Friday, December 27, 2024

ఈ రోజు నాకు ఉదయం 10 గంటలకు PTC లో AP Special Police సబ్ ఇన్స్పెక్టర్స్ కు ఉన్న శిక్షణ వాయిదా పడడంతో, ఏం చేయాలో తోచక యండమూరి రాసిన 'అమీబా' పుస్తకం చదువుతూ కూచున్నాను. ఇంతలో ANSET Manager సునీల్ కుమార్ రెడ్డి గారు 'ఫోన్ చేసి మినర్వ పాఠశాల లో కార్యక్రమం పెట్టుకున్నాము, రాగలరా ?' అని అడిగారు. మరో ఆలోచనే లేకుండా 'సరే' అనేశాను. పిల్లలని కలవడం మరియు ఉత్తేజపరచడం కంటే విలువైన పనులేముంటాయి ఎవరికైనా? అలా మినర్వ పాఠశాలలో ఒక యాభై మంది పదవ తరగతి పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ మీద క్లాసులు తీసుకున్నాను. 

తరువాత మా కళాశాలకు వెళ్లిన నాకు, తరగతి గదులన్నీ గింజలు తీసేసిన దానిమ్మ కాయల్లా బోసిపోయి కనిపించాయి. అందునా పరీక్షలు అయిపోవడంతో నాకు క్లాసులు కూడా లేవు. అంతలో తాటిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాల లో మరో కార్యక్రమం పెట్టుకున్నట్టు సునీల్ గారు, చిగిచెర్ల శ్రీనివాసులు గారు ఫోన్ చేయడంతో ఒప్పేసుకున్నాను. మధ్యాహ్నం 2.15 కు వచ్చి వారివురు నన్ను కారులో తాటిచెర్ల కు పిలుచుకువెళ్లారు. నేను పోయిన వెంటనే  'సా.. సా...నమస్తే సా' అంటూ చిన్న చిన్న పిల్లలు నా చుట్టూ మూగిపోయారు. వారికివ్వడానికి నా దగ్గర కనీసం చాక్లెట్స్ కూడా లేవు. 
'సా ' అన్నారు అందరూ ఒకేసారి. వాళ్లు నన్ను సార్ అని పూర్తిగా పిలవకుండా 'సా' తో సరిపెట్టేస్తున్నారు. 'మాకు పద్యాలు వచ్చు సా' అని అరిచి ఒకరి తరువాత ఒకరు నాకు పద్యాలు చెప్పడం మొదలెట్టారు. అనుకోకుండా నాకీ పద్య పఠన పోటీ కార్యక్రమం తగులుకొనిందేమిటా అని నేను ఆలోచనలో పడిపోయాను. అందరూ ముక్త కంఠంతో ఎంత గట్టిగా చెపుతున్నారంటే, వారి ఉత్సాహానికి నా చెవులు సాగి ఏనుగు చెవులైతాయేమో అనిపించింది. అంతలో పదో తరగతి మరియు తొమ్మిదవ తరగతి పిల్లలకు ఒక గదిలో నా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పిల్లల ఉత్సాహానికి బ్రేక్ పడింది. 'సా.. సా.. మీ క్లాసుకు మేము వస్తాం సా' అని ఆ చిట్టి, చిట్టి పిల్లలు వెంటపడ్డారు. వారికి ఎలాగో నచ్చచెప్పి నేను వేరే తరగతి గదిలోకి వెళ్లి నైపుణ్యాభివృద్ది మీద ఒక అరగంట పాటు ఉపన్యసించాను. నా తరువాత సునీల్ కుమార్ గారు మాట్లాడారు. తరువాత బిస్కట్స్ మరియు తేనీరు పుచ్చుకుని 3.30 కల్లా కళాశాల చేరిపోయాను. 
అలా ఈ రోజు మొత్తం నాకు నిర్మాణాత్మకంగా జరిగింది. 





















 

1 comment:

 Ambedkar Jayanthi at Govt College (A) Anantapur 2025