ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అనంతపురంతో నా అనుబంధం అంతా ఇంతా కాదు. 1988 లో నేను ఈ కళాశాలలో B.Sc BZC లో స్టూడెంట్ గా చేరాను. అప్పట్లో ఆ గ్రూప్ ను F1 అనేవారు. చాలా కాలం అలానే పిలవబడింది ఆ గ్రూప్. 1991 లో అత్తెసరు మార్కులతో డిగ్రీ పుచ్చుకున్నాను. అప్పట్లో ఈ కళాశాల శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. బహుశా అందరికంటే తక్కువ మార్కులు వచ్చింది నాకే కావొచ్చు. జువాలజీ లో మరీ కనిష్టమైన మార్కులు వచ్చాయి. అలాంటి నేను ఈ కళాశాల లోనే జంతుశాస్త్ర అధ్యాపకుడిగా, అందునా విభాగాధిపతి గా పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు. చివరకు నాకు జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చినప్పుడు కూడా నాకు డిగ్రీ అధ్యాపకుడిగా పదోన్నతి వస్తుందని గానీ, నేను తదనంతరం ఈ కళాశాలకు వస్తానని కానీ ఊహించలేదు. దైవికమో, కాకతాళీయమో మరి అలా జరిగిపోయింది అంతే. నా జీవిత నౌక వృత్తి రీత్యా 2013 లో ఆర్ట్స్ కాలేజీ లో లంగరేసింది. ఈ కళాశాల ప్రాంగణంలో స్టూడెంట్ గా గానీ లేదా అధ్యాపకుడిగా గానీ తిరిగితే ఆ పొగరే వేరు. అలా ఏ ముహూర్తం లో ఈ చదువుల చెట్టు మీద వాలిపోయానో మరి మొదటి ఇన్నింగ్స్ లో సుమారు 8 వసంతాలు అధ్యాపకుడిగా ఉద్యోగం వెలగబెట్టేసాను. తరువాత 2021 లో కల్యాణదుర్గం బదిలీ కావడం, తిరిగి గోడకు కొట్టిన బంతిలా 2023 లో ఆర్ట్స్ కళాశాలకు బదిలీ కావడంతో, ఈ కళాశాలలో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యింది. కొన్ని వేల మంది విద్యార్థులను చూసి ఉంటాను. నేను వారికి నేర్పించిన దాని కంటే, వారి వద్ధ నేను నేర్చుకున్నదే ఎక్కువ. వారిలో అల్లరి ఎంత ఉందో సృజనాత్మకత అంతే ఉండడం చూశాను. చాలా మంది ఉన్నత విద్యలు అభ్యసించి, ఉద్యోగాలు సంపాదించేశారు.
ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ కళాశాలలో class day functions, annual day celebrations, farewell, welcome parties training programmes ఇలా ఎన్నో చూసేశాను గానీ graduation day చూడలేకపోయాను అనే అసంతృప్తి వుండేది. కానీ ఆ కొరత కూడా తీరిపోయింది ఇప్పుడు. 12 మార్చి 2024 న graduation day అంగరంగ వైభవంగా జరిగింది మరి. పిల్లలంతా పట్టాలు పుచ్చుకోవడానికి convocation గౌనులు వేసుకుని కాలేజీకి వచ్చేశారు. శిక్షణా కార్యక్రమంలో ఉన్న మేము కూడా, వెసులుబాటు చూసుకుని, చేసుకుని వారితో ఫోటోస్ కు తెగ ఫోజులిచ్చేసాము. అవండీ బాబు ఈ ఫోటోల కథాకమామిషు.
No comments:
Post a Comment