Friday, August 25, 2023










 కొన్ని అనుభూతులు తిరిగి రావు. రాకూడదు కూడా. అలాంటివే మేము కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పనిచేసిన రోజులు. ఆ విద్యార్థులు చూపించే అనురాగానికి విలువకట్టలేము. వారిని కలుసుకునే అవకాశము ఈ రోజు తిరిగి మహా జాబ్ మేళా రూపం లో నాకు వచ్చింది. రెండు బస్సుల్లో  ఉదయం 9 గంటల కంతా  చిల్లో బొల్లో మంటూ దిగేశారు వారు. వారందరితో కరచాలనం చేసిన తరువాత మా విభాగానికి పిలుచుకుపోయాను. ఇక్కడ ఉన్న సౌకర్యాలు వారికి బాగా నచ్చినట్టే అనిపించాయి. మా ప్రయోగశాలలు, మ్యూజియం చూసి వారిలో ఒకడు "ఎంతున్నా ఆర్ట్స్ కళాశాల.. ఆర్ట్స్ కళాశాలే సర్" అన్నాడు. తరువాత వారికి కొత్తగా ప్రవేశపెట్టిన 4 సంవత్సరాల డిగ్రీ ఆనర్స్ కోర్సు గురించి తెలియజేశాను. తరువాత జాబ్ మేళా కు బయలుదేరాము. ఏ మాటకామాటే చెప్పుకోవాలి, మా కాలం లో ఇలా ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు. కంపెనీ లే ఉద్యోగాలు ఇస్తామంటూ కాలేజీ ప్రాంగణం లోకి వచ్చేశాయి. ఏకంగా 33 కంపెనీలు. నన్ను రిజిస్ట్రేషన్ పనిలోకి వేశారు. వందల మంది గుంపుగా వచ్చేశారు. నిజం చెప్పొద్దు.. ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. అంత మంది విద్యార్థులను ఒక చోట చూస్తుంటే నాకు పుష్కరాలు చూసినంత సంబరంగా అనిపించింది. కమిషనర్ గారు విద్యార్థులను ఉద్దేశించి ఉత్తేజభరితంగా ప్రసంగించారు. తరువాత విద్యార్థులకు ఇంటర్వ్యూ లు నిర్వహించి సుమారుగా 3000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ కళ్ళల్లో ఎన్ని ఊహలు, ఎన్ని తలపులు, ఎన్నెన్ని ఆశలు కనిపించాయో నాకు. వారిని చూస్తుంటే నా దేశ భవితకు ఇక ఢోకా లేదనిపించింది. మరి మీకు కూడా ఉద్యోగం రావాలంటే ఈ క్రింది సలహాలు పాటించండి. 

- జ్ఞానానికి, నైపుణ్యానికి మధ్య తేడా గుర్తించండి. జ్ఞానం వలన మోక్షం రావొచ్చు, కానీ నైపుణ్యం వలన ఉపాధి దొరుకుతుంది 

- దేశం నిండా ఉండేది ఉద్యోగాలే, కానీ చేసే నైపుణ్యం ఉన్న యువత దొరకడం లేదు 

- మంద లో ఒకరిగా కాకుండా, వంద లో ఒకరిగానన్నా ఉండే ప్రయత్నం చేయండి 

- ఏ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారో, దానికి తగ్గ నైపుణ్యాలు అలవరచుకోండి  

- మొదట మీరు ఎందులో రాణించగలరో తెలుసుకోండి 

- మీరు ఎంచుకున్న రంగం లో ఎదుగుదల కు అవకాశం ఎంతో బేరీజు వేసుకోండి. 

- చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుంటే ఎదగలేరు. Low aim is crime అని గుర్తుపెట్టుకోండి 

- వీలైతే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళండి 

విజయోస్తు.. దిగ్విజయోస్తు

1 comment:

                                        My newly published book "టీ టైమ్ కథలు"