నేను పనిలేక తిరుగుతున్నవాడిని కాను. తిరగడమే పనిగా పెట్టుకున్నవాణ్ణి. తినడం తరువాత నన్ను అమితంగా ఆకర్షించేది ఏమంటే తిరగడమే. I want to be a nomad. I love travelling. I may travel for food, knowledge, fun or anything. తిరగుబోతుకు లక్ష్యమేమి నా బొంద? తిరగడానికి నాకో సాకు పరిశోధన రూపంలో దొరికింది. రిసెర్చ్ యోగి వేమన లో చేరిపోయానుగా!!!!! యూనివర్సిటీకి వెళ్ళిన ప్రతిసారీ కడప గడపలో ఉన్న దర్శనీయ ప్రదేశాలన్నిటినీ చుట్టేసిరావడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాను. ప్రతిసారీ నాకు తోడుగా మిత్రులు వస్తూ ఉంటారు. అలాగా అలవోకగా వెళ్లి వచ్చిన ప్రదేశమే ఈ గండికోట. చిన్నప్పటి నుంచీ 'గండికోట రహస్యం' అనే మాట వినేవాడిని. ఆ పేరుతో ఉన్న సినిమా కూడా చూసేశాను. కానీ గండికోటను మాత్రం ఇప్పుడే చూస్తున్నాను. కడప నుంచి ముద్దనూరు మీదుగా గండికోట చేరుకున్నాము. ఆ గండికోట చాలా రహస్యాలనే మాకు చెప్పింది.
కోట లోపలి శిథిలాలు ఎన్నో చారిత్రక కథనాలను మాకు చెప్పాయి. శిథిల దేవాలయాలు లోపల చాలానే ఉన్నాయి. ధాన్యాగారము, జైలు, చార్మినారు, జుమ్మా మశీదు లాంటి వాటిని చూసాము. కోట లోపల ఉన్న మాధవ రాయ స్వామి దేవాలయము, రంగనాయక స్వామి దేవాలయము శిల్ప శోభతో అలరారుతున్నాయి. వాటి మీద అక్కడిక్కడే వీడియోలు చేసి ఇంస్టా లో పెట్టేసాను. ఇది కాక అందరూ ఇక్కడ చూసి తీరవలసినది The Great Canyon గా పిలువబడే లోయ. అక్కడ శిలల అమరిక కూడా ఎవరో పేర్చినట్టుగా ఉంటుంది.
ఇక్కడ హోటల్స్ లో గదులు చాలానే దొరుకుతాయి. ఇవన్నీ చూడడానికి రెండు కిలోమీటర్లు పైనే నడిచాము. గండికోట లో మేము తిన్న బారా మసాలా ఘాటు మాకు నసాళానికి అంటింది. కారం పట్టించిన కీరా దోస ముక్కలు కూడా తిన్నాము.
తిరిగి అనంతపురం వచ్చేటప్పుడు జమ్మలమడుగు లో మసాలా దోసెలు తిన్నాము. నా చిన్నప్పుడు జమ్మలమడుగుకు తరచూ వెళ్ళేవాడిని. మా మాతామహులు అక్కడ దస్తావేజులు రాసేవారు. అప్పట్లో ఊరిలోని కోట వీధిలో చక్కర్లు కొట్టేవాడిని. బట్టలు బాగా దొరుకుతాయి ఈ ఊరిలో. జమ్మలమడుగు చూసిన వెంటనే ఆ బాల్య స్మృతులు నా మనసును ముసురుకున్నాయి. మా యాత్ర ముగించుకుని మేము ఇళ్లు చేరడానికి రాత్రి 7.30 అయ్యింది.
మరో యాత్రా స్మృతి తో మరోసారి కలుద్దాం.