Monday, May 25, 2026

                                                     నసనకోట ముత్యాలమ్మ గుడి 





ఎప్పుడో పదేళ్ల క్రితం నసనకోట ముత్యాలమ్మ గుడికి వెళ్లాను. ఎవరితో వెళ్లానో కూడా గుర్తుకులేదు. మళ్లా ఈరోజు మిత్రులతో కలిసివెళ్లాను. ఉదయం ఏడింటికి కారులో బయలుదేరాము. నసనకోటకు తొమ్మిదింటికల్లా చేరిపోయాము. పూజారి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే వేపమండలు కోసుకుని వస్తాను అని చెప్పారు. అక్కడ వేచి ఉండడం ఎందుకని దగ్గరలోనే ఉన్న తిరుమల దేవర గుడికి వెళ్లాము. గుట్ట మీద ఉంది తిరుమల దేవర గుడి. ఆహ్లాదకరమైన వాతావరణం పరుచుకుని ఉంది. లోపల ఉన్న తిరుమల దేవరని చూసుకుని తిరిగి నసనకోటకు చేరుకున్నాము. పూజారి వేప మండలు తీసుకుని బైక్ లో వచ్చేసాడు. వేప మండలకు, గ్రామ దేవతలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. చాలా మంది గ్రామ దేవతలు రోగాధిష్టాన దేవతలు. వారికి ఆగ్రహం కలిగిస్తే రోగాలు వస్తాయని, శాంతింపజేస్తే రోగాలు ఉపశమిస్తాయని ప్రజల నమ్మకం. ఒకప్పుడు గ్రామ దేవతల గుళ్లల్లో బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉండేవారు. ఇప్పుడు వారి స్థానంలో చాలా చోట్ల బ్రాహ్మణులే పూజారులుగా పూజాదికాలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ముత్యాలమ్మ, పెద్దమ్మ, సుంకులమ్మ, చౌడేశ్వరి, గౌడు సంద్రమ్మ, మారెమ్మ, కొల్లాపురమ్మ గ్రామ దేవతలు కనిపిస్తారు. ప్రతి గ్రామాన్ని ఒక గ్రామ దేవత రక్షిస్తూ ఉంటుందని చెపుతారు. వీరు జాతరలప్పుడు భక్తుల ఒంటి మీదకు వస్తారు. దీనినే పూనకం అంటారు. ఆ భావాతీత స్థితిలో దేవత ఆవాహన అయిన వ్యక్తి ఎన్నో జరగబోయే విషయాలు చెపుతాడు. గ్రామ దేవతల గుళ్లల్లో బలులు ఇస్తారు. మగ జంతువునే బలి ఇస్తారు. గ్రామ దేవత సోదరుడైన పోతురాజు విగ్రహం ప్రతి గ్రామ దేవత గుడిలో ఉంటుంది. 

నసనకోట గుడిలో ముత్యాలమ్మ పుట్టలో వెలసిన స్వయంభువు. గర్భ గుడి వెనుక గోడకు ఉన్న మూడు రంధ్రాలనుంచీ చూస్తే పుట్ట కనిపిస్తుంది.  పూజారి ముత్యాలమ్మను 'అమ్మయ్య' అని పిలవడం ముచ్చటగా అనిపించింది. మంగళ, శుక్ర మరియు ఆదివారాలలో చాలా జీవాలను బలి ఇస్తారు. ఆలయ పరిసరాలలో రక్తం చారికలు కనిపించాయి. బలిచ్చిన జీవాల కాళ్లను గుడి బయట వేలాడదీసారు. పూజారికి వారసత్వంగా పూజార్హత వచ్చింది. ఆలయ విశిష్టత గురించి చక్కగా వివరించాడు. ఇలా చెప్పుకొచ్చాడు. "అమ్మయ్య కలియుగ నిర్మాణం జరిగేటప్పుడే వెలసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించింది. తరువాత సృష్టి కొనసాగడం కోసం విష్ణువును తనతో సంభోగించమని అడిగింది. దానికి విష్ణువు తిరస్కరిస్తే, అమ్మవారు మూడో కంటి మంటతో విష్ణువును బూడిద చేసింది. శివుడికి కూడా అదే పరిస్థితి వచ్చి పడింది. బ్రహ్మ మాత్రం నీకున్న మూడో కన్ను నాకిస్తే, నీ  మాట నెరవేరుస్తాను అన్నాడు. తీరా ఆమె మూడో కన్ను ఇచ్చిన తరువాత ఆ నలువ ఒక తులువ పని చేసాడు. అదేమిటంటే అమ్మయ్య ప్రసాదించిన మూడో కంటి మంటతో ఆమెనే కాల్చేశాడు. కానీ ఇక్కడ శివుడి బదులు బ్రహ్మ అని పూజారి చెప్పాడేమో అని నా అనుమానం. 

తరువాత కలియుగ నిర్మాణం మొదటిలోనే అమ్మయ్య పుట్టలో వెలసింది. ఇక్కడ కూడా అన్ని గ్రామ దేవతలకు ఉన్నట్టుగానే ముత్యాలమ్మకు మీసాలు ఉన్నాయి. దీని అంతరార్థం ఏమిటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. పూజారి చెప్పిన కథ వలన నాకు అర్థం అయ్యింది ఏమంటే మాతృస్వామ్య వ్యవస్థ నుంచి సమాజం పితృ స్వామ్య వ్యవస్థ కు మారినప్పుడు స్త్రీ దేవతల స్థానాన్ని త్రిమూర్తులు తీసుకుని ఉంటారు. ఈ విషయాన్ని బొల్లోజు బాబా గారి ఏదో పుస్తకంలో నేను చదివినట్టు గుర్తు. 

నేను పూజారి అనుమతితో అమ్మయ్యని , గుడి పరిసరాలని వీడియో రూపంలో బంధించి ఇంస్టా లో పెట్టేసాను. స్థానిక సంస్కృతులను పరిరక్షించాలనుకుంటే గ్రామ దేవతల చరిత్ర ప్రతి ఒకరు తెలుసుకోవాలి. జీవితంలో విజయం సాధించాలి అంటే శక్తి, భక్తి, యుక్తి మూడూ కావాలి. ఈ మూడు అంశాలు గ్రామ దేవతారాధనలో పెనవేసుకుని ఉంటాయని నా అభిప్రాయం. 

No comments:

Post a Comment

Report on the Resource Person Visit to Jeevan Jyothi E.M. High School, Dharmavaram     Date: 24 September 2026 Programme: Motivational ...