Fine moments at CP Brown Library and Herbarium center at YVU on 27th May 2024
Tuesday, May 28, 2024
Sunday, May 19, 2024
రాజమహేంద్రవరం లో శిక్షణా తరగతులకు నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా పోవలసిన అవసరం ఏర్పడుతుంది అనే విషయం చూచాయగా నేను ఎన్నికల విధులలో ఉన్నప్పుడే తెలియడంతో ముందస్తుగా ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాను. నా మిత్రుడు చంద్ర తో పాటుగా 15 వ తేదీ ( మే ) న గుంతకల్ నుంచి మా ప్రయాణం మొదలవుతుంది. అసలు పోగలనా అనిపించింది. దానికి కారణం ఎన్నికల విధులలో మేమంతా అలసి, సొలసి పోవడమే. నేనైతే ఎన్నికల విధులలో ట్రైనర్ గా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు రిసెప్షన్ సెంటర్ లో అనేక దశలలో వివిధ బాధ్యతలను నిర్వహించవలసి వచ్చింది. కానీ తిరుగుడంటే నాకున్న వ్యామోహం వల్ల రాజమండ్రి వెళ్లడానికే నిశ్చయించుకున్నాను. రాయలసీమ వాడిని కావడంతో గోదావరి జిల్లాల మీద చాలా మమకారం ఉంది నాకు. ముఖ్యంగా వారి వెటకారం నాకు చాలా ఇష్టం. వెటకారం లో నేను గోదావరి వాసులకు ఏమీ తీసిపోనని మిత్రులు అప్పుడప్పుడు చెపుతూ ఉంటారు. మే 15 వ తేదీ నేనూ ,చంద్ర గుంతకల్ పోవడానికి మధ్యాహ్నం ఒంటి గంటకు బస్ స్టాండ్ చేరుకున్నాము. బస్ స్టాండ్ లో రద్దీ చూసి హడలి పోయాను. ఎలాగోలా ఒక బస్ పట్టుకుని గుత్తి చేరుకుని అక్కడి నుంచి అతి కష్టం మీద మరో బస్ లో గుంతకల్ చేరిపోయాము. మా ట్రైన్ సాయంత్రం 5.40 గంటలకు. ఇక్కడ గుంతకల్ రైల్వే స్టేషన్ గురించి కొద్దిగా చెప్పాలి. స్టేషన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంది. Airport కు ఏ మాత్రం తీసిపోనంత శుభ్రంగా ఉంది. స్టేషన్ లోని హోటల్ లో మైసూర్ బజ్జీ తిన్నాము నేనూ, చంద్ర. రుచిగా, శుచిగా ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా వెళితే తినండి. అసలు తినడానికీ, తిరగడానికి వచ్చే ఏ అవకాశం వదలకండి. మన జీవితాల విస్తృతి పెరగాలి అంటే తిరగడం ఒక్కటే మార్గం. గుంతకల్ రైల్వే స్టేషన్ లో ఎస్కలేటర్ సౌకర్యం కూడా ఉంది. మా ట్రైన్ రావలసిన సమయం కంటే కూడా 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. నీవు ఎక్కబోయే రైలు ఒక జీవిత కాలం లేటు అని ఎలాగూ ఆరుద్ర అనే వున్నాడు కాబట్టి సర్లే మ్మని సరిపెట్టుకున్నాము. ట్రైన్ లో కాసేపు నేనూ, చంద్ర పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత డోన్ లో ఇడ్లీ, వడ తిన్నాము. ఆ రుచికి నేను 'అదిరందయ్యా చంద్రం' అని మిత్రుడితో అన్నాను. తరువాత నిద్రపోయాం. ఉదయాన్నే మెలుకువ వచ్చింది. ఆ పాటికే రైలు విజయవాడ దాటేసింది. తెలియక మేమిద్దరం గోదావరి స్టేషన్ లో దిగబోయాము. ఎవరో చెప్పడంతో తరువాత వచ్చే రాజమండ్రి లోనే దిగామనుకోండి.
రాజమండ్రి లో ఆటోవాలాలు చాలా మంచి వాళ్లు. రాజమండ్రి లో దిగగానే 'ఆయ్ మేం గోదారోళ్ళ మండి' పాట మదిలో మెదిలింది. స్టేషన్ నుంచి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం లో ఉన్న Faculty Development Center కు వెళ్ళాము. ఆ వీధిని మీరు రాత్రి చూస్తే స్ట్రీట్ foods అమ్మే మెక్సికన్ వీధులు గుర్తుకువస్తాయి. వాకర్స్ కోసం ఒక వ్యక్తి మొక్కజొన్న గింజలు వేసి ఉడికించిన రాగి జావ అమ్ముతుండడం గమనించాను. నా కోసం మిత్రుడు శివరాం సెంటర్ బయట కాచుకు కూచున్నాడు. తరువాత రూమ్ నెంబర్ 205 ను నాకూ, చంద్రాకు మరియు జయప్పకూ కేటాయించారు. గదులు బ్రిటీష్ వారి నిర్మాణాలను పోలి ఉన్నాయి. స్నాన పానాదులు ముగించుకుని సెమినార్ హాలు కు వెళ్లాము. కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ ఐఏఎస్ గారు శిక్షణా కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం గురించి ప్రస్తావించారు. మేమంతా మా కమీషనర్ గారికి ఎంతో ఋణపడి ఉండాలి. ఆయన వలన మేము ఎన్నో ప్రదేశాలను చూడడం, ఎందరినో కలవడం, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడం జరిగింది.
మొదటి సెషన్ లో కెమెరా controls మరియు స్టూడియో సెంటర్ నిర్వహణ గురించి తానాజీ గారు చక్కగా వివరించారు. రెండవ సెషన్ లో కూడా ఆయనే వీడియో మేకింగ్ టూల్స్ గురించి వివరించారు. మధ్య, మధ్యలో టీ, స్నాక్స్ నిజంగా అదుర్స్.
పోస్ట్ లంచ్ సెషన్ లో కృష్ణ కుసుమ గారు Post production work గురించి కల్పించిన అవగాహన ఎంతో ఉపయుక్తంగా ఉంది. Hands on training కావడంతో చక్కగా ఉపయోగపడింది. నిజానికి మొదటి రోజు సెషన్స్ చాలా ఆలస్యం కావడంతో బయటకు ఎక్కడికీ పోలేకపోయాము. భోజనం చాలా రుచిగా ఉంది. శిక్షణను, వసతి సౌకర్యాన్ని దగ్గర ఉండి మానిటర్ చేసిన ప్రిన్సిపల్ రామచంద్ర గారికి, జ్యోతి మేడమ్ గారికి కృతజ్ఞతలు.
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం లో ఉండే అరకు కాఫీ సెంటర్ లో ఓ కప్పు Cappuccino coffee మిత్రులతో కలిసి తాగాము. అసలు ఈ కళాశాల అన్నీ రంగాలలో ముందుండడం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది.
రెండో రోజు ఉదయాన్నే పెందలాడే లేచి, ఆటో పట్టుకుని ఉజ్జయిని గుడికి వెళ్లిపోయాము. నాతో పాటుగా, చంద్ర, శివరాం, భాస్కర్ రాజు, జయప్ప మరియు నాగేశ్వర రాజు గారు వచ్చారు. ఉజ్జయిని దేవాలయం చాలా పెద్దది. అక్కడి నుంచి ఇస్కాన్ కు వెళ్లాము. అక్కడ వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటే, అందరం మైమరచి చూస్తూ ఉండిపోయాము. ఇస్కాన్ లో ప్రసాదం గా ఇచ్చే పులిహోర ను ఎవ్వరూ మిస్ కాకండి. అక్కడ నుంచి కాటన్ బ్యారేజీ కి వెళ్లాము. మేము ఇలా తిరిగి, తిరిగి అల్పాహార సమయానికి వసతి గృహ ప్రాంగణానికి చేరుకున్నాము.
రామ్ కుమార్ గారి సెషన్ ఆద్యంతం ఉపయోగకరంగా ఉంది. పోస్ట్ లంచ్ సెషన్ ఆలస్యంగా మొదలైనా కూడా మాకు Podcast గురించి మంచి inputs దొరికాయి.
సాయంత్రం నేనూ, చంద్ర కాస్తా ముందుగా బయలుదేరి కాసేపు బస్ లో , కాసేపు ఆటోలో, ఇలా ఏది కనపడితే దానిలో ప్రయాణించి ద్వారపూడి, బిక్కవోలు, సామర్లకోట లోని దేవాలయాలు అన్నీ చూసేసాము. మాకు ట్రైనింగ్ లో అబ్బిన పరిజ్ఞానం వలన వీటన్నిటి మీద వీడియో షార్ట్స్ తీసి అప్పటికప్పుడే ఇంస్టా లో పెట్టేసాను. మా బస్ కడియం మీద పోతున్నప్పుడు నేను అనుభవించిన ఆనందం అంతా ఇంతా కాదు.
ఇక మూడో రోజు ఉదయాన్నే గోదావరి లో పడవలో విహరించడానికి పుష్కరాల రేవుకు చేరిపోయాము. అక్కడ 500 రూపాయలు చెల్లించి గోదావరి లో విహరిస్తుంటే, గోదావరి మీద నేను గతం లో విన్న ఎన్నో పాటలు నా మదిలో మెదిలాయి. 'గోదారి గట్టంట, రాదారి రట్టంట, రివ్వుమంటే రివ్వుమంది నాకు మక్కువ, రాదారి నడవల్లో, గోదారి పడవల్లో, చీర కొక్క మూర తప్ప ఏమి తక్కువ' అనే పాట గుర్తుకువచ్చి హుషారుగా ఈల వేయబోయాను. కానీ నాకున్న గురు స్థానం వలన కనీసం ఈల కూడా వేయలేక పోయాను. గోదావరి అలలను వీడియో లో బంధించి ఇంస్టా లో పెట్టేసాను. తరువాత షరా మామూలే. సెషన్ మొదలయ్యింది. డాక్టర్ సునీల్ ఎన్నో AI tools గురించి వివరించాడు. ఇవన్నీ నా బోధనా నైపుణ్యానికి మెరుగులు అద్దడానికి ఉపయోగపడతాయి. ఇంక్ స్కేప్ గురించి భాస్కర నాగేంద్ర గారు చక్కగా చెప్పారు.
మేము ఈ శిక్షణ లో నేర్చుకున్న అంశాల లిస్ట్ ఈ క్రింద ఇస్తున్నాను.
Coral Draw
Adobe Illustrator
Inkscape
Pixel
GiMP
Diffit
almanack
Chattube
Chat PDF
Prompt engineering
magic school
ఇక సాయంత్రం విజయవాడ కు కారులో బయలుదేరి, తలవని తలంపుగా ద్వారకా తిరుమలను కూడా దర్శించుకుని, విజయవాడ రాత్రి 8 గంటలకు చేరిపోయాము. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఏదో హోటల్ లో రవ దోసె తిని మచిలీపట్నం ట్రైన్ ఎక్కేసాము. 19 వ తేదీ ఉదయం 8.30 కల్లా ఇంటికి చేరిపోయాను. నేను ఇంటికి చేరిన వెంటనే ఇంట్లో అందరూ తెగ మురిసిపోయారు. వాళ్ల కళ్ళల్లో ఆనందాన్ని వర్ణించడానికి మాత్రం నేను శిక్షణలో నేర్చుకున్న ఏ వీడియో టూల్స్ సరిపోవు. Life is something more intense and extensive than digital setup అనే మాట గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను. మాకు శిక్షణ లో 'AI can only generate the content but real teacher can create the content. AI can never replace a teacher in creativity' అని సునీల్ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది.
Thursday, May 9, 2024
Internship Viva was conducted for two days from 6th to 7th may 2024. Dr B Sreedevi, Nagajyothirmai, Dr D Aruna attended all the sessions related to this. All the mentors of F1,E1 & E1B attended the viva of their mentees. Zakka Satyanarayana of GDC Tadipatri & Smt B Jameela Beebi of SKP GDC (A) Guntakal acted as external examiners. Much fruitful interactions transpired during this viva
Saturday, May 4, 2024
Subscribe to:
Posts (Atom)
Freshers' day party of Biochemistry students News clippings related ...
-
నేను చిన్నప్పుడు కలలు కనిన స్కూల్ తలుపులు నాకు ఇప్పుడు తెరుచుకున్నాయి. కొన్ని దశాబ్దాల చరిత గల కొడిగినహళ్లి స్కూల్ ను ఒక ముఖ్య అతిథిగా సందర...
-
ఆగస్టు 8 వ తేదీ ఉదయం 10.30 కు CCE వారి ఉత్తర్వులకు అనుగుణంగా LMS Video Making మీద NRC కేంద్రం అయిన మా కళాశాలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అధ్యాప...
-
రాజమహేంద్రవరం లో శిక్షణా తరగతులకు నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా పోవలసిన అవసరం ఏర్పడుతుంది అనే విషయం చూచాయగా నేను ఎన్నికల విధులలో ఉన్నప్పుడే త...