తిరుమల తిరుపతి దేవస్థానం , అనంతపురం వారి ఆధ్వర్యం లో డిసెంబర్ 8 వ తేదీన భగవద్గీతా పఠన పోటీలు నిర్వహించారు. దానికి ఒక న్యాయ నిర్ణేతగా నేను కూడా వ్యవహరించాను. నాతో పాటుగా మిత్రులు సుధామ వంశీ, రేనాటి నాగేశ్వర్ , శర్మ, ఓం ప్రకాష్ తదితరులు కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. బాబు గారు పోటీ ఏర్పాట్లను చక్కగా చేశారు. 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతే గాక సంపూర్ణ భగవద్గీతా పఠన పోటీలు కూడా జరిగాయి. ఉచ్చారణా, ధారణ మరియు ఆంగికం ఆధారంగా విజేతలను ఎంపిక చేయడం జరిగింది. ధర్మవరం, హిందూపురం మరియు మడకశిర లాంటి దూర ప్రాంతాల నుంచి పిల్లలు, శిక్షకులు రావడం జరిగింది. ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగం మీద పోటీలు ఆసక్తి కరంగా జరిగాయి. మూడు వయో సమూహాలుగా విద్యార్థులను విభజించి పోటీలు నిర్వహించారు.
సంపూర్ణ భగవద్గీతా పఠన పోటీలు గీతా అవధానాన్ని తలపించాయి. నార్పల వాస్తవ్యులు అయిన నారాయణప్ప మరియు బయ్యన్న అనే అన్నదమ్ములు పోటా పోటీగా పాల్గొన్నారు. అధ్యాయం పేరు, శ్లోక సంఖ్య చెపితే చాలు, వారు శ్లోకం మొత్తం వల్లె వేశారు. శ్లోకం చెపితే అధ్యాయం చెప్పారు. గీతలో అర్జునుడు, దృతరాష్ట్రుడు, సంజయుడు, భగవానుడు ఎన్నేసి శ్లోకాలు చెప్పారో అలవోకగా చెప్పారు. ఇంతా చేస్తే వారిలో ఒకరు ఐదవ తరగతి వరకు చదువుకుంటే మరొకరు ఇంటర్ స్థాయిలో చదువు మానేసారు. ఈ అన్నదమ్ముల ధారణ, ధారాశుద్దీ అమోఘం.
ఈ పోటీలు ముగిసేసరికి మధ్యాహ్నం 3 గంటలయ్యింది. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయ ఆచార్యులు చిన్ని కృష్ణుడు అక్షరాల వెయ్యి రూపాయలు చిన్నారులకు బహుమతి గా ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను మనోరంజకంగా ప్రదర్శించారు. అన్నీ కూడా సాంప్రదాయ నృత్యాలే. RDO కేశవ నాయుడు చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతి, పుస్తక బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. చివరగా న్యాయ నిర్ణేతలకు, నృత్య శిక్షకులకు సన్మానాలు చేయడం జరిగింది.
No comments:
Post a Comment