తిరిగి చాలా కాలం అయ్యింది కదా అని ఉన్నట్టుండి నేను, నా అర్ధాంగి, శ్రీదేవి మేడం బాదామి, పట్టడకల్, ఐహోలె, బనశంకరి మరియు హంపీ చూసి వద్దామని ప్లాన్ వేశాము. మాకు పూల్ సింగ్ తోడయ్యాడు. ట్రిప్ రెండు రోజులు అనుకున్నాము. జులై 21 వ తేదీన ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరాలని నిర్ణయించుకుని డ్రైవర్ బాషాకు చెప్పేసాను. ముందు రోజే weather report చూశాను. మేము చూడబోయే ప్రదేశాలలో రాబోయే పది రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాను. తుఫాన్ వల్ల వర్ష సూచన ఉన్నప్పటికీ అది ప్రమాదకర స్థాయి లో లేదు అని తెలిసింది. కానీ ఎందుకన్నా మంచిదని కారులో గొడుగులు రెండు వేసుకున్నాము. కియా కారెన్స్ లో మా ప్రయాణం. జులై 21 వ తేదీ ఉదయం 5 గంటలకు శ్రీదేవి మేడం, పూల్ సింగ్ డ్రైవరు బాషా అపార్ట్మెంట్ వద్దకు వచ్చేశారు. ఇక నేను కూడా నా శ్రీమతి తో కలిసి కారు ఎక్కేసాను. హోస్పేట మార్గం లో హైవే లో ఉన్న నందగోకుల హోటల్ లో అందరూ ఇడ్లీ లాగించాము. బట్ట మీద ఉడికించిన ఇడ్లీ, దానికి ఆదరువుగా ఇచ్చిన సాంబార్ చాలా బాగున్నాయి. డీసెల్ కూడా పట్టించాను. ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తున్న అమౌంట్ నమోదు చేసుకోవడం మొదలెట్టాను. తరువాత రెండు గంటలు ప్రయాణించి బాదామీ చేరుకున్నాము. ఆ గుహాలయాలు చూసి మేమందరం మైమరిచి, మా వయసు మరచి వాటిని చూసాము. చాలా ఎత్తులో ఉన్నాయి ఈ ఆలయాలు. వయసు పైబడితే మీరు ఇలాంటివి చూడలేరు. అందుకే వయసు ఉన్నప్పుడే తిరిగేయండి. మీకు వీలైతేనే సుమా!!!!! బాధ్యతలు ఉంటే మాత్రం నా లాగా బలాదూర్ తిరగకండి. అలా అని ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే పూర్తిగా తిరగడం మానేయకండి. నాలుగు గుహాలయాలను చక్కగా ఫోటోస్ తీసుకుంటూ చూసేసాము. గైడ్ తో అవసరం రాలేదు. గుహాలయాల నుంచి చూస్తే క్రింద అగస్త్య లేక్ కనిపిస్తుంది. ఈ గుహాలయాలను చూడడం మోకాళ్ళకు మంచి వ్యాయామం.
ఇక అక్కడ నుంచి పట్టడకల్ కు వెళ్లాము. బాదామీ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము పోయే సరికి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ముందు జాగ్రత్తగా గొడుగులు పట్టుకెళ్ళాము కదా!!! తడవకుండా పట్టడకల్ చూసేసాము. వీటి శిల్ప కళాచాతుర్యం చూస్తే ఎవరికైనా అబ్బురమనిపిస్తుంది. అక్కడి నుంచి ఐహోలె చేరుకున్నాము. అక్కడ రావణ పడి, దుర్గా temple complex చూసుకుని బనశంకరి చేరుకున్నాము. ఇక్కడ అమ్మవారి దర్శనం అధ్బుతంగా జరిగింది. ఈ ప్రాంతాలలో కనడ మరియు మరాటి mixed culture కనిపిస్తుంది. గుడి బయట ఎవరో ఆమె బుట్టలో పెట్టుకుని సద్ద మరియు జొన్న రొట్టెలు మమ్మల్ని పిలిచి మరీ పెట్టింది. చివరలో డబ్బు తీసుకుందనుకోండి, అది వేరే విషయం. ఆమె రొట్టెలు వడ్డించేటప్పుడు ఆమె ఆప్యాయత చూస్తుంటే, గుడి లోపలి అమ్మవారు బయటకు వచ్చి వడ్డిస్తూ ఉన్నట్టుగా అనిపించింది. ఇదెక్కడి ఎమోషన్స్ రా అనుకోకండి. ఆ మాత్రం ఎమోషన్స్ లేకుంటే, ప్రయాణాలు చేయకండి.
చివరికి రాత్రి 9 గంటలకు TB dam లో వైకుంఠ గెస్ట్ హౌస్ కు చేరుకున్నాము. మా కెమిస్ట్రీ లెక్చరర్ భర్త అక్కడ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండడం తో మాకు రెండు గదులు కేటాయించారు. గదులు పెద్దగా, శుభ్రంగా ఉన్నాయి. మాకు చపాతీలు మరియు పన్నీర్ కర్రీ తెచ్చి ఇచ్చారు. తినేసాము. ఒక్కో రూములో మూడేసి మంచాలు. ఎప్పుడు పండుకున్నామో తెలియదు. ఒళ్లు తెలియని నిద్ర కమ్మేసింది. నేను లేచేసరికి ఉదయం 6 అయ్యింది.
ఆ ఉదయం ఫ్రెష్ అప్ అయిన తరువాత dam చూడడం ఒక మధురానుభూతి. తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. సముద్రం లాగా పరుచుకొని ఉంది. ఏ నదినైనా దగ్గరి నుంచి చూడడం ఒక దివ్యానుభవం. 'గంగా స్నానం, తుంగా పానం' అని మా తాత చెప్పడం నాకు ఇంకా గుర్తు. ప్రతి నదీ కూడా ఎన్నో నాగరికతలను చూసి ఉంటుంది. అసలు నది లేనిది నాగరికత ఎక్కడి నుంచి వస్తుంది? నదీ హృదయాన్ని, నారీ హృదయాన్ని అంచనా వేయలేము కదా!
తరువాత ఇక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉన్న హంపీ కి వెళ్లాము. హంపీని చాలా మంది పాడుపడ్డ కొంప తో పోలుస్తారు. కానీ ఈ శిథిల నగరపు హొయలు చూస్తే, ఎవరైనా ఇట్టే ఫిదా అయిపోతారు. నాకిది నాలుగో సారి హంపీ దర్శనం. ఈ సారి మాకు దొరికిన గైడ్ పేరు మహేంద్ర. తన ఆటో లో మమ్మల్ని హంపీ మొత్తం తిప్పి చూపాడు. హంపీ చరిత్ర మాకు చెప్పాలనే తాపత్రయం అణువణువునా నింపుకున్న యువకుడతడు. 'సర్ ! రేపు నా పెళ్లి!' అంటూనే మాకు హంపీని మొత్తం పరిచయం చేశాడు. ఉద్యోగం పట్ల passion అంటే అలా ఉండాలి. అసలు ఎవరికైనా హంపీ ని చూసిన తరువాత ఇంక ఏ ప్రదేశాన్ని, వ్యక్తినీ ప్రేమించ బుద్ది కాదు. శిథిలాలలో, శిశిరాలలో కూడా ఇంత సౌందర్యం ఉందనే విషయం హంపీని చూస్తేనే తెలుస్తుంది. మొదటగా ముష్కరుల దాడిలో చేయి విరిగిన యోగా నరసింహ స్వామి ని చూసాము. ఓడ్యాణ బంధం లో ఎంత రాజసం ఒలక బోస్తున్నాడో ఈ స్వామి ఇప్పటికీ. కళ్లు క్రోధం తో ఉబికి ఉన్నాయి. కాలానికి తలవంచి, ముష్కరులకు తన చేతిని అప్పగించిన ఔదార్యం ఆ మూర్తి లో కనిపించింది. ఒక video ఇంస్టా రీల్ కోసం అక్కడే తీసుకున్నాను. ఇక్కడ నరసింహ స్వామి విగ్రహం భిన్నం అయినందు వల్ల పూజాదికాలు లేవు. హంపీ నిండా ఎక్కువ భాగం మూర్తి లేని గుళ్లే.
దీని పక్కనే బడవి శివ లింగం. బడవి అంటే కన్నడ భాష లో పేద వనిత అని అర్థం. పేద మహిళ పూజించిన శివ లింగం కాబట్టి దీనిని బడవి శివ లింగం అంటారు. దాని చుట్టూ నీళ్లు ఉంటాయి. మేము దర్శించుకునే సమయానికి శివ లింగం మీద కొండ ముచ్చు కూచుని ఉంది. నాకైతే అది చూస్తే బిడ్డలను నెత్తి కెక్కిచుకున్న తండ్రి గుర్తుకువచ్చాడు. అన్నిటినీ, అందరినీ తలకెత్తు కోవడం మన శివయ్యకు అలవాటే కదా! వీరభద్ర స్వామి ని కూడా చూసాము. అంత అధ్బుతమైన వీరభద్రుడి విగ్రహం నేను ఎక్కడా చూడలేదు.
తరువాత అక్కడి నుంచి ఏనుగుల మహల్, మ్యూజియం దర్శించాము. రాణులు నివాసం ఉండే మహల్ చూసాము. మొదటిసారి దర్శిస్తూ ఉండడం వలన పూల్ సింగ్ మైమరచి చూస్తూ ఉన్నాడు. నాకైతే హంపీ లో రాణుల కంటే కూడా సానులే ఉజ్వలమైన జీవితాన్ని అనుభవించి ఉంటారని అనిపిస్తుంది. రాణులు పేరుకు దొరసానులే గానీ, సానుల ముందు వీరి వైభవం దిగదుడుపే. గజశాల majestic గా ఉంది. పహారాకు ఉపయోగించే టవర్ కూడా చూసాము.
ఇక మా పయనం హజారీ రామ స్వామి మందిరం వైపు సాగింది. రామాయణ కథనాన్ని వెయ్యి రీతుల తనలో కుడ్య శిల్పాలుగా ఇముడ్చుకున్న వన్నె చిన్నెలు దీనివి. అప్పటి శిల్పులు కళను తపస్సుగా భావించారు. ప్రతి శిల్పం లో ఓ ప్రత్యేక భంగిమ. అక్కడ రాముడి విగ్రహం లేకున్నా నేను రాముడికి సొంతమైన త్రిభంగి ముద్రలో స్వామిని ఊహించుకుని పరవశించాను.
హంపీ లో చూడదగ్గ మరొక ప్రదేశం నవ రాత్రి దిబ్బ. అక్కడ ఎంతో మంది నాట్య కత్తెలు దసరా ఉత్సవాలలో నృత్యం చేస్తూ ఉంటే, పండిత, పామరులు పరవశించి చూసేవారట. అది లౌల్యం గా ఈ తరానికి అనిపించవచ్చు గానీ, నా దృష్టి లో ఇది ఒక కళా పిపాస. అప్పట్లో అగణికంగా ఉన్న గణికలు అందరూ అక్కడ నాట్యం చేస్తున్నట్టు, వారికి నేను నృత్యం నేర్పుతున్నట్టు ఊహించుకున్నాను. ఆ గణికల మువ్వల సవ్వళ్లు నా మదిలో ఘల్లుమని మోగాయి. వీరి లేపనాల కోసమే ఒక బజారు వెలిసింది అప్పటి హంపీలో. ఈ దసరా దిబ్బ దగ్గరే ఒక కోనేరు. ఈ కోనేటి మెట్ల వైభవం చూస్తే ఎంతో ముచ్చట వేసింది. అసలు ఏమీ ఆశించకుండా, ప్రతి పనిని ఇంత కళాత్మకంగా అప్పటి వారు ఎలా చేశారు? వీళ్లందరూ కేవలం ఆత్మ సంతృప్తి కోసం పనిచేసి ఉంటారు. ఈ శిలా హృదయాలలో ఆ శిల్పుల ఆత్మలు ఇప్పటికీ కదులుతూనే ఉన్నట్టు నాకు అనిపించింది.
ఇప్పుడు మా పయనం నవ బృందావన వైపు సాగింది. మధ్యలో విఠల స్వామి దేవాలయాన్ని బ్యాటరీ వాహనం లో వెళ్లి చూసి వచ్చాము. అక్కడ ఏక శిలా రథం ఉంది. దానిలో ఒకప్పుడు పండరంగడి ఆరాధనోత్సవాలు జరిగేవట. పండరీ పురం లో ఇప్పుడు ఉన్న పాండురంగడి విగ్రహం అసలు హంపీ లోదేనని మా గైడ్ చెప్పడం ఒక అతిశయోక్తి అనిపించింది. ఇక్కడనే అందరం నిమ్మ సోడాలు పట్టించాము. నేనైతే ఏకంగా రెండేసి బుడ్లు లాగించాను. ద్రవాలు తీసుకుంటే శరీరానికి ఏ ఉపద్రవాలు రావని నా నమ్మకం.
నవ బృందావనం చూడాలి అంటే తుంగభద్ర ను మోటార్ బోట్ లో దాటుకువెళ్లాలి. అక్కడకు వెళ్లేటప్పుడు ఒక నెమలి తన క్రేంకారాన్ని షడ్జమం లో వినిపించింది మాకు. అది శుభ సూచకంగా భావిస్తూ నవ బృందావన చేరుకున్నాము. అక్కడ విష్ణుసహస్ర నామ పారాయణ చేస్తూ అందరూ ప్రదక్షిణలు చేశాము . ఆ రోజు వ్యాస రాయల జన్మ నక్షత్రం అట.
ఇక్కడ నుంచి కడలే కాళు గణేశ వద్దకు వెళ్లాము. చివరగా విరూపాక్ష ఆలయం వద్ద మమ్మల్ని వదిలేసి మా గైడ్ మహేంద్ర సెలవు పుచ్చుకున్నాడు. అతనికి రూపాయలు 1500/- రుసుము చెల్లించాము. తరువాత గుడి లోపలికి వెళ్లి విరూపాక్షుడి దర్శనం, భువనేశ్వరి మరియు పంపా దేవి దర్శనం చేసుకుని బయటకు వచ్చే సమయానికి, మా డ్రైవరు బాషా మా కియా కారెన్స్ ను తీసుకుని మా కోసం వేచి ఉండడం కనిపించింది.
అనంతపురం తిరుగు ప్రయాణానికి కారు ఎక్కి కూచున్న మాకందరికీ అప్పుడు ఒక్కసారిగా ఆకలి గుర్తుకు వచ్చింది. హోటళ్లు మూసి ఉండడం వలన కమలాపురం దాటిన తరువాత ఏదో ఓ చిన్న బంకులో పచ్చి మిరపకాయలు దట్టించిన బొరుగులు, బజ్జీలు తిని ఉపశమనం పొందాము. తరువాత మేము బళ్ళారి లో తిన్న దావణగరే బెణ్ణే దోసె అదుర్స్. ఉరవకొండ కు దగ్గరగా ఉన్న చేళ్ళదుర్తి లో ఎర్రి తాత సమాధిని చూసుకుని రాత్రి ఎనిమిది గంటలకు మా ఇళ్లు చేరుకున్నాము.
మా టూర్ ఇంత విజయవంతం కావడానికి కారణాలు
1. ఒకే విధమైన మనస్తత్వం ఉన్నవారు కలిసి ప్రయాణించడం
2. అందరికీ చరిత్ర మీద మక్కువ, గౌరవం ఉండడం
3. అందరికీ అనుష్టానం అంటే ఇష్టం ఉండడం
4. ముందస్తు సన్నాహాలు శాస్త్రీయంగా చేసుకోవడం
5. మితాహారం, హితాహారం తీసుకోవడం
6. ఎవరికీ ఉద్యోగ జీవితంలో ఎటువంటి హడావుడీ లేకపోవడం.
నేను అందరికీ ఇచ్చే సలహా ఏమంటే
1. శరీరం సహకరించినప్పుడే, బాగా తిరగండి .
2. డబ్బును ఆదా చేయడం కోసం మీ యాత్రా కుతూహలాన్ని చంపుకోకండి
3. అధికారులతో, పని ఒత్తిడి ఉన్న వారితో కలిసి ప్రయాణించకండి. మధ్యలోనే తిరిగి రావలసి రావొచ్చు.
4. చిరాకు పడే వారి తో కలిసి ప్రయాణం నిషిద్దం సుమా!!
5. తనికెళ్ళ భరణి గారి మాటలతో ముగిస్తాను. మళ్లా ఈ తోవరాము, మళ్ళొచ్చినా మనుషులం కాము. కాబట్టి సత్తువ ఉండగానే, వీలైనన్ని ప్రదేశాలు చూసేయండి.
మరో ట్రావెలాగ్ తో మళ్ళీ కలుద్దాం.