Awareness tips on Hotel Management 
 షరా మామూలే!! నేను మా ANSET మిత్ర బృందం సునీల్ కుమార్ రెడ్డి గారు మరియు చిగిచెర్ల శ్రీనివాసులు సర్ కలిసి బుక్కరాయ సముద్రం లో ప్రైవేట్ B.Ed కళాశాల ఆవరణలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ గ్రామీణ యోజన ఆధ్వర్యం లో Hotel Management మరియు Beverages ట్రేడ్స్ లో శిక్షణ పొందుతున్న 90 మంది trainees తో కొన్ని అంశాలు ముచ్చటించాము. వారు ఎంచుకున్న శిక్షణా కార్యక్రమం ముఖ్యంగా హోటల్ నిర్వహణ కాబట్టి, వారికి ఈ క్రింది సూచనలు చేశాను. 
- మీరు హోటల్ స్వంతంగా ప్రారంభించాలి అనుకుంటున్నారా లేక హోటల్ లో పనిచేయాలి అనుకుంటున్నారా నిర్ణయించుకోండి.
 - మీరు పెట్టబోయే హోటల్ పేరు ఇప్పుడే మనసులో అనుకోండి.
 - మీరు పెట్టబోయే హోటల్ శాకాహార లేక మాంసాహార హోటలా కూడా నిర్ణయించుకోండి.
 - అన్నిటికంటే ఏ ప్రాంతంలో మీరు హోటల్ ప్రారంభిస్తే బాగుంటుందో, అక్కడ ఎలాంటి తిండి పదార్థాలకు డిమాండ్ ఉందో, ఆ ప్రాంత జనాల ఆహారపు అలవాట్లు ఎలాంటివో ఒక సర్వే చేసి సిద్దంగా పెట్టుకోండి.
 - ఐదు నక్షత్రాల హోటల్ కు వచ్చే కస్టమర్ల మనస్తత్వం అధ్యయనం చేయండి. హోటల్ పరిశ్రమ గురించి యండమూరి రచించిన 'ఇడ్లీ, వడ ఆకాశం' అనే పుస్తకం చదవండి. ఇది కామత్ యొక్క biographical sketch.
 - వంట చేయడం మొదట నేర్చుకోండి. పప్పుకు తగిన ఉప్పు, ఉప్పుకు తగిన నిప్పు ఉండేలా చూసుకోండి.
 - వంట చేయడం మరియు వడ్డించడం రెండూ కళలే.
 - ఎవరికైనా సరే కొసరి, కొసరి వడ్డించడం అలవాటు చేసుకొండి. సాదరంగా పెట్టకుంటే ఎవరూ తినరు. ఒకవేళ తిన్నా రుచించదు. 'ప్రియము లేని కూడు పిండంబు కూడురా' అని మన వేమన ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ప్రియంగా వడ్డించండి
 - కంటికి ఇంపుగా ఉంటే, కడుపుకు ఇంపు అని మరవకండి.
 - శుభ్రంగా ఉండండి.
 - స్ట్రీట్ foods గురించి, జాతీయ మరియు అంతర్జాతీయ వంటల గురించి తెలుసుకోండి.
 - వివిధ వంటల గురించి తెలియాలి అంటే మల్లాది రచించిన మిస్రాణి చదవండి. మీకు food lovers గురించి తెలియాలి. Some people travel for food. మిరపకాయ బజ్జీ బాగుంటే, దానిని తినడానికి మైళ్ల కొద్దీ ప్రయాణించేవాళ్ళు నాకు తెలుసు.
 - మన దేశంలోనే అనేక రకాల వంటకాలు ఉన్నాయి. ఈ తరం వారికి నచ్చే రుచుల గురించి అధ్యయనం చేయండి. పల్లెటూరి రుచుల గురించి తెలుసుకోండి.
 - మీరు ఆర్థికంగా స్థిరపడడానికి పెద్ద, పెద్ద హోటళ్లే పెట్టాల్సిన పనిలేదు. చిన్న, చిన్న Eat outs చాలు.
 - ప్రాంతీయ రుచుల గురించి అవగాహన పెంచుకోండి.
 - మీకు వంట చేయడం లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. చెన్నై శరవణ భవన్ లో మూడు దశాబ్దాల క్రితం నేను తిన్న ఇడియప్పం రుచి నాకు ఇంకా గుర్తుకు ఉంది.
 - ఎదుటి వారి జిహ్వా చాపల్యమే మీ బలం. ప్రపంచం లో వినే వారి కన్నా, తినే వారే ఎక్కువ ఉన్నారు కాబట్టి, నాలాంటి టీచర్ల కన్నా మీరే ఎక్కువ సంపాదించగలరనే విషయాన్ని నమ్మండి.
 - స్నాక్స్ చేయడం నేర్చుకోండి. మీరు చేసే వంటకు రంగు, రుచి, వాసనా అదిరిపోవాలి.
 - కొన్నిపదార్థాలు వీధుల్లో తింటేనే బాగుంటుంది. ముఖ్యంగా మా రాయలసీమ లో దొరికే గుంత పొంగణాల లాంటివి చేయడం నేర్చుకుంటే, పొయ్యి, పెనాన్ని పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించవచ్చు.
 - మీరు వంటకు వాడే దినుసులు నాణ్యమైనవిగా ఉండాలి. నాణ్యతలో రాజీ వద్దు సుమీ!!!!!
 - మీరు YouTube వంటల vlog ప్రారంభించవచ్చు. నాలాగా బ్లాగ్ పెట్టి, దానిలో మీరు చేసిన వంటల గురించి ఫోటోస్ తో సహా పంచుకోవచ్చు. ఇంస్టా లో వంటల రీల్స్ చేయవచ్చు.
 - కేక్స్ తయారీ మీద కూడా పట్టు సాధించండి. కాంటీన్ నిర్వహణ గురించి తెలుసుకోండి. అనంతపురం బెంగళూర్ బేకరీ లో నేను చిన్నప్పుడు ప్రతి రోజూ కారం బన్ను తినేవాణ్ణి. ఆ బన్నుకు నేను చిన్నప్పుడే ఫిదా అయిపోయాను.
 - ఇక మీరు సమోసా చేస్తే ఎలా ఉండాలి అంటే దానిని తినడం కోసం అమృతం వదిలేసి వచ్చి దేవతలు కూడా కొట్టుకు చావాలి.
 - తినడం లో ఉన్న మజా మీ హోటల్ కు వచ్చేవారికి తెలియాలి. తినే వారికి రుచి నసాళానికి తగిలి రససిద్ది కలగాలి. మీ వంట తిన్న తరువాత నల భీమ పాకాన్ని మరిచిపోవాలి.
 
.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)
No comments:
Post a Comment