Sunday, March 10, 2024






















 నేను చిన్నప్పుడు కలలు కనిన స్కూల్ తలుపులు నాకు ఇప్పుడు తెరుచుకున్నాయి. కొన్ని దశాబ్దాల చరిత గల కొడిగినహళ్లి స్కూల్ ను ఒక ముఖ్య అతిథిగా సందర్శించే అవకాశం నాకు మార్చి 9, 2024 న కలిగింది. ప్రిన్సిపల్ మురళీధర్ బాబు గారి ఆహ్వానం మేరకు నేను హిందూపూర్ బయలుదేరి వెళ్ళాను. ఈ రోజు రెండవ శనివారం కావడం నాకు మా బాగా కలిసివచ్చింది. ఉదయాన్నే బయలుదేరి, పదింటి కల్లా నేను హిందూపూర్ చేరుకున్నాను. మిత్రుడు, బంధువు అయిన జ్వాలాపురం శ్రీహరిని కలిసి హిందూపూర్ లోని షిర్డీ సాయి గుడికి వెళ్ళాను. అక్కడ పిన్నయ్య రంగ స్వామి గారితో సంభాషించి, బాబా ఎదురుగా విష్ణు సహస్రనామ పారాయణం చేసి, కొన్ని గ్రంథ రాజములను పిన్నయ్య నుంచి పుస్తక ప్రసాదంగా గ్రహించి శ్రీహరి ఇంటికి బయలుదేరాను. రాజ భవనం లాగా ఉంది ఇల్లు. నాకు శ్రీ హరి ఇంట్లో పెంపుడు కుక్క పేరు తెగ నచ్చేసింది. దాని పేరు 'గుట్టు'. ఎందుకు ఆ పేరు పెట్టారో మరి! గుట్టుగా నా పిక్క పట్టి పీకి, ఓ బైట్ తీసుకుంటే ఎలా స్వామి అనిపించింది. కానీ గుట్టు గాడు పరమ సాత్వికుడి మల్లే ఉన్నాడు. నన్ను చూసి కిక్కురుమని కాదు కదా భౌ మని కూడా అనలేదు. అది భౌ అనకపోవడంతో నేనే వావ్ అనుకున్నాను. గుట్టుకు అనుమానం రాకుండా, గుట్టు చప్పుడు కాకుండా నన్ను లిఫ్ట్ లో పైకి పిలుచుకువెళ్ళాడు శ్రీ హరి. చాలా సేపు సరదాగా ముచ్చటించుకున్నాము. సాధారణంగా చరవాణిలో మాట్లాడుకునే మేము ముఖాముఖి గా చాలా కాలం తరువాత కలుసుకున్నాము. నీషే మొదలుకుని వర్మ వరకు అందరి గురించి మాట్లాడుకున్నాము. ఇంతలో శ్రీ హరి ధర్మపత్ని మాకు భోజనం సిద్దం చేసింది. వండిన వంటకాలు నన్ను స్వర్గానికి ఒక బెత్తెడు దిగువలో వదిలేసాయి. నేను ఫుడ్డీ కాదు.. కాదు అంటూనే, ఆదరువులతో పాటు అన్నీ కూడా ఆబగా తినేశాను. తరువాత భుక్తాయాసం తీర్చుకుని, సాయంత్రం 3.15 కు సేవా మందిరం లోని కొడిగినహళ్లి గా పేరొందిన స్కూల్ కు చేరిపోయాను. 

ఈ స్కూల్ ప్రాంగణం లోకి ప్రవేశించిన వెంటనే నన్ను  ఏదో తెలియని ఉద్వేగం  చుట్టేసింది. మిలిటరీ భవంతుల లాగా కొన్ని బ్లాక్స్ కు ఎర్రని రంగు వేశారు. ప్రాంగణం నిండా చెట్లే. నేను కారు దిగుతూనే పిల్లలు నా చుట్టూ మూగారు. మీరు old student కదా సర్ అన్నాడు ఒకడు. వాడి ప్రశ్నకు నాకు తెగ సంబరం వేసింది. అంతలో నాగ మోహన్ సర్ వచ్చి నన్ను స్కూల్ లో ఉన్న ఫోటో ఘాట్ పాయింట్స్ వద్దకు పిలుచుకు వెళ్లారు. ప్రిన్సిపల్ బ్లాక్ దగ్గర ఉన్న మర్రి చెట్టు నన్ను తన్మయుణ్ణి చేసింది. ఎంత మందికి విద్యార్థులకు ఇది నీడను పంచిందో కదా అనుకుంటూ దాని కింద ఉన్న తిన్నె మీద కూచుని కాసేపు సేద తీరాను. నేను ఇలాంటి స్కూల్స్ లో చదువుకుని ఉంటే, గొప్ప వాణ్ణి అయ్యే వాడినేమో. పిల్లల డార్మెన్టరీ లకు తీసుకువెళ్లారు నాగమోహన్ గారు. ఈ పిల్లలకు అక్షర జ్ఞానం తో పాటు సంస్కారాన్ని కూడా బాగా నేర్పించారు గురువులు. మళ్ళీ నన్ను చుట్టేసిందో పిల్ల సమూహం. చాలా మంది పిల్లలు farewell ఏర్పాట్లు చేస్తూ కనిపించారు. గ్రంథాలయం చాలా బాగుంది. ఈ స్కూల్ కు పూర్వ విద్యార్థుల అండ దండలు అపూర్వంగా ఉన్నాయి. ఎప్పుడూ కూడా తమ పూర్వ విద్యాలయానికి ఏదో చేయాలనే తపన ఈ పూర్వ విద్యార్థులలో కనిపిస్తుంది. ఈ స్కూల్ లో చదువుకున్నవారు IAS, IPS, Scientists లు గా ఉన్నారు ఇప్పుడు. చాలా మంది విదేశాలలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. 

నేను ఇలా ప్రాంగణం అంతా కలియతిరుగుతుంటే, ప్రిన్సిపల్ మురళీధర్ గారు వచ్చి నాతో సరస్వతి అమ్మ వారికి మాలా కైంకర్యం చేయించారు. ఇంకో సరస్వతి మందిరం కూడా ఉంది. అసలు ఇక్కడ టీచర్లను చూస్తూ ఉంటే, సరస్వతి సజీవంగా సంచరిస్తున్నట్టు ఉంది. ముఖే ముఖే సరస్వతి అన్న నానుడి వీరికి చక్కగా అతుకుతుంది. కాసేపు ప్రిన్సిపల్ గదిలో సేద తీరిన తరువాత, నన్ను మరియు ఇతర అతిథులను మేళ తాళాలతో ఆడిటోరియం కు పిల్లలు పిలుచుకువెళ్లారు. అక్కడ OM జరుగుతుంది ఇప్పుడు. అంటే ఏమిటో అనుకున్నాను. అక్కడ పిల్లలు ఓం ఆకారం లో ఉప్పు మరియు రంగులు కలిపి ముగ్గు వేశారు. దానిని ఇప్పుడు ప్రమిదలతో వెలుగులీనేలా చేస్తారనమాట. నేను కూడా ఒక ప్రమిద వెలిగించాను. విద్యార్థులు అందరూ ప్రమిదలు వెలిగించి వచ్చి గురు పాద పూజ చేశారు. వంద మంది విద్యార్థులు ఏక కాలంలో పాదాల మీద పడి, నేను వారికి అక్షితలు వేస్తూ ఉంటే, గురువు ఉద్యోగం వచ్చినందుకు మొదటి సారి గర్వంగా జబ్బలు చరుచుకున్నాను. ఈ సన్నివేశం జరుగుతున్నంత సేపు నేపథ్యం లో విష్ణు సహస్ర నామం వినపడేలా ఏర్పాట్లు చేశారు. 

అక్కడ నుంచి fare well జరిగే చోటికి వెళ్ళాము. దీనికి విజయోత్సవ్ అని పేరు పెట్టారు. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. తరువాత మా ఉపన్యాసాలు. నాకు తోచిన నాలుగు మాటలు ఆ సరస్వతీ స్వరూపాలతో పంచుకుని, వారి సన్మానాలను అందుకుని, అనుభూతులను గంపకెత్తుకుని తిరగు ప్రయాణం అయ్యాను. 

ఇంటికి చేరే సరికి రాత్రి పది  గంటలు అయ్యింది. యా దేవీ సర్వ భూతేషు నిద్రా రూపేణ సంస్థితా అన్నట్టు నన్ను నిద్ర తన ఒడి లోకి తీసుకుంది. అలా ఈ రోజు అంతా మహత్తరంగా జరిగిపోయింది. 

4 comments:

  1. చాలా బావుందండీ...👌👏🌷🙏

    ReplyDelete
  2. You drop home like a star again. Tha darkest of the nights have powerful forces called stars. Stars are always welcomed.

    ReplyDelete

                                        My newly published book "టీ టైమ్ కథలు"