ఈ రోజు మా ఆర్ట్స్ కళాశాల కు, ముఖ్యంగా మా జువాలజీ డిపార్ట్మెంట్ కు పండగ వచ్చింది. మాకు జువాలజీ బోధించిన గురువు శ్రీమతి వసంత మూర్తి గారు మా కళాశాల ను సందర్శించి, మా ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి గారికి కళాశాల తైల వర్ణ చిత్రాన్ని బహుకరించారు. 83 వసంతాల ఈ వయసులో ఆమె చాలా ఓపికగా చిత్రీకరించిన ఈ oil painting లో ఈ కాలేజీ పట్ల ఆమెకున్న అనుబంధం ప్రస్పుటమయ్యింది. 33 సంవత్సరాల పాటు ఈ చారిత్రక ఆర్ట్స్ కళాశాల లో academic మరియు administrative రంగాలలో వివిధ స్థాయి లలో పనిచేసిన అనుభవం ఆమెది. అనేక తరాలకు తరగతి గదిలో మంత్రసానితనం చేసిన నైపుణ్యం వసంత మూర్తి గారిది. అప్పట్లో power point presentations లేవు. కేవలం సుద్ద ముక్క తో విద్యా బుద్దులు నేర్పేవారు. ఆమె చెప్పిన ప్రతి అక్షరం మా తరానికి బీజాక్షరం అయిపోయింది.
మేడమ్ గారు ఒక రెండు వారాలు ముందుగానే తను వస్తున్న విషయం, ఉద్దేశ్యం తెలియజేశారు. ఈ రోజు చెప్పినట్టుగానే ఉదయం 10 కల్లా కాలేజీ వద్దకు వచ్చేశారు. అప్పటికే నేను డిపార్ట్మెంట్ కు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. నాతో పాటుగా హొన్నూరప్ప సర్, అనంత రావ్ సర్ కూడా ఉన్నారు. ఇక మా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మేడమ్ గారి చుట్టూ ఆత్మీయుల్లా చేరిపోయారు. తరాల మధ్య అంతరాలు చెరిగిపోవడం అంటే ఇదే కదా!!!!! తరువాత అందరం ప్రిన్సిపల్ ఛాంబర్ లోకి వెళ్ళాము. అక్కడ వసంత మూర్తి గారు వేసిన చిత్రాన్ని బహుకరించాం. ఆ చిత్రం కవర్ విప్పగానే, దానిని చూసి అందరూ కాసేపు మంత్రముగ్ధులయిపోయాం. తరువాత మేడమ్ గారిని ప్రిన్సిపల్ మరియు ఇతర అధ్యాపకులు శాలువా కప్పి సత్కరించారు.
అప్పటికే మేడమ్ గారిని చూడడం కోసం మాకు బాటనీ బోధించిన వరలక్ష్మీ మేడమ్, వెంకట రెడ్డి సర్ వచ్చేశారు.
ఇక డిపార్ట్మెంట్ కు వసంత మూర్తి మేడమ్ ను పిలుచుకుపోయి ఆమె బోధించిన తరగతి గదులను చూపించాను. మాకు ఆమె కార్డేటా బోధించేవారు. అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తు ఉండిపోయాయి. మాకు lesson చెప్పేటప్పుడు మేడమ్ గారు ఒక తెలుగు పదం కూడా వాడేవారు కాదు. ఎందుకంటే మాది ఇంగ్షీషు మీడియం సెక్షన్. బొమ్మ వేస్తూ పాటం చెప్పేవారు. పాటం అయిపోయే సమయానికి బోర్డ్ మీద బొమ్మ రూపుకట్టి కనిపించేది. దీని వలన diagrams ఎలా వేయాలో మాకు తెలిసేది.
లాబ్స్ మరియు మ్యూజియం లు చూసి గత అనుభూతులని, అనుభవాలని అందరం నెమరేసుకున్నాం. స్వీట్స్ కొన్ని తీసుకుని మాతో కాసేపు అనేక విషయాలు చర్చించి వసంత మూర్తి మేడమ్ తిరుగు ప్రయాణం అయ్యారు. మా విద్యార్థులకు మా గురువు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
స్వస్తి.. గురుభ్యోనమః