Tuesday, July 16, 2024

                                                         GLOBAL SNAKES DAY 

పాము అంటే పది ఆమడలు పరిగెత్తే నేను ఈ రోజు మా కళాశాల లో మరియు ఒక ప్రఖ్యాతమైన స్కూల్ లో  Global Snakes Day ను SARISHA WILDLIFE AND ECOLOGY SOCIETY వారి సహకారంతో నిర్వహించాను. దీనిలో మా అధ్యాపకులు డాక్టర్ బసిరెడ్డి శ్రీదేవి, అహ్మద్ మరియు Science coordinator ఆనంద భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా విద్యార్థులకు మరియు స్కూల్ బుడతలకు పాముల పట్ల అవగాహన కల్పించాము. పాము అంటే భయపడవలసిన పనిలేదని, వాటిని విచక్షణా రహితంగా చంపకూడదని చెప్పాము. మేము బోధించిన అంశాలు ఈ క్రింద ఇస్తున్నాను. 

పాములు విజయవంతమైన సరీసృపాలు. 

పర్శుకలు మరియు పర్శుకాంతర కండరాలను ఉపయోగించి చలిస్తాయి 

పాములు పాలు తాగవు. దీనికి కారణం వాటిలో రెనిన్ అనే ఎంజైమ్ లేకపోవడమే. 

నాగ పంచమి మరియు నాగుల చవితి పండుగల ఆంతర్యం పాములను సంరక్షించడమే. 

పాములు గాలిలో వచ్చే ఏ శబ్ధ తరంగాలను వినలేవు. కానీ అవి భూమి ద్వారా శబ్ద తరంగాలను      గ్రహిస్తాయి. కాబట్టి పాముల దగ్గరికి వెళ్లి, 'నాగ స్వరం ఊదేస్తా, నాలో నిను కలిపేస్తా' అని పాడితే  వాటికి తిక్క రేగి మనల్ని కాటేస్తాయి. మన దేశంలో విషయుక్త మరియు విషయ రహిత      సర్పాల నిష్పత్తి 1:10. మనకు ఎక్కువగా కనపడే విషయుక్త సర్పాలు నాగుపాములు, కట్ల      పాములు,  పొడ పాములు, సముద్ర సర్పాలు మరియు ప్రవాళ సర్పాలు. 

వీటిలో నాగుపాములు అంటే అందరికీ ఆరాధనా, భయమూ రెండూనూ. పాముకు కాళ్లు లేవు కాబట్టి మీరు వాటిని కాళ్లతో  తొక్కితే, వాటికి చిర్రెత్తి తోక తొక్కిన తాచులవుతాయి. నా చిన్నప్పుడు వీటి గురించి ఎన్ని సినిమాలని బాబూ నేను చూసింది. పాముల మీద ఎంత సాహిత్యం ఉందో  తెలుసా మీకంతా !!!!. మన దేవుళ్ళకి ఈ పాములు పడకలయ్యాయి కదా!!!! ఇక విష రహిత సర్పాల విషయానికి వస్తే జర్రి పోతులు, అనకొండలు, కొండ చిలువలు, పసరిక పాములు , ఇలా చాలా వైవిధ్యమే కనపడుతుంది. 

కొండచిలువల గురించి చిలువలు, పలువలుగా చెప్పుకునేవారు నా చిన్నప్పుడు.అనకొండ ను  చూస్తే 'అబ్బో' 'అనకుండా' ఉండలేమండి బాబు. కొండచిలువలని constrictor snakes అంటారు. ఇక విష యుక్త మరియు విష రహిత సర్పాలను ఎలా గుర్తించవచ్చో కూడా చెప్పాము. తోక, తల, పొలుసులు, హను ఫలకాలు, లోరియల్ గర్త ఇలాంటి లక్షణాల ద్వారా ఎలా విష యుక్త సర్పాలను గుర్తించవచ్చో చెప్పాము. విషాలలో రకాలు కూడా చెప్పాము. పాముకు విషం కోరలలో ఉంటే 'ఖలునకు నిలువెల్ల విషము, కదరా సుమతీ!' అని సన్నాయి నొక్కులు నొక్కాము. 

యాంటీ వీనం ఎలా తయారుచేస్తారో వివరించాము. 

పాము విషానికి, పూడు పాములకు ఎంత డిమాండ్ ఉందో చెపుతుంటే, పిల్లలు 'వీడి పాఠం వినేకంటే పోయి పాములు పట్టుకోవడం మేలు అన్నట్టుగా చూసారండీ. తరువాత క్విజ్ నిర్వహించి పిల్లలకు వెయ్యి రూపాయల విలువ చేసే బహుమతులు ఇచ్చాము. పవర్ పాయింట్ స్లయిడ్స్ పిల్లలను బాగా ఆకట్టుకున్నాయి. పాముల మీద ఇంత తతంగం జరగడానికి కారణం భరత్ అనే నా స్టూడెంట్ చూపిన చొరవ. అదే విధంగా ఇది ఇంత విజయవంతం కావడానికి సహకరించిన శ్రీదేవి మేడం గారికి, మిత్రులు అహ్మద్, ఆనంద భాస్కర్ లకి, విద్యార్థులు మహేష్, కుళ్లాయ స్వామి, శ్రీనివాస్, మరో భరత్ మరియు గణేష్ లకు ధన్యవాదాలు. 





























No comments:

Post a Comment

                                        My newly published book "టీ టైమ్ కథలు"