Wednesday, May 21, 2025



       దేశ యువత కు, గ్రామీణ యువతకు ITI ల అవసరం 

అనంతపురం ప్రభుత్వ  ITI లో నిర్వహించిన skill hour కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా వెళ్లడం జరిగింది. ప్రిన్సిపల్ రామ్మూర్తి గారు నన్ను సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించారు. నాతో పాటుగా ఆన్సెట్ మేనేజర్ సునీల్ కుమార్ రెడ్డి గారు కూడా వేదిక మీద ఆసీనులైనారు. నేను అనంతపురం లో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ ITI లలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నాను. అనంతపురం లోని ప్రభుత్వ ITI ని తలుచుకుంటే నాకొక నాస్టాల్జిక్ ఫీలింగ్ కలుగుతుంది. నా బాల్యంలో  ఈ ITI మైదానంలో నేను, మా బావ చిన్న సైకిల్ తొక్కడం ఎలాగో నేర్చుకున్నాము. అప్పట్లో ఆ చిన్న సైకిల్ రోజంతా మనం వాడుకున్నా, దాని కిరాయి కేవలం రెండు రూపాయలు ఉండేది. ఇలా నా సైక్లింగ్ నైపుణ్యాలకు పదును పెట్టిన ప్రదేశం ఈ ప్రభుత్వ ITI. దీనికి అప్పట్లో ఒక సైరన్ ఉండేది. ఇది మధ్యాహ్నం ఒంటి గంటకు గట్టిగా ఒక రెండు నిమిషాలకు పైగా మోగేది. అది ఎందుకో ఇప్పుడు మూగపోయింది. ఈ రోజు ఈ ITI లో ఉన్న పిల్లలను చూస్తుంటే, నా దేశంలోని work force అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. శ్రమైక జీవన సౌందర్యం నా ముందు పరుచుకుంది. శ్రీ శ్రీ చెప్పిన సమస్త వృత్తుల చిహ్నాలు నా ముందు కదలాడాయి. తీరిక వర్గాలకు శ్రామిక వర్గాలు చేస్తున్న సేవ గుర్తుకు వచ్చింది. మా డిగ్రీ విద్యార్థులకు, ఈ ITI విద్యార్థులకు మౌలికంగా ఒక తేడా ఉంది. అదేమంటే మేము మా డిగ్రీ కళాశాలలో కేవలం విద్య నేర్పుతాము. జ్ఞానం అందజేస్తాము. కానీ ITI లో ఉన్న అధ్యాపకులు లేదా instructors  వివిధ trades లో ఉన్న విద్యార్థులకు నైపుణ్యం అలవడేలా శిక్షణ ఇస్తారు. మన దేశానికి IIT లు ఎంత ముఖ్యమో ITI లు కూడా అంతే ముఖ్యం. ఈ skill hour లో ఈ క్రింది అంశాలు ITI పిల్లలతో పంచుకున్నాను. 

  • ముందు ముందు సాంప్రదాయ కళాశాలల కన్నా కూడా ITI శిక్షణ పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. 
  • ITI లో శిక్షణ ఉపాధి కల్పనకు తగ్గ నైపుణ్యాన్ని ఇస్తుంది. 
  • మీరు చదువుకున్న ITI లో మీరు ట్రైనర్ గా రావాలి అంటే మీరు CTI చేయాలి. 
  • మీరు కృత్రిమ మేధ మీద కూడా పట్టు సాధిస్తే, మీకు అవకాశాలు వెల్లువెత్తుతాయి. 
  • మీరు మీ రంగంలో నైపుణ్యంతో పాటు కార్మిక చట్టాల పట్ల కూడా అవగాహన ఏర్పరుచుకోండి. 
  • శ్రమ చేయడానికి సిగ్గు పడకండి. Dignity of labour అలవరుచుకోండి. 
  • భవిష్యత్తు లో నిపుణులైన పని వారు దొరకడం చాలా కష్టం అవుతుంది. మీ నైపుణ్యాలకు మార్కెట్ విలువ పెరుగుతుంది. మీరు సంపదను అవలీలగా సృష్టించగలరు. 
  • సాధారణ పట్టభద్రుల లాగా మీరు ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వెంపర్లాడరు. మీరే ఉపాధి కల్పిస్తారు. 
  • దేశంలో ITI ల సంఖ్య మరియు skill hubs సంఖ్య పెరగాలి. 
  • దేశంలో జ్ఞానుల అవసరం కంటే, నిపుణుల అవసరం ఎక్కువ ఉంది. 
  • మంచి పని తీరు ఉన్న వారిని ప్రపంచం వదులుకోదు 
  • పని చేయడం మరియు పనిని పర్యవేక్షించడం ద్వారా మాత్రమే సంపదను సృష్టించగలం.
  • పని చేయని వాడు ఏదో ప్రాపకంతో పైకి వచ్చినా కూడా రోజులు గడిచే కొద్దీ తన ప్రాభవాన్ని కోల్పోతాడు. 
కాబట్టి విద్యార్థులారా!!!! మీ మీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోండి. దేశం కోసం పాటు పడండి. 












No comments:

Post a Comment

                                Multiple Activities in Our College Today  1. Meeting is convened in the examination committee with the membe...