణాలు గాలిలో కలసిపోవడం లాంటి సంఘటనలు రచయిత హృద్యంగా డాక్యుమెంట్ చేసారు. మనిషి తాకిన గూడు దగ్గరికి బెల్లగాయిలు మళ్లీ రావు అనే భయం పెట్టడం మంచిదే. ఆ మాత్రం పాప భీతి మనిషిలో లేకుంటే ఈ పాటికి బెల్లగాయి అంతరించిన జాతులలో చేరిపోయేది. 

సంబెట నరసింహ రాజు తవ్వించిన రాజుల చెరువు ఉదంతం, పగలు చీకటి కోన లో దివిటీ మల్లన్న బంగారం దాచిన వైనం చదువుతుంటే తెగ థ్రిల్లింగ్గా అనిపించింది. మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవడానికైనా అప్పుడప్పుడు ప్రయాణాలు చేస్తుండాలి అని రచయిత చెప్పిన మాట అక్షరాలా నిజం. 

2004 లో నేను కడప జిల్లాలో ఉన్నప్పుడు కడప జిల్లా లోని చాలా ప్రదేశాలు చుట్టబెట్టేసాను. హత్తిరాల లోని పరుశురామ క్షేత్రం మొదలుకొని, నందలూరు, ఒంటిమిట్ట, దేవుడి కడప, పుష్పగిరి, బ్రహ్మంగారి మఠం, జ్యోతి లాంటి ప్రదేశాలు అన్నిటినీ ఎర్ర బస్సుల్లో అప్పట్లో తిరిగేసాను కానీ అప్పట్లో ఎప్పుడూ కూడా సిద్దవటం కానీ, లంకమల గానీ, ఇంకా గండికోట గానీ పోలేకపోయాను. కారణం తెలియదు. నింగి ఋణం, నేల ఋణం అన్నట్టుగానే ఏదైనా ప్రాంతానికి వెళ్లాలి అంటే నీటి ఋణం ఉండాలేమో!!!! కానీ ఇటీవల యోగి వేమన విశ్వవిద్యాలయం లో part time PhD జువాలజీ లో చేరిన తరువాత అనంతపురం నుంచీ కడపకు నెలకో సారన్నా తిరుగుతున్నాను. అలా నేను ఇటీవలనే అల్లాడపల్లి, సంగమేశ్వరం చూసాను. ఇక్కడ చెప్పొచ్చేదేమంటే పుస్తకం లో ప్రస్తావించిన గండికోటను చూసినప్పటికీ, దాని చారిత్రక నేపథ్యాన్ని పట్టుకోలేక పోయాను. గ్రేట్ కాన్యాన్ సౌందర్యం ఎంతో నచ్చింది నాకు. ఈ గండికోటను మీర్ జుమ్లా కుతంత్రంతో ఆక్రమించిన తీరు పుస్తకం లో చక్కగా వివరించారు. 

లంకమల అరణ్యం మాత్రం కొద్ది కాలం క్రిందటే బద్వేలు వద్ద ఉన్న లక్ష్మీ పాళ్యెం అగ్రహారం లోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లినప్పుడు చూసాను. కానీ కొండ పొలం సినిమాలో చెప్పినట్టు అడవిని చూస్తే సరిపోదు, గమనించాలి. ఆటవిక న్యాయాన్ని తక్కువగా అంచనా వేస్తాము కానీ, ఈ jungle law వల్లనే అడవి అనేక ఆహారపు గొలుసులకు ఆశ్రయమిస్తోంది. సిద్దవటం మట్లీ రాజుల కోటను కూడా నేను, కడప SKR & SKR Govt College for women కాలేజీ Principal అయిన నా మిత్రుడు సలీం తో కలిసి చూసాను. 

సామాజిక వేదికల గురించి నాకున్న అభిప్రాయం కూడా ఈ పుస్తకం చదవడం వలన మారిపోయింది. 'జలధారలు', 'Into The Nature' లాంటి గ్రూపుల గురించి చదివినప్పుడు, అలాంటి గ్రూపులలో విద్యార్థులు సభ్యులుగా చేరితే ఎంత బాగుంటుందో కదా అనిపించింది.  అడవి ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడక్కడ చక్కగా వివరించారు. అడవి యాత్రికులకు పులి, ఎలుగ్గొడ్ల కంటే పరిక ప్రమాదకరం అని తెలసుకున్నాను. ఈత కాయలంటే ఎలుగుబంట్లకు ఇష్టం అని మొదటిసారి తెలుసుకున్నాను. జంతుశాస్త్ర అధ్యాపకుడిగా నేను పాఠాలు చెపుతున్నప్పటికీ నాదంతా పుస్తక పరిజ్ఞానమే. ఈ పుస్తకం చదివితే ఎవరికైనా తమిళ స్మగ్లర్ల పట్ల సానుభూతి కలుగుతుంది. ఈ పుస్తకం చదువుతుండగానే, త్వరలో M V రమణా రెడ్డి గారి ఆత్మకథ 'గతించిన రోజులు' చదవాలని సంకల్పించుకున్నాను. ఈ లంకమల దారుల్లో ట్రావెలాగ్ చదువుతూనే రాత్రి పూట కొండ పొలం సినిమా చూసేసాను. ఆదిమానవుల ఆవాసాల 'బిలం ప్రయాణం' ఉదంతం ఆసక్తికరంగా ఉంది. చెయ్యేరు వరద భీభత్సం వివరించేటప్పుడు రచయిత ఈత నేర్చుకోవడం ఒక ప్రాథమిక అవసరం అని ఎంత చక్కగా చెప్పారో!!!!! అలాంటి ఈత నేను ఇప్పటికీ నేర్చుకోలేక పోయాను. బెంగళూరుకు వెళ్లినప్పుడు బేబీ స్విమ్మింగ్ పూల్ లో నేను వచ్చీ రాని మునకలు వేస్తుంటే, నన్ను చూసిన కన్నడ పిల్లలు నన్ను mentally retarded fellow గా భావించి గుస...... గుస పోవడం నాకింకా గుర్తు. ఎద్దుల కోసం ప్రాణాలు వదిలేయడానికి సిద్దమైన వారి గురించి చదివినప్పుడు హృదయం ఆర్ద్రం అయ్యింది. విధ్వంసం, ఉపశమనం రెండూ ప్రకృతిలో భాగాలే అని తెలుసుకోవడానికి ఎంతో పరిపక్వత కావాలి. సిద్దవటం మట్లీ రాజుల కొలువులో ఉన్నారని చెప్పిన అష్ట దిగ్గజ కవుల్లో కవి చౌడప్ప పేరు మాత్రమే నేను విన్నాను. చెయ్యేరు వరదకు ఎదురొడ్డి నిలిచిన పులపత్తూరు గురించి చదువుతుంటే, నేను ఎంత భద్రమైన ప్రదేశంలో ఉన్నానో కదా అనిపించింది. పిల్లంకట్ల కళా రూపం గురించిన వివరణ ఆసక్తికరంగా ఉంది. పాలేగాళ్లకు తిరగబడ్డ వొన్నూరమ్మ ధైర్యానికి ఆశ్చర్యపోయాను. పరిస్థితులకు తిరగబడడం అంత సులువు కాదు. నల్లమల లోని మల్లేలమ్మకు ఎద్దుల నీటి కోసం 'తల పండు' సమర్పించున్న భైరవ కొండన్న గురించి చదువుతుంటే వెన్నులో చలి పుట్టింది. ఆ మొండి భైరవకోనను ఏ రోజో ఒక రోజు చూడాలి. 

ఈ పుస్తకం చదివిన తరువాత నాకు అర్థమయ్యిందేమంటే, ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ప్రత్యక్షంగా ఎంత చూసామన్నదే ముఖ్యం అని. ప్రత్యక్షానుభవం మనం చరిత్రను అర్థం చేసుకునే తీరును మారుస్తుంది. ముఖ్యంగా చరిత్ర విద్యార్థులు చదవడం తో ఆగకూడదు. చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశాలను దర్శించాలి. రకరకాల ఆధారాలను సేకరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే వాస్తవాన్ని, కల్పనను విడదీసే నేర్పు వస్తుంది. ఆది మానవుడికి అడవులతో ఉన్న అనుబంధం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఆకలి, నిద్ర, మైధునం మాత్రమే తెలిసిన ఆది మానవుడు అభద్రతా భావంతో చాలా తీరిక లేని రోజులు గడిపాడు. కొద్దిగా భద్రతా, తీరుబాటు జీవితంలో చొరబడగానే, emotional గా ప్రకృతితో connect అయిపోయాడు. ఇదంతా గమనింపు వల్ల వచ్చింది. ఆదిమానవుడు ద్రవ్య ప్రధాన సమాజం వైపు ఎలా ప్రయాణించాడనే విషయాన్ని చక్కగా తెలియజేసారు. అసలు ఏ అవసరం ఆది మానవుడిని అడవి నుంచి మైదానం వైపు తరిమింది? అడవి లోని ఆహారపు గొలుసుల్లో భాగంగా ఉండకుండా, మానవుడు ఆహారోత్పత్తి వైపు దృష్టి ఎందుకు సారించాడు? అడవిలో ఏం తక్కువైందని తల్లి ఒడి లాంటి అడవిని వదిలాడు? ఈ ఆది మానవుడి మస్తిష్కం లోకి ఆశ ఎప్పుడు ప్రవేశించింది? పుస్తకం చదువుతుంటే, ఇలాంటి ప్రశ్నలతో నా మనసు లోతెంతో తెలియని 'మంచాల గుండం' లా తయారయ్యింది. అడవిలో ఆది మానవుడు నిత్య ఘర్షణ పడలేక, భద్రత కోసం మైదానం వైపు వచ్చి ఉండవచ్చు. భద్రత వల్ల ఒక చోట చేరిన మనుషులు కుటుంబాలుగా, గ్రామాలుగా, రాజ్యాలుగా పరివర్తన చెంది ఉండవచ్చు అంటారు ఒక చోట రచయిత. అడవిని వదిలిన మానవుడు పంచుకోవడం మానేసి, పోగేసుకోవడం మొదలెట్టాడు. తన వాళ్లను కాపాడుకోవడం కోసం రాజ్యాలు ఏర్పరుచుకున్నాడు. అడవిలో ఉండి ఉంటే సంఘర్షణ మాత్రమే ఉండేది. రాచరికాలు మొదలవడంతో, మానవ మస్తిష్కంలో యుద్ధోన్మాదానికి బీజం పడింది. నిజానికి మనమందరం యుద్ధోన్మాదులుగా మారిపోయాము. ఎవరితో ఒకరితో, ఏదో ఒక రకంగా యుద్దాలు చేస్తూనే ఉన్నాము. 

తీరిగ్గా కూచుని తేరగా వచ్చింది మెక్కుదామనుకునే వారికే ధన రాశుల పుకార్లు రుచిస్తాయి. బుస్సా నాయుడి కోటలో ధన రాశులు, బంగారం ఉన్నాయనే పుకార్లు షికార్లు చేయడానికి కారణం మానవుడికి ధనం మీద ఉన్న యావే. చివరకు బుస్సా నాయుడు కూడా ఉంపుడుకత్తె కుతంత్రం వల్ల చస్తాడు. ఎవడి చావు వాడే తెచ్చుకుంటాడు. చాలా మందికి మరణం కాంతా, కనకాల వల్లనే వస్తుంది.  ఈ పుస్తకంలో పేర్కొన్న తురుకల సరి, ముండమోపుల రేవుల ఉదంతాలు తమాషాగా ఉన్నాయి. అనాది కాలంగా కాపాలిక శైవానికి ఆలవాలమైన లంకమల ఇలాంటి రహస్యాలను ఎన్నో దాచుకుందని నాకు అర్థమయ్యింది. సాకిరేవులో భల్లు గుడ్డు ( కబాడీ ) ఆడుతున్న సుగాలోళ్లను గంగమ్మ శపించడం స్త్రీల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. తురకల సరి వద్ద ఉన్న ఏనుగు బొమ్మ ఉన్న 'సుబ్బమ్మ రాతి బీరువా' గురించి చదివిన తరువాత, నా జీవితంలో ఎప్పుడో ఒకసారి దీనిని చూడాలని సంకల్పం చేసుకున్నాను. మా ఇంట్లో బీరువా చూడడానికే నాకు అటు తీరికా, ఇటు ఓపికా లేదు. ఇక ఈ సుబ్బమ్మ బీరువా ఏం చూచ్చానబ్బా!!!! తురకల సరి వద్ద చాకలి విసుగు తంత్రం ప్రస్తావన భలే గమ్మత్తుగా ఉంది. 

మొదటిసారి అడవికి వచ్చిన వాళ్లు ఒక్కో రాయి విసరడం వల్ల ఏర్పడిన మల్లాలమ్మ గుట్ట గురించి చదివినప్పుడనిపించింది చతుర్లాడడం కూడా ఒక్కోసారి మంచిదేనని. రాణీ బండ గురించి చదివినప్పుడు, ట్రెక్కింగ్ కు అవకాశమున్న ఇలాంటి స్థానిక ప్రదేశాలను ప్రభుత్వం పూనుకుని అభివృద్ధి చేస్తే బాగుంటుందనే వివేక్ గారి సలహా ఎంతో విలువైనది కదా అనిపించింది.  లంకమల యాత్ర తో ఆగకుండా, అడవంతా ఆరువేల seed balls చల్లడం నిజంగా ప్రశంసనీయం. ఈ విషయాన్ని మా కాలేజీ NSS Program officers దృష్టికి తీసుకువెళతాను. రచయిత చెప్పినట్టుగా అతి జాగ్రత్త, అతి గారాబం వలన ఈ తరం పిల్లలు ప్రకృతికి దూరం అవుతున్నారు. ప్రస్తుత తరం ప్రకృతికి దగ్గరగా జరగాలి అంటే వివేక్ గారి లాగా  అడవి బాట పట్టాలి. 

స్థానికంగా ఉన్న అడవులను కాపాడుకోవాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలి. పుస్తకం లో ప్రస్తావించినట్టు No plastic Lankamala, Restore Rajulacheruvu లాంటి ఉద్యమాలు బయలుదేరినప్పుడే, ప్రయాణాల యొక్క సామాజిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.  ప్రతి ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం సామాజిక శ్రేయస్సే కావాలి. ప్రతి యాత్రా ఏదో ఒక ఆదర్శంతో ముగియాలి. నేను కూడా వ్యక్తిగతంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకం మా విద్యార్థులచే చదివిస్తాను. 

G L N PRASAD
Lecturer in Zoology
Govt Arts College
Anantapur 

Saturday, May 24, 2025


Awareness tips on Hotel Management 








 షరా మామూలే!! నేను మా ANSET మిత్ర బృందం సునీల్ కుమార్ రెడ్డి గారు మరియు చిగిచెర్ల శ్రీనివాసులు సర్ కలిసి బుక్కరాయ సముద్రం లో ప్రైవేట్ B.Ed కళాశాల ఆవరణలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ గ్రామీణ యోజన ఆధ్వర్యం లో Hotel Management మరియు Beverages ట్రేడ్స్ లో శిక్షణ పొందుతున్న 90 మంది trainees తో కొన్ని అంశాలు ముచ్చటించాము. వారు ఎంచుకున్న శిక్షణా కార్యక్రమం ముఖ్యంగా హోటల్ నిర్వహణ కాబట్టి, వారికి ఈ క్రింది సూచనలు చేశాను. 

  • మీరు హోటల్ స్వంతంగా ప్రారంభించాలి అనుకుంటున్నారా లేక హోటల్ లో పనిచేయాలి అనుకుంటున్నారా నిర్ణయించుకోండి. 
  • మీరు పెట్టబోయే హోటల్ పేరు ఇప్పుడే మనసులో అనుకోండి. 
  • మీరు పెట్టబోయే హోటల్ శాకాహార లేక మాంసాహార హోటలా కూడా నిర్ణయించుకోండి. 
  • అన్నిటికంటే ఏ ప్రాంతంలో మీరు హోటల్ ప్రారంభిస్తే బాగుంటుందో, అక్కడ ఎలాంటి తిండి పదార్థాలకు డిమాండ్ ఉందో, ఆ ప్రాంత జనాల ఆహారపు అలవాట్లు ఎలాంటివో ఒక సర్వే చేసి సిద్దంగా పెట్టుకోండి. 
  • ఐదు నక్షత్రాల హోటల్ కు వచ్చే కస్టమర్ల మనస్తత్వం అధ్యయనం చేయండి. హోటల్ పరిశ్రమ గురించి యండమూరి రచించిన 'ఇడ్లీ, వడ ఆకాశం' అనే పుస్తకం చదవండి. ఇది కామత్ యొక్క biographical sketch. 
  • వంట చేయడం మొదట నేర్చుకోండి. పప్పుకు తగిన ఉప్పు, ఉప్పుకు తగిన నిప్పు ఉండేలా చూసుకోండి. 
  • వంట చేయడం మరియు వడ్డించడం రెండూ కళలే. 
  • ఎవరికైనా సరే కొసరి, కొసరి వడ్డించడం అలవాటు చేసుకొండి. సాదరంగా పెట్టకుంటే ఎవరూ తినరు. ఒకవేళ తిన్నా రుచించదు. 'ప్రియము లేని కూడు పిండంబు కూడురా' అని మన వేమన ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ప్రియంగా వడ్డించండి 
  • కంటికి ఇంపుగా ఉంటే, కడుపుకు ఇంపు అని మరవకండి. 
  • శుభ్రంగా ఉండండి. 
  • స్ట్రీట్ foods గురించి, జాతీయ మరియు అంతర్జాతీయ వంటల గురించి తెలుసుకోండి. 
  • వివిధ వంటల గురించి తెలియాలి అంటే మల్లాది రచించిన మిస్రాణి చదవండి. మీకు food lovers గురించి తెలియాలి. Some people travel for food. మిరపకాయ బజ్జీ బాగుంటే, దానిని తినడానికి మైళ్ల కొద్దీ ప్రయాణించేవాళ్ళు నాకు తెలుసు. 
  • మన దేశంలోనే అనేక రకాల వంటకాలు ఉన్నాయి. ఈ తరం వారికి నచ్చే రుచుల గురించి అధ్యయనం చేయండి. పల్లెటూరి రుచుల గురించి తెలుసుకోండి. 
  • మీరు ఆర్థికంగా స్థిరపడడానికి  పెద్ద, పెద్ద హోటళ్లే పెట్టాల్సిన పనిలేదు. చిన్న, చిన్న Eat outs చాలు. 
  • ప్రాంతీయ రుచుల గురించి అవగాహన పెంచుకోండి. 
  • మీకు వంట చేయడం లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. చెన్నై శరవణ భవన్ లో మూడు దశాబ్దాల క్రితం నేను తిన్న ఇడియప్పం రుచి నాకు ఇంకా గుర్తుకు ఉంది. 
  • ఎదుటి వారి జిహ్వా చాపల్యమే మీ బలం. ప్రపంచం లో వినే వారి కన్నా, తినే వారే ఎక్కువ ఉన్నారు కాబట్టి, నాలాంటి టీచర్ల కన్నా మీరే ఎక్కువ సంపాదించగలరనే విషయాన్ని నమ్మండి. 
  • స్నాక్స్ చేయడం నేర్చుకోండి. మీరు చేసే వంటకు రంగు, రుచి, వాసనా అదిరిపోవాలి. 
  • కొన్నిపదార్థాలు వీధుల్లో తింటేనే బాగుంటుంది. ముఖ్యంగా మా రాయలసీమ లో దొరికే గుంత పొంగణాల లాంటివి చేయడం నేర్చుకుంటే, పొయ్యి, పెనాన్ని పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించవచ్చు. 
  • మీరు వంటకు వాడే దినుసులు నాణ్యమైనవిగా ఉండాలి. నాణ్యతలో రాజీ వద్దు సుమీ!!!!!
  • మీరు YouTube వంటల vlog ప్రారంభించవచ్చు. నాలాగా బ్లాగ్ పెట్టి, దానిలో మీరు చేసిన వంటల గురించి ఫోటోస్ తో సహా పంచుకోవచ్చు. ఇంస్టా లో వంటల రీల్స్ చేయవచ్చు. 
  • కేక్స్ తయారీ మీద కూడా పట్టు సాధించండి. కాంటీన్ నిర్వహణ గురించి తెలుసుకోండి. అనంతపురం బెంగళూర్ బేకరీ లో నేను చిన్నప్పుడు ప్రతి రోజూ కారం బన్ను తినేవాణ్ణి. ఆ బన్నుకు నేను చిన్నప్పుడే ఫిదా అయిపోయాను. 
  • ఇక మీరు సమోసా చేస్తే ఎలా ఉండాలి అంటే దానిని తినడం కోసం  అమృతం వదిలేసి వచ్చి దేవతలు కూడా కొట్టుకు చావాలి. 
  • తినడం లో ఉన్న మజా మీ హోటల్ కు వచ్చేవారికి తెలియాలి. తినే వారికి రుచి నసాళానికి తగిలి రససిద్ది కలగాలి. మీ వంట తిన్న తరువాత నల భీమ పాకాన్ని మరిచిపోవాలి.
ఇలా సాగింది స్వామీ నా మాటా మంతీ!!!!!! మరోసారి ఇదే బ్లాగ్ లో ముచ్చట్లు పెట్టుకుందాం. 
 

                                Multiple Activities in Our College Today  1. Meeting is convened in the examination committee with the membe...