Thursday, May 15, 2025

              


జీవన భృతి కోసం జంతుశాస్త్ర అధ్యాపకుడిగా ఉద్యోగం వెలగబెడుతున్నాను కానీ, నాకు సైన్స్ కన్నా చరిత్ర అంటే తగని మక్కువ. ఇప్పుడు నేను సమీక్షించబోయే పుస్తకం లో ప్రస్తావించినట్టు నాకు చరిత్ర జబ్బు చాలా కాలం క్రితమే పట్టుకుంది. దీనికి కారణం నేను సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం కావడమే. గ్రూప్ - I పరీక్షలకు సన్నద్ధం కావడం వలన కూడా  నాకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర పట్ల ఆసక్తి మితిమీరింది. కానీ నాకున్న వైదికపు పోకడల వలన నేను చూసిన చారిత్రక ప్రదేశాలన్నిటిని దర్శించిన సమయంలో నాకు భక్తి భావన అంబికా దర్బార్ బత్తి లాగా తగులుకునేది. అలా అని ఇప్పుడు మారిపోయాను అని కాదు గానీ, వాస్తవాలు గుర్తించే తెంపరితనం మాత్రం అబ్బింది. ఇలా వరం లాగా నాకు సంక్రమించిన చరిత్ర జ్వరం తో నేను ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో పేటా శ్రీ మరియు బొల్లోజు బాబా లాంటి వారి రచనలు నాకు చరిత్ర పట్ల ఆసక్తిని పెంచాయి. ఈ చరిత్ర యావలో తగులుకున్న నేను ఒకప్పటి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చాలా గుళ్లు, గోపురాలు, చారిత్రక ప్రదేశాలన్నిటినీ ఒక దిమ్మరి లాగా చుట్టబెట్టేసాను. నా చరిత్ర మక్కువను పెంచే ఒక సంఘటన ఇటీవల జరిగింది. అదేమంటే అనంత కథల వాట్సప్ సముదాయం లో అడవాల శేషగిరి రాయుడు రచించిన "కంబగిరి నుంచి శేషగిరి దాకా - ఓ చారిత్రక ప్రయాణం" అనే పుస్తకం ప్రకటన మరియు దాని ప్రాప్తి స్థానం షేర్ చేయబడింది. పుస్తకం చదవకుండానే నన్ను ఆకర్షించిన అంశం ఆ పుస్తకం కవర్ పేజీ. రచయిత ఒక లింగాకారం లో ఉన్న ఒక రాతి నిర్మాణం పక్కన నిలబడ్డ ఫోటో ఆ కవర్ పేజీ లో ముద్రితమై ఉంది. ఇక ఆసక్తి తట్టుకోలేక ఆ వాట్సప్ సముదాయం లో ఇచ్చిన లంకె లోకి వెళ్లి పుస్తకం ఆర్డర్ పెట్టేసాను. ఇదిగో ఈ రోజు కొరియర్ లో ఆ పుస్తకం మా ఇంట్లోకి వచ్చేసింది. కళాశాల లో పరీక్షల విభాగంలో ఊపిరి సలపనంత పనిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నాకు, ఇంటికి వచ్చిన తరువాత ఆ పుస్తకం నా రీడింగ్ టేబుల్ మీద కనిపించడంతో, హడావుడిగా రిఫ్రెష్ అయిపోయి ఎప్పటిలాగే కాఫీ తాగుతూ చదవడం మొదలెట్టాను.  

ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టిన వెంటనే అదో రకపు మత్తు నన్ను ఆవరించేసిందని చెప్పొచ్చు . దీనిలో ప్రస్తావించిన చాలా ప్రదేశాలను నేను చూసి ఉండడంతో బాగా కనెక్ట్ అయిపోయాను. మరో విషయం పుస్తక రచయిత 'అశేరా'ను  నేను చాలా సార్లు అనంతపురంలో చూసానని నాకు పుస్తకం చదువుతుంటే తెలిసింది.  ఆయనను నేను అనేక సార్లు చూసినా కూడా ఆయనే అశేరా అని నాకు తెలియదు. గమ్మత్తేమిటంటే రచయిత ఉన్న వీధిలోనే మేము అద్దెకు ఉండేవాళ్లం. రచయిత గారి 'సంగీత వాణి' ని కూడా నేనెరుగుదును. సంగీతం లో ఆయన నైపుణ్యం నా చెవిన పడింది గానీ, చరిత్ర లో ఆయనకు ఇంత ప్రవేశం ఉందని ఇప్పుడే తెలిసివచ్చింది. మరో విషయం రచయిత ప్రస్తావించిన కల్లూరు సుబ్బరావు పురావస్తు ప్రదర్శన శాలకు ఇటీవలనే మా ఆర్ట్స్ కళాశాల సహ అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ పిలుచుకువెళ్లాడు. ఆ మ్యూజియం నన్ను గతంలోకి అమాంతంగా విసిరేసింది. ఇదిగో ఇప్పుడు మళ్లీ ఈ పుస్తకం చదువుతుంటే, ఆ మ్యూజియంతో అనుబంధం ఉన్న విజయ్ కుమార్ సర్ మరియు రజిత మేడం గురించి తెలిసింది. విజయకుమార్ గారి స్నేహం రచయిత చారిత్రక స్పృహను ఎలా పెంచిందో చదువుతుంటే, నాకూ విద్యార్థి దశలో అలాంటి గురువు దొరికి ఉంటే, ఈ జంతు శాస్త్రం వదిలేసి, ఏ చారిత్రక విభాత సంధ్యలలోనో  పరిఢవిల్లిన  నాగరికతా వికాసాల గురించి అధ్యయనం చేస్తూ ఉండిపోయేవాడినేమో కదా!!!!

ఈ పుస్తకం చదువుతూ ఉంటే చరిత్ర బాగా ఔపాసన పట్టిన మిత్రుడిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండడం ఒక చారిత్రక అవసరం అని తెలిసి వచ్చింది.  మనది చింపేస్తే చిరిగి పోయే చరిత్ర కాదని కూడా అర్థం అయ్యింది. ఈ పుస్తకం లో ప్రస్తావించిన కర్నూల్ జిల్లా లోని జలదుర్గం ప్రాంతానికి దగ్గరగా ఉన్న కంబగిరి నరసింహ స్వామి గుడిని నేను చాలా కాలం క్రితమే నెహ్రూ యువ కేంద్ర అధికారులు శివ కుమార్ మరియు శ్రీనివాసులు తో వెళ్లి సందర్శించాను. ఉడుము రూపంలో ఉన్న నరసింహ స్వామిని చూడడం నాకు అదే మొదటి సారి. కానీ నేను ఈ కంబగిరిని చూసేటప్పుడు భక్తి పారవశ్యం లో మునిగిపోవడం వలన స్వవశం తప్పాను. ఈ పుస్తకం ద్వారా నాకు తెలిసి వచ్చినదేమంటే చరిత్ర కారుడు భౌతికవాది గా ఉంటే మంచిది అని. అప్పుడే యదార్థ వాది కాగలడు. భౌతిక వాదిగా తనను తాను పేర్కొన్న అశేరా కంబగిరి లో నరసింహ స్వామి చెంచు లక్ష్మి ని గుహలో దాచిపెట్టిన సన్నివేశాన్ని వర్ణించిన తీరు నన్ను ఒక మైమరపుకు గురిచేసింది. స్థానిక బోయలతో ఆ గుడి చరిత్ర ముడి పడిఉందని కూడా ఇప్పుడే  తెలుసుకున్నాను. ఇక్కడ ఒక మేలి మలుపు ఏమంటే రచయితకు కంబగిరి లో దొరికిన రాగి నాణెం ఆయనను విజయ కుమార్ జావేద్ గారి వద్దకు తీసుకు వెళ్లడం. 

నేను చిన్నప్పటి నుంచి అనంతపురం జిల్లాలో చూస్తూ ఉన్న చాలా గుడుల మరియు కట్టడాల చారిత్రక నేపథ్యం నాకు ఈ పుస్తకం ద్వారా తెలిసింది. పదునాల్గవ శతాబ్ధం లో చిక్కన్న ఒడయార్ కట్టించిన అనంతపురం చెరువు పరిసర ప్రాంతాలకు నేను నా బాల్యం నుంచీ వెళుతూనే ఉన్నాను. అక్కడ ఉన్న కాశీ విశ్వనాథ స్వామి గుడికి కూడా చాలా సార్లు వెళ్లాను. అప్పట్లో నా కంటికి బుక్కరాయ సముద్రం చెరువు ఒక గంభీర సాగరం లాగా కనిపించేది. ఈ తాడిపత్రి బస్ స్టాండ్ వద్ద ఉన్న చెరువు కట్టని అప్పట్లో గణేష్ పార్క్ అని పిలిచేవారు. అప్పట్లో ఆ కట్ట మీద వినాయకుడి గుడి మరియు ఆంజనేయ స్వామి గుడి మాత్రమే ఉండేవి. నా బాల్యం లో మా అనంతపురం వాసులకు ఈ గణేష్ పార్క్ ఒక పెద్ద పిక్నిక్ స్పాట్. నాకు ఇప్పటికీ గుర్తు ఉన్న విషయం ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తాను. అదేమంటే చెరువు కట్ట మీద ఉన్న గుడిలో నరక లోక శిక్షల వర్ణనలతో కూడిన ఒక నలుపు, తెలుపు చిత్రం గోడకు వేలాడేసి ఉండేది. దానిని నేను చిన్నప్పుడు చాలా సేపు చూస్తూ నిలుచుని ఉండేవాడిని. నరకం ( ఉందో, లేదో తెలియక పోయినా కూడా ) నాకు ఎందుకో ఇప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నీషే లాగా నాకు కూడా చచ్చిన తరువాత స్వర్గానికంటే కూడా నరకానికే పోవాలని ఉంది. పాప భీతి ని తొలగించడానికి అప్పట్లో గుడులు ఎంతో సహకరించాయి. కాని అనేక పాపాలకు ఇప్పుడు అవే గుడులు నెలవులుగా మారడానికి  మానవ నైజంలో వచ్చిన సంక్లిష్టతనే కారణం అనిపిస్తుంది. 

గుడులు కట్టిన కాలాన్ని అంచనా వేయడంలో గుడిలో ఉన్న అనేక నిర్మాణాలు, విగ్రహ భంగిమలు, ద్వారపాలకుల విగ్రహాలు ఎలా ఉపయోగపడతాయో రచయిత చక్కగా వివరించారు. ఈ పుస్తకం చదువుతూ ఉంటే సర్ థామస్ మన్రో కార్యాలయ ప్రాంగణంగా ఒక వెలుగు వెలిగిన పాతూరు నెంబర్ 1 హై స్కూల్ మరియు జూనియర్ కాలేజీ ని నేను సందర్శించిన విషయం గుర్తుకు వచ్చింది. నగరం లో ఉన్న ఇలాంటి బ్రిటీష్ కట్టడాలకు పూర్వ వైభవం తీసుకు రావడం మన అందరి ఉమ్మడి బాధ్యత. అసలు ఈ పుస్తకం ప్రతి చరిత్ర విద్యార్థి చదవాలి. కంప్యూటరు మరియు కృత్రిమ మేధ తప్ప మిగిలినవి ఏవీ చదువులే కావు అనే భ్రమలో కొనసాగుతున్న ఈ తరం రాబోయే కొన్ని ఏళ్లలో ఎంత ఘనమైన చారిత్రక ఆనవాళ్లను కోల్పోతుందో కదా!!!! కళాశాలలో ఇప్పుడు చరిత్ర కోర్సు, ఏ ఇతర కోర్సులలో సీటు రాని వారికి శరణార్థి శిబిరంగా మాత్రమే ఉపయోగపడుతున్నది. ఈ దుస్థితి పోవాలి. చరిత్ర విద్యార్థులలో, అధ్యాపకులలో చారిత్రిక స్పృహ పెరగాలి. అలా పెరగాలి అంటే ఇలాంటి పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. అశేరా గారు విజయ కుమార్ గారితో చారిత్రక ప్రదేశాలకు తిరిగినట్టుగా విద్యార్థులను ప్రతి చరిత్ర అధ్యాపకుడు క్షేత్ర సందర్శనలకు తీసుకువెళ్లాలి. అసలు అనంతపురంలో ఉన్న ఒకప్పటి మన్రో కార్యాలయాన్ని ఎంత మంది డిగ్రీ స్థాయిలో చరిత్ర చదువుతున్న విద్యార్థులు, బోధిస్తున్న అధ్యాపకులు చూసి ఉంటారు???????? ఎందుకు మన స్థానిక చరిత్ర పట్ల ఇప్పటి తరాలకు ఇంత అవజ్ఞ!!!!!!! చరిత్రను విస్మరించి భవిష్యత్తును నిర్మించుకోవాలి అనుకోవడం నేల విడిచి సాము చేయడం లాంటిదే. ఈ పుస్తకంలో చెప్పినట్టుగా బ్రాహ్మీ లిపిని, ప్రాకృత భాషని డీకోడ్ చేసే విధానాన్ని చరిత్ర విద్యార్థులకు ప్రాక్టికల్స్ గా పెట్టాలి. అసలు చరిత్ర ను మనం చూసే కోణం మారాలి. 

రచయిత సంజీవపురం దగ్గర ఉన్న మెన్ హిర్స్ గా పిలవబడే నిలువు రాళ్ల సమాధులను గురించి చేసిన వివరణ గురించి చదువుతుంటే చరిత్రలో నా అజ్ఞానం బయటపడింది. నేనైతే వాటిని శివ స్వరూపాలుగా భావించేవాడినేమో!!!!!! అసలు శివాలెత్తి తిరుగుతున్న నాలాంటి వాడికి అన్ని రాళ్లు శివ లింగాలుగానే కనిపిస్తాయి. నేను కూడా బ్రహ్మ రాత నుంచి, మను గీత నుంచి బయట పడవలసిన అవసరం ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. కల్యాణదుర్గం వద్ద ఉన్న పాపం పేట లోని ఆది మానవుల సమాధులను  నేలమట్టం కానీవడం ఒక చారిత్రక తప్పిదం. ఇలాంటి ఆది మానవుల అవశేషాలే కళ్యాణ దుర్గం ముదిగల్లు వద్ద ఉన్నాయని విన్నాను. ఇప్పుడు అవి ఏ స్థితిలో ఉన్నాయో మరి!!!!

మరో విషయం ఇక్కడ ప్రస్తావించాలి. చారిత్రక ప్రదేశాలను డాక్యుమెంట్ చేసేటప్పుడు యూ ట్యూబర్లు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో కూడా ఈ పుస్తకం చదివిన తరువాత నాకు తెలిసివచ్చింది. చరిత్రను నమోదు చేసేటప్పుడు, వివరాలు ఎంత నిబద్దతగా సేకరించాలో కూడా అర్థం అయ్యింది. ఈ పుస్తకం చదువుతూ ఉంటే, నేను కూడా అరకొర చరిత్ర పరిజ్ఞానం తో చేసిన షార్ట్ వీడియోలు గుర్తుకువచ్చి నా గొట్టం పరిజ్ఞానానికి హృదయం మూలిగింది. కల్యాణదుర్గం వద్ద ఉన్న కంబదూరు శివాలయం మీద నేను ఒక వీడియో చిత్రీకరించాను. 

ఇక సలకం నరసయ్య నిర్మించిన సలకం చెరువు గ్రామం గురించి నేను యుక్త వయసు నుంచీ వింటూనే ఉన్నాను. అక్కడ అప్పట్లో మా నాన్న గారి మిత్రుడు ఉమా మహేశ్వర పండిట్ గారు స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవారు. నేను వాగనార్ కారు కొన్న కొత్తలో మా అమ్మా, నాన్న మరియు శ్రీమతి తో కలిసి సలకం చెరువు గ్రామంలో సత్యా వేణుగోపాల విగ్రహమున్న దేవాలయాన్ని సందర్శించాను. అది చూసిన వెంటనే నాకు పోతన రాసిన 'అరి చూచున్, హరి జూచున్' పద్యం గుర్తుకువచ్చింది. ఇక శింగన మలను నేను చాలా సార్లు చూశాను. అక్కడ ఉన్న శ్రీ రంగ రాయల చెరువు మండు వేసవిలో కూడా నిండు కుండ లాగా నీటితో తొణికిసలాడుతూ ఉండడం చిన్నప్పటి నుంచి ఎరుగుదును. అలాగే గంప మల్లయ్య గుడి పూజారి వడి వడి గా గెంతుతూ కొండ దిగేటప్పుడు జారి పడి మరణించడాన్ని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వీడియోలలో చూసాను. ఎందుకో మరి చిత్రచేడు లో నిలువెత్తు బండ మీద ఉన్న ఆంజనేయ స్వామిని చూడలేక పోయాను. రచయిత ప్రస్తావించిన రాయదుర్గం సమీప గ్రామం లోని రాతి మంచం చూడాలని నాన్న రాయదుర్గం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గా  1996 లో పనిచేస్తున్నప్పుడు  సంకల్పించుకున్న నేను దానిని ఇంచు మించు రెండు దశాబ్దాల తరువాత 2021 లో చూచి వచ్చాను. చూడముచ్చటగా ఉంది ఆ రాతి మంచం. దానిని చూసినప్పుడు నాకు మాయా బజార్ సినిమా లోని 'తల్పం.. గిల్పం' సన్నివేశం గుర్తుకువచ్చింది. జైన తీర్థంకర శాసన దేవతల మరియు బౌద్ధ పరివ్రాజక  దేవతల ప్రతిమా లక్షణాలలో భేదాలు ఉంటాయనే విషయం ఈ పుస్తకం చదివిన తరువాతే నాకు తెలిసింది. 

మన ప్రాంతం లో ఆంజనేయ స్వామి గుళ్లకు కొదవలేదని నాకు తెలుసు. కానీ కొలనుపాక  మ్యూజియం లో ఉన్న హనుమంతుడి కొడుకు మత్స్య వల్లభుడి విగ్రహ కథనం నాకు చాలా ఆసక్తి కరంగా అనిపించింది. రాయల సీమలో వ్యాసరాయలు ప్రతిష్టించినవిగా చెప్పబడుతున్న శతాధిక  హనుమంతుడి దేవాలయాలను నేను సందర్శించాను. శ్రావణ మాసం లో ప్రసిద్ద హనుమత్ క్షేత్రాలైన కసాపురం, మురిడీ మరియు నేమికల్లును ఒకే రోజు సందర్శించాను. హనుమంతుడు అంటే పూనకం తెచ్చుకునే నాకు మత్స్య వల్లభుడి కథనం గురించి సరిగా తెలియకపోవడం ఒక బుద్ది జాడ్యంగా భావిస్తున్నాను. ఒకప్పుడు గ్రామ శివార్లలో మాత్రమే ప్రతిష్టించ బడేటటువంటి హనుమంతుడు మెల్లగా ఎలా గ్రామాల లోకి ప్రవేశించాడో ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. రామానుజుల వారు ఏ విధంగా హనుమంతుడి కి ప్రాధాన్యత తీసుకువచ్చారో నాకు రేఖా మాత్రంగా తెలుసు. వైష్ణవం లో హనుమంతుడిని 'శిరియ తిరువడి' గా పేర్కొంటారు మరి. హనుమంతుడికి ఇంత ప్రాధాన్యత ఎలా వచ్చిందో సూత్ర ప్రాయంగా తెలియజేసిన రచయితకు ధన్యవాదాలు. బ్రాహ్మణ దేవతలకు ప్రాధాన్యత ఎలా పెరిగిందో, బౌద్దం మరియు జైనం కనుమరుగు కావడానికి వైదికం పన్నిన వ్యూహాలు ఎలాంటివో తెలుసుకున్నాను. చాలా జైన దేవాలయాలు వైష్ణవ ఆలయాలుగా పరిణామం చెందిన తీరు తెన్ను కర్ణాటక ప్రాంతం లో స్పష్టంగా తెలుస్తుంది. అలా అని బౌద్దం, జైనం రెండూ పూర్తిగా కనుమరుగు అవడానికి వైదికం పన్నాగాలే  కారణం కాక పోవచ్చు. ఏది ఏమైనప్పటికీ , ఈ పుస్తకం చదువుతుంటే, మన భారత దేశంలో వివిధ తత్వ శాఖలు కలిసిపోయిన తీరు  అవగతం అవుతుంది. 

గుంతకల్ దగ్గర ఉన్న దిగంబర జైన క్షేత్రం అయిన కొనకొండ్ల గురించి రచయిత చక్కగా ముచ్చటించారు. జంబూ ద్వీప చక్రాన్ని నేను గుంతకల్ కాలేజీకి అకడెమిక్ ఆడిట్ కు వెళ్లినప్పుడు చూసాను. ఆ ప్రాంతాన్ని కాపాడడానికి చక్రవర్తి అనే స్కూల్ టీచర్ ప్రయత్నం చేసాడని ఈ పుస్తకం ద్వారానే నాకు తెలిసింది. 

ఇండోనేషియా వద్ద ఉన్న టోబా అగ్ని పర్వత పేలుడు ధూళితో నిండిన జ్వాలా పురం గురించిన కథనం ఆసక్తి కరంగా ఉంది.  దీని గురించి జయ ప్రకాష్ గారి  ఇంటర్వ్యూ ఒకటి సామాజిక మాధ్యమం లో  ఇది వరకే చూసాను.  ఆది మానవుల సమాధులలో మెన్ హిర్స్, డాల్మిన్స్ మరియు డాల్మినియాడ్స్ అనే నమూనాలు ఉంటాయని ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. 

ఈ పుస్తకం లో ప్రస్తావించిన థామస్ మన్రో చూసిన పెనకచర్ల చితంబర స్వామి గురించిన కథనం  'ఆంధ్ర యోగులు' పుస్తకంలో చదివాను. మా రాయలసీమ నిండా ముఠాలు, మఠాలే కదా!!!!! . పుస్తకం లో  ప్రస్తావించిన విరాట పర్వం పారాయణం గురించి నా చిన్నప్పుడు మా పితమహులు చెపుతుండగా విన్నాను. ఈ వ్యవస్ఠీకృత నమ్మకాల నుంచి బయట పడడానికి నాకు ఇంకా కాస్త సమయం పట్టొచ్చు. మన్రో కు గండి వద్ద స్వర్ణ తోరణం కనిపించిందని కూడా నేను ఇదివరకే విన్నాను. కానీ వీటిని రచయిత వర్ణించిన తీరు అద్భుతం. రాయలసీమ వాసుల చింత తీర్చడానికి థామస్ మన్రో చింత చెట్లు నాటించిన వైనం ఈ పుస్తకం ద్వారా తెలసుకున్నాను. ఈ తింత్రిణీ యజ్ఞాన్ని మన్రో ఎంత నిబద్దతో నిర్వహించాడో తెలుసుకుని మురిసిపోయాను. ఈ మన్రో మాండవ్య మహా ముని అవతారమని చెప్పే ఒక వైదికపు కట్టు కథను  నా చిన్నప్పుడే విన్నాను. 

మరొక ఆసక్తికర విషయాన్ని నేను ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. అదే కదిరితో ముడి పడి ఉన్న చంద్రవదన మరియు మొహియార్ ప్రేమ కథ. నాకు ముందుగానే ప్రేమ కథలంటే తగని పిచ్చి. చంద్రవదన మీద మరులు గొన్న మొహియార్ విరహ బాధను ఓర్వలేక మరణించిన తీరు చదివి నా హృదయం మరో టోబా అగ్ని పర్వతం లాగా జ్వలించింది. రెండు గదులను గడప కలిపినట్టే, కదిరి లో ఉన్న ఈ ఇరువురు అజ్ఞాత ప్రేమికులను గడప మీద కూచునే మా నరసింహ స్వామి ఎందుకు కలప లేక పోయాడో కదా!!!! అనాదిగా ప్రేమికుల పట్ల దైవం ఇంత ఉపేక్ష ఎందుకు వహిస్తున్నదో కదా అని తలచి వగచాను. ఈ కథనాన్ని అశేరా వర్ణించిన తీరు ఒక ప్రబంధాన్ని తలపించింది. ఈ సారి కదిరికి వెళ్లినప్పుడు ఆ ప్రేమికులను ఎందుకు కలపలేక పోయావని నరసింహ స్వామిని నిలదీసి వస్తాను. అలాగే ఈ సారి మద్దికెర వెళ్లినప్పుడు 'మద్దలాంబ'  దారు విగ్రహాన్ని చూసి వస్తాను. 

తిమ్మమ్మ మర్రి మాను వెనుక దాగి ఉన్న సతీ సహగమన కథనం చదువుతుంటే ఆనాటి దుష్ట సంప్రదాయాలను తలుచుకుని నా మనసే ఒక చితాగ్ని కుండం అయ్యింది. ఈ ఘట్టం లో రచయిత పేర్కొన్న మరో పుస్తకం తేజో తుంగభద్ర చదవాలని ఇప్పుడు ఉబలాటం నాకు మొదలయ్యింది. ఎవరి వద్దనైనా ఉంటే అరువివ్వండి........చదివి ఇచ్చేస్తాను. 

ఇక దక్షిణ జలియన్ వాలా బాగ్ గా పిలవబడే విదురాశ్వత్థ క్షేత్రం ను నేను రెండు, మూడు సార్లు చూడడం తటస్థించింది. ఇక్కడ ఉన్న అశ్వత్థ వృక్షానికి, మహా భారతం లోని విదురుడికి భలే పీట ముడి వేసారు. ఇది పాలేగాడు అయిన విదుర నాయకుడి తో సంబంధపడిన ప్రదేశమని ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. 

శాసనాల గురించి సందర్భోచితంగా అశేరా గారు చాలా చక్కగా వివరించారు. తిరుమలకు దర్శనాలకు వెళ్లినప్పుడు అక్కడ శ్రీనివాసుడి గుడి కుడ్యాల మీద అనేక తమిళ భాషలోని (?) శాసనాలను చూసాను. వాటిని చదివే ప్రయత్నం చేయడం వలన నేను తెలుగు కూడా మరిచిపోయే పరిస్థితి దాపురించడంతో వాటి వైపు తిరగడం కూడా మానేసాను. శాసనాలు అంటే నాకు చిన్నప్పటి నుంచి భయమే. ఎందుకంటే నా బాల్యం లో నేనూ, నా మిత్రుడు ఉరవకొండ లోని కొండ మీదకు ఎక్కినప్పుడు, ఆ కొండ బండ మీద ఏదో భాష లో రాసిన అక్షరాలను కూడ బలుక్కొని చదివినట్టు నటించాను. అప్పుడు నా మిత్రుడు 'అది చదివితే శిలగా మారతారు' అని చెప్పడంతో అవాక్కై అలాగే నిలుచుండి పోయాను. బాల్యంలో చాలా కాలం పాటు రాత్రి నిద్దరలో నేను శిలనై పోతానేమో అనే భయం వెంటాడింది. 

కూడేరు ను నేను ఎన్నో సార్లు చూసినప్పటికి, దాని చారిత్రక నేపథ్యం నాకు తెలియదు. కూడేరు శాసనం లో కుల ప్రస్తావన ఉన్నట్టుగానే, గొల్లలు, కైకాల రెడ్లు చేయవలసిన కైంకర్యాల గురించి తిరుమల, తిరుపతి లో శాసనాలు ఉన్నట్టు ఎక్కడో చదివాను. నిధుల గురించి శాసనాల లో ఉండవనే విషయం ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. అసలు మా ఆర్ట్స్ కళాశాల చరిత్ర మరియు ఆర్కియాలజీ విద్యార్థులకు ఈ శాసనాల పట్ల, దేవాలయ చరిత్ర పట్ల అవగాహన కల్పించాలి. మా చరిత్ర విభాగానికి కల్లూరు సుబ్బరావు మ్యూజియం తో అవగాహనా ఒప్పందం ఉండే వుంటుంది. ఇలాంటి మ్యూజియంలో మా విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పిస్తే ఎంత బాగుంటుందో కదా!!!!! 

కూడేరులో దొమ్మరాటలు  ఆడే పెన్నమ్మను, పవాడప్ప నాయుడు మోహించి ఇప్పటి అనంతపురం రాణి నగర్ లో అప్పట్లోనే పెట్టడం నాకు తెలియని చారిత్రక కోణం. ఇవన్నీ చదువుతుంటే నాకు హండే రాజుల చరిత్రను తెలుసుకోవాలనే ఉబలాటం కొత్తగా పుట్టింది.  ఇవన్నీ ఇప్పటి చరిత్ర విద్యార్థులు చదువుతున్నారా????? చరిత్ర చదవడం మొదలెడితే ఆ కిక్కే వేరప్పా!!!!!! నేను చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి. ఈ వేసంగి సెలవుల లోనే చిత్రదుర్గం లోని 'ఏలు సుత్తిన కోట' చూడాలి మరి!!!!! 

మడకశిర వద్ద ఉన్న రత్నగిరి కోటను నేను ఒకసారి చూసాను. నాకో వింత అలవాటు ఏమంటే కళాశాల పని మీద ఏదైనా ఊరు వెళ్లినప్పుడు, దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను సందర్శిస్తాను. ఆ అలవాటులో భాగంగానే రొళ్ల లో ఉన్న నరసింహ స్వామి గుడి, హేమావతి, మరియు రత్నగిరిని నేను చూడడం జరిగింది. రత్నగిరి కొల్లాపురమ్మ గుడిలో నాకు తోచిన రీతిలో అనుష్టానం కూడా చేసుకున్నాను. ఈ రత్నగిరి కోటకు సంబంధించిన జింక చర్మం మ్యాపు కథనం అశేరా గారు ఆసక్తి కరంగా వివరించారు. 

కళ్యాణదుర్గం అక్కమ్మ గారి కొండ గురించిన కథనం నన్ను ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళింది. దానికి కారణం నేను అక్కమ్మ గారి కొండ వద్ధ ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు విడతలుగా సుమారు మూడు ఏళ్ల పాటు పనిచేయడమే. ఆ దేవాలయం బయట ఉన్న శిలలను నేను వీరగల్లులుగా పోల్చుకోలేక పోయాను. కాలేజీ నుంచి అనంతపురంకు బయలుదేరేటప్పుడు కురులు విరబోసుకుని పడుకున్న గర్భిణి లాగా  కనిపించే కొండను ప్రతిరోజు చూసి మా అధ్యాపకులంతా ఓ విధమైన మైమరుపునకు గురయ్యే వాళ్లం. ఈ పుస్తకం లో ప్రస్తావించిన కుందుర్పి రామాలయాన్ని మాత్రం చూడలేకపోయాను. విజయ్ కుమార్ జాదవ్ గారికి తిరుమలేశుడే నిలువుదోపిడి ఇచ్చుకున్న కథనం చాలా ఆసక్తి దాయకంగా ఉంది. ఈ ఘట్టం చదువుతుంటే, అప్పట్లో నేను తిరుమల వేయి కాళ్ళ మండపం లో సేద తీరిన రోజులు గుర్తుకు వచ్చాయి. తిరుపతి గురించి ఇంకా బోలెడు విషయాలు తెలుసుకోవాలంటే మీరు పేటా శ్రీ రాసిన తిరుపతి కథలు చదవండి. నిజానికి చారిత్రక నేపథ్యం ఉన్న పుస్తకాలను చదవడం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. 

ఈ 'కంబ గిరి నుంచి శేషగిరి దాకా ఓ చారిత్రక ప్రయాణం' పుస్తకం ప్రతి యొక్క చరిత్ర విద్యార్థి చదివి తీరాలి.  ఈ పుస్తకం లో ప్రస్తావించిన అనంతపురం జిల్లాలోని ప్రతి చారిత్రక ప్రదేశానికి విద్యార్థులు క్షేత్ర పర్యటనకు వెళ్లాలి అని ఆకాంక్షిస్తూ విరమిస్తున్నాను. నాకు పత్రికల వాళ్లు, వారి అడ్రస్ లు తెలియకపోవడం వలన దీనిని నా బ్లాగు లోనే షేర్ చేసుకుంటున్నాను. ఇది చదివిన వారు, నేను చదవాల్సిన ఆసక్తికర చరిత్ర పుస్తకాలు ఉంటే, వాటి వివరాలు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అందరికీ మంగిడీలు. 

G L N Prasad

Lecturer in Zoology, Govt Arts College, Anantapur 



7 comments:

  1. అద్భుతమైన విషయాలు మీ బ్లాగ్ ద్వారా తెలుసుకున్నాను. నిజానికి అనంతపురం జిల్లా వాస్తవ్యుడిన అయినా చాలా చారిత్రక అంశాలు సంపూర్ణంగా తెలియవు , ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని ముందుగా గ్రామ శివారు లో మాత్రమే ప్రతిష్టించే వారు అన్న అంశాన్ని విని ఆశ్చర్య పోయాను దానికి గల కారణాలను తెలుసు కోవాలి అనే కుతూహలం మరియు మీ వ్యాఖ్యానం తో పుస్తకాన్ని వెంటనే చదవాలి అనే ఆసక్తి కలిగింది. పుస్తకం ఆన్లైన్ purchase వివరాలు తెలుప గల రూ గురువు గారు

    ReplyDelete
    Replies
    1. https://lm.facebook.com/l.php?u=https%3A%2F%2Fennelapitta.com%2Fproduct%2Fkambagiri-nunchi-seshagiri-daakaa%2F%3Ffbclid%3DIwZXh0bgNhZW0CMTEAAR7wLQFIHgzYYSPMERMg7Luc90iQFhLiKcPklYDL9g87aofscB_sLbYu08kmwA_aem_n019lQH6cQpBdvJ5FXYAbQ&h=AT2JpQKeodLV6pFyrNLPWc8PGfqRN0B8fQ9q8tWkZ-sPR7RvwEpJMz0QfyinWVa8PkkpHmDjoDwyVOIgeFzWfVV5146UPyy0CGkIWvzHxrcEdulKHftDZPZfERCstGddtQwNeQZV3ek-auWz

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. సర్! నమస్తే

    సంక్షిప్త సమీక్షేమో అని చదవడం మొదలెట్టిన అశేరా గారు రాసిన కంనుంశేదా పుస్తకం మీద వివక్ష లేని మీ సుదీర్ఘ సమీక్ష ఆద్యంతం ఆసక్తికరంగా, పుస్తకం చదవాలనే కోరికను ఊరించే విధంగా విషయాసమగ్రంగా, హాస్యస్ఫోరకంగా సాగి కంనుంశేదా పుస్తకాన్ని మీ సమీక్ష చదివిన వారు తప్పక కొని చదివేలా చేసేలా ఉండి రచయితకు చదువరులకు ఉభయతారకంగా ఉంది సర్. పనిలో పని పుస్తక సమీక్షతో పాటు మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకున్న తీరు అమోఘం సర్. తమ పంతం నెగ్గించుకోవాలంటే విషయాలను వ్యవస్థీకృతం చేయడం కన్నా జన్యూకృతం చేయడం చాలా ముఖ్యం అని శతాబ్దాల క్రితమే గుర్తించి వాస్తవాల పునాదుల మీద జన్యూకృతం చేసిన అవాస్తవాల కోటలను నిర్మించిన వారికి వ్యతిరేకంగా ఆ కోటలను బద్దలుకొట్టే ప్రయత్నం చేస్తున్న అశేరా గారి పుస్తకం మీద మీ ఈ సమీక్ష రచయితకు చదువరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని భావిస్తూ...🙏

    ReplyDelete
  4. చరిత్ర చదివాక జీవితం ధన్యమైంది.💐🌹👌🌹🤝🌹🙏🌹🇮🇳🌹💐

    ReplyDelete
  5. పుస్తకంలోని విషయం చదివిన తాలూకూ భావోద్వేగం మీ ప్రతి అక్షరంలో ప్రస్ఫుటం ఔతున్నందుకు! ఆ పుస్తక రచయితగా నాకు ఇంత కంటే గొప్ప ప్రశంస ఇంకేముంటాదండీ?

    పుస్తకాన్ని మరింతమంది చదివించేలా సాగిని మీ మనఃసమీక్షకు ధన్యవాదాలు...

    మీరు వీలైతే రాహుల్ సాంకృత్యాన్ వారి ఓల్గా టు గంగా, ఋగ్వేదంలో ఆర్యులు, ఇంకా ఇతర ఆయన రచనలు తప్పకుండా చదవండి. అలాగే అలెక్స్ హేలీ రాసిన ఏడు తరాలు, కళ్యాణరావు వారి అంటరాని వసంతం, అలాగే వసుధేంద్ర వారి లేటెస్ట్ చారిత్రాత్మక నవల పట్టు తోవ తప్పకుండా చదవండి.

    రాహుల్జీ రచనలు మీకు మన విశాలాంద్రలో లభిస్తాయి. వసుధేంద్ర పుస్తకాలు మరియు నా "మా నాయన్నాకు సెప్పిన కథలు" మరియు "దాసప్పగాని మనవడు" పుస్తకాలే కాక ఇతర్తేఅ విలువైన పుస్తకాలు మీకు chaayabooks.com లో లభిస్తాయి ప్రయత్నించగలరు.

    💕🙏💕🙏💕

    ReplyDelete
    Replies
    1. రాహుల్ గారి పుస్తకాలు చాలా కాలం క్రితమే చదివాను సర్ . మీరు చెప్పిన మిగిలిన పుస్తకాలు chaayaabooks. com ద్వారా తెప్పించుకునే ప్రయత్నం చేస్తాను.

      Delete

                                Multiple Activities in Our College Today  1. Meeting is convened in the examination committee with the membe...