Saturday, December 28, 2024

As a trainer to Sub Inspectors of Police of AP Special Police Battalion at PTC & The Cover Page of my book 'Tea Time Stories'  









Friday, December 27, 2024

ఈ రోజు నాకు ఉదయం 10 గంటలకు PTC లో AP Special Police సబ్ ఇన్స్పెక్టర్స్ కు ఉన్న శిక్షణ వాయిదా పడడంతో, ఏం చేయాలో తోచక యండమూరి రాసిన 'అమీబా' పుస్తకం చదువుతూ కూచున్నాను. ఇంతలో ANSET Manager సునీల్ కుమార్ రెడ్డి గారు 'ఫోన్ చేసి మినర్వ పాఠశాల లో కార్యక్రమం పెట్టుకున్నాము, రాగలరా ?' అని అడిగారు. మరో ఆలోచనే లేకుండా 'సరే' అనేశాను. పిల్లలని కలవడం మరియు ఉత్తేజపరచడం కంటే విలువైన పనులేముంటాయి ఎవరికైనా? అలా మినర్వ పాఠశాలలో ఒక యాభై మంది పదవ తరగతి పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ మీద క్లాసులు తీసుకున్నాను. 

తరువాత మా కళాశాలకు వెళ్లిన నాకు, తరగతి గదులన్నీ గింజలు తీసేసిన దానిమ్మ కాయల్లా బోసిపోయి కనిపించాయి. అందునా పరీక్షలు అయిపోవడంతో నాకు క్లాసులు కూడా లేవు. అంతలో తాటిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాల లో మరో కార్యక్రమం పెట్టుకున్నట్టు సునీల్ గారు, చిగిచెర్ల శ్రీనివాసులు గారు ఫోన్ చేయడంతో ఒప్పేసుకున్నాను. మధ్యాహ్నం 2.15 కు వచ్చి వారివురు నన్ను కారులో తాటిచెర్ల కు పిలుచుకువెళ్లారు. నేను పోయిన వెంటనే  'సా.. సా...నమస్తే సా' అంటూ చిన్న చిన్న పిల్లలు నా చుట్టూ మూగిపోయారు. వారికివ్వడానికి నా దగ్గర కనీసం చాక్లెట్స్ కూడా లేవు. 
'సా ' అన్నారు అందరూ ఒకేసారి. వాళ్లు నన్ను సార్ అని పూర్తిగా పిలవకుండా 'సా' తో సరిపెట్టేస్తున్నారు. 'మాకు పద్యాలు వచ్చు సా' అని అరిచి ఒకరి తరువాత ఒకరు నాకు పద్యాలు చెప్పడం మొదలెట్టారు. అనుకోకుండా నాకీ పద్య పఠన పోటీ కార్యక్రమం తగులుకొనిందేమిటా అని నేను ఆలోచనలో పడిపోయాను. అందరూ ముక్త కంఠంతో ఎంత గట్టిగా చెపుతున్నారంటే, వారి ఉత్సాహానికి నా చెవులు సాగి ఏనుగు చెవులైతాయేమో అనిపించింది. అంతలో పదో తరగతి మరియు తొమ్మిదవ తరగతి పిల్లలకు ఒక గదిలో నా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పిల్లల ఉత్సాహానికి బ్రేక్ పడింది. 'సా.. సా.. మీ క్లాసుకు మేము వస్తాం సా' అని ఆ చిట్టి, చిట్టి పిల్లలు వెంటపడ్డారు. వారికి ఎలాగో నచ్చచెప్పి నేను వేరే తరగతి గదిలోకి వెళ్లి నైపుణ్యాభివృద్ది మీద ఒక అరగంట పాటు ఉపన్యసించాను. నా తరువాత సునీల్ కుమార్ గారు మాట్లాడారు. తరువాత బిస్కట్స్ మరియు తేనీరు పుచ్చుకుని 3.30 కల్లా కళాశాల చేరిపోయాను. 
అలా ఈ రోజు మొత్తం నాకు నిర్మాణాత్మకంగా జరిగింది. 





















 

Tuesday, December 17, 2024

అది 1988- 91 మధ్య కాలం. నేను అనంతపురం ఆర్ట్స్ కాలేజీ లో డిగ్రీ చదువుతున్న రోజులు. బాటనీ, జువాలజీ మరియు కెమిస్ట్రీ కాంబినేషన్ తో డిగ్రీ చేరిపోయాను. అప్పట్లో ఈ ఆర్ట్స్ కాలేజీ లో సీటు దొరకడం చాలా కష్టం. ఇంటర్ సెకండ్ క్లాస్ లో పాస్ అయిన నాకు వెయిటింగ్ లిస్ట్ లో సీట్ వచ్చింది. మేము 11 మంది అబ్బాయిలు, నలభై మందికి పైగా అమ్మాయిలు ఉండేవాళ్లం. నేను ఏదో అయిపోవాలి అనుకుని డిగ్రీ చేరలేదు. పెద్ద లక్ష్యం అంటూ లేని తత్వం నాది. నిర్లక్ష్యం గా గడిపేసే తత్వం నాది. బిందాస్ అనే పదం అప్పటికి కనిపెట్టలేదు గాని, నాకు బాగా అతికే పేరు అది. అప్పట్లో ఉద్యోగస్తుల పిల్లలు కూడా మా కళాశాల లో చేరేవారు. నాకైతే ఆర్ట్స్ కాలేజీ లో సీట్ రావడం భలే గొప్ప ఫీల్ నిచ్చింది. మా నాన్న కూడా ఇక్కడే చదివారు మరి. నేను చదువుకునేటప్పుడు మాకు పాఠాలు బోధించిన లెక్చరర్లు చాలా మంది మా నాన్నకు క్లాస్ మేట్స్. సరే ఎలాగో ఆర్ట్స్ కాలేజీ లో సీట్ వచ్చింది. అప్పట్లో ఇంగ్షీషు మీడియం అంటే ఇప్పటి లాగా తెలుగు లో చెప్పేవారు కాదు. ఒక్క తెలుగు పదం కూడా వాడకుండా బోధన మొత్తం ఇంగ్షీషు లో సాగేది. క్లాసులు స్ట్రిక్ట్ గా జరిగేవి. కానీ నేనే ఎక్కువ బంక్ కొట్టేవాడిని. 

అప్పట్లోనే శివ సినిమా శాంతీ థియేటర్ లో విడుదలయ్యింది. నాకిప్పటికీ గుర్తు.. నేను, ఆప్యాయ, సురేష్, నాగేశ్వర, శివ కిశోర్, రామకృష్ణ ( ఇప్పుడు వీడు యోగి వేమన విశ్వ విద్యాలయం లో ఆచార్యుడు ) ఆ సినిమా కు వెళ్లి తెగ ఎంజాయ్ చేసాము. ఆ సినిమా లోని 'బాటనీ పాఠం ఉంది' సాంగ్ ను పాడుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాము మేమంతా. 

మా కాలేజీ అప్పటికే 75 వసంతాలు పూర్తీ చేసుకుంది. పెద్ద, పెద్ద కారిడార్స్. గేలరీ క్లాస్ రూములు. ఆ డెస్క్ లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రిన్సిపల్ ఛాంబర్ అప్పట్లో పైన ఉండేది. ఛాంబర్ బయట బిళ్ల బంట్రోతు ఉండేవాడు. అప్పట్లో మా కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేయడం జనం దృష్టిలో మహా రాజ యోగం. నేను చదువుకున్న మూడేళ్లలో నేను మా ప్రిన్సిపల్ ను చూసిందే లేదు. ఇక నేను ఏ మాత్రం క్లాసులకు వెళ్ళేవాడినో ఊహించుకోండి. 

అప్పట్లో ప్రాక్టికల్స్ అంటే పెద్ద జాతరే. మేము కోసేది కప్పలే అయినా, బడాయికి మాత్రం తక్కువుండేది కాదు. నేను గొంతు కోసిన ఏ కప్ప తన బెక.. బెక.. భాష లో నన్ను శపించిదో మరి, నాకు డిగ్రీ లో పెద్ద మార్కులేమీ రాలేదు. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అనే లెవెల్లో కాలేజీ అంతా కలతిరిగే వాడిని. ఇంత అల్లరి విద్యార్థి ని అయిన నన్ను భరించి విద్యా బుద్దులు గరిపిన మా గురువులు చాలా కాలం తరువాత ఈ రోజు మా డిపార్ట్మెంట్ కు రావడం జరిగింది. వారే వసంత మూర్తి మేడం, మీనాక్షీ మేడం మరియు మదన్ మోహన్ దాస్ సర్. 

నేను చదువుకునే సమయం లో జువాలజీ విభాగాధిపతి గా వసంత మూర్తి మేడం ఉండేవారు. మేడం గారు తరువాతి కాలం లో ప్రిన్సిపల్ కూడా అయ్యారు. మేడం చెప్పిన పాఠం లోని ప్రతి అంశం నాకు ఇంకా గుర్తుకు ఉంది. మదన్ మోహన్ సర్ మాకు ecology చెప్పేవారు. సర్ వాడిన పారిభాషిక పదాలు నాకు ఇప్పటికీ గుర్తుకు వున్నాయి. మా గురువులు వచ్చే సమయానికి నేను exam section లో బిజీ గా ఉన్నప్పటికీ, వారు వచ్చిన విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్లాను. అందరం కలిసి మా డిపార్ట్మెంట్ స్టాఫ్ రూముకు వెళ్లాము. ఈ కళాశాల లో చదువుకున్న నేను, ఇక్కడే జంతు శాస్త్ర విభాగాధిపతిగా  పనిచేయడం నా అదృష్టం ( మా స్టూడెంట్స్ దురదృష్టం అని కూడా తస్మదీయుల ఉవాచ ). తరువాత మేమంతా మ్యూజియం కు వెళ్లాము. అక్కడ కూచుని కాసేపు ఆ రోజులను గుర్తు చేసుకున్నాము. 

నేనైతే బోధనలో అనేక మార్పులు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మా అధ్యాపకులు మాకు నల్ల బోర్డ్ మీద పాఠాలు చెప్పేవారు. ఇప్పుడు మేము డిజిటల్ బోర్డ్స్ ఉపయోగిస్తూ క్లాస్ రూములను డిజిటల్ డస్ట్ బిన్స్ గా మార్చేసాము. మా స్టూడెంట్స్ అంతా కృత్రిమ మేధస్సు నీడలో తలదాచుకున్న గూగుల్ చాటు బిడ్డలు. నేను చూసిన మార్పులను మా గురువులకు నాదైన హాస్య చతురత జోడించి వివరించాను. నేను వీరితో మాట్లాడుతున్నంత సేపు మా సహ అధ్యాపకులు నాగ జ్యోతి, అరుణ కుమారి, సలీం, గిరిధర్ నాతోనే ఉన్నారు. 

మా గురువులు pensioners meet కు హాజరై వచ్చిన తరువాత ఉడుతా భక్తిగా నాగ జ్యోతి మేడం తెచ్చిన శాలువాల తో మా గురువులను సత్కరించుకున్నాము. నేను రిటైర్ అయ్యేంతవరకు, అంటే ఇంకా మరో తొమ్మిది సంవత్సరాలు మా గురువులు ఇలాగే మమ్మల్ని పలకరించడానికి వస్తూ ఉండాలని కోరుకుంటూ, వారి ఆశీర్వాదాలు తీసుకుని, exam section కు తిరిగి వెళ్లి పోయాను. 

స్వస్తి. 
















 

Sunday, December 8, 2024

 తిరుమల తిరుపతి దేవస్థానం , అనంతపురం వారి ఆధ్వర్యం లో డిసెంబర్ 8 వ తేదీన భగవద్గీతా పఠన పోటీలు నిర్వహించారు. దానికి ఒక న్యాయ నిర్ణేతగా నేను కూడా వ్యవహరించాను. నాతో పాటుగా మిత్రులు సుధామ వంశీ, రేనాటి నాగేశ్వర్ , శర్మ, ఓం ప్రకాష్ తదితరులు కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. బాబు గారు పోటీ ఏర్పాట్లను చక్కగా చేశారు. 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతే గాక సంపూర్ణ భగవద్గీతా పఠన పోటీలు కూడా జరిగాయి. ఉచ్చారణా, ధారణ మరియు ఆంగికం ఆధారంగా విజేతలను ఎంపిక చేయడం జరిగింది. ధర్మవరం, హిందూపురం మరియు మడకశిర లాంటి దూర ప్రాంతాల నుంచి పిల్లలు, శిక్షకులు రావడం జరిగింది. ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగం మీద పోటీలు ఆసక్తి కరంగా జరిగాయి. మూడు వయో సమూహాలుగా విద్యార్థులను విభజించి పోటీలు నిర్వహించారు. 

సంపూర్ణ భగవద్గీతా పఠన పోటీలు  గీతా అవధానాన్ని తలపించాయి. నార్పల వాస్తవ్యులు అయిన నారాయణప్ప  మరియు బయ్యన్న అనే అన్నదమ్ములు పోటా పోటీగా పాల్గొన్నారు. అధ్యాయం పేరు, శ్లోక సంఖ్య చెపితే చాలు, వారు శ్లోకం మొత్తం వల్లె వేశారు. శ్లోకం చెపితే అధ్యాయం చెప్పారు. గీతలో అర్జునుడు, దృతరాష్ట్రుడు, సంజయుడు, భగవానుడు ఎన్నేసి శ్లోకాలు చెప్పారో అలవోకగా చెప్పారు. ఇంతా చేస్తే వారిలో ఒకరు ఐదవ తరగతి వరకు చదువుకుంటే మరొకరు ఇంటర్ స్థాయిలో చదువు మానేసారు. ఈ అన్నదమ్ముల ధారణ, ధారాశుద్దీ అమోఘం. 

ఈ పోటీలు ముగిసేసరికి మధ్యాహ్నం 3 గంటలయ్యింది. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయ ఆచార్యులు చిన్ని కృష్ణుడు అక్షరాల వెయ్యి రూపాయలు చిన్నారులకు బహుమతి గా ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను మనోరంజకంగా ప్రదర్శించారు. అన్నీ కూడా సాంప్రదాయ నృత్యాలే. RDO కేశవ నాయుడు చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతి, పుస్తక బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. చివరగా న్యాయ నిర్ణేతలకు, నృత్య శిక్షకులకు సన్మానాలు చేయడం జరిగింది. 
















 

                                        My newly published book "టీ టైమ్ కథలు"