Thursday, May 29, 2025



జనారణ్యంలో పుట్టి పెరిగిన నాకు అడవి అంటే అంతుచిక్కని భయం. ముందే నేను అనంతపురం జిల్లా వాడిని. ఒక్క పెన్నహోబిలం  చిట్టడువులు తప్ప చిన్నతనం లో ఇంకే అడవినీ  చూడలేదు. తరువాత యుక్త వయసులో తిరుపతికి మకాం మార్చడం వల్ల శేషాచలం అడవులతో అనుబంధం పెరిగింది. ఆ అనుబంధం కూడా నడక దారికి ఇరువైపులా ఉన్న అడవితోనే. అంతకు మించి శేషాచలం కొండల మీద అడవిలోకి సాహసించి వెళ్లలేక పోయాను. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో జంతుశాస్త్ర ఆచార్యుడి గా పనిచేస్తున్న రాజశేఖర్ మాత్రం ఉద్యోగం రాక ముందే బంగారు బల్లి మీద ప్రయోగాలు చేస్తూ శేషాచలం అడవుల్లో ప్రొఫెసర్ నందగోపాల్ గారితో పాటు తెగ తిరిగాడు. అప్పుడు అంతో, ఇంతో విన్నాను అడవి గురించి. ఈ మిత్రుడితోనే నేను అదే బంగారు బల్లి కోసం అహోబిలం అడవుల్లో కాళ్ల నొప్పి పుట్టే వరకు తిరిగాను. బంగారు బల్లి కనపడక పోయినా కూడా నాకు మాత్రం అడవి మీద అనురక్తి పెరిగింది. అడవి ఒళ్లంతా మా నరసింహ స్వామి సాక్షిగా తడమాలి అనిపించింది. నా భక్తి యాత్రలో భాగంగా శ్రీశైలం వెళ్లినప్పుడు, నల్లమల అడవుల్లో రాత్రి ప్రయాణం వెన్నులో చలి పుట్టించింది. మేము కారులో వెళుతుంటే, రోడ్డు నిదానంగా దాటుతూ ఒక పాము  కనపడింది.  జీవితంలో భయం అనేది ఒక విచిత్రమైన అనుభవం. భయపడినప్పుడే మనకు జీవితం తీవ్రత తెలుస్తుంది అంటాడు ఆచార్య రజనీష్. 

ఇలా అడవి మీద మమకారం పెంచుకున్న నేను కొన్ని బలీయమైన కారణాల వలన అడవిలో కొన్ని రోజులు గడపడం లాంటి సాహస కృత్యాలు చేయలేక పోయాను. నా భయాల వల్ల నాకు ఇప్పటికీ అడవి అంతుచిక్కని ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇలా నా అటవీ సందర్శన కాంక్ష పెరుగుతూ ఉన్న ప్రస్తుత తరుణంలో , నన్ను ఛాయా బుక్. కామ్ లో ఉన్న  "లంకమల దారుల్లో" అనే travelog వివరాలు ఆకర్షించాయి. పోస్ట్ లో ఆ పుస్తకం వచ్చినప్పుడు , అడవి మొత్తం నా ఇంటికి నడిచి వచ్చిన సంబరం అయ్యింది.  నాకు మొదటే ట్రావెలాగ్ పుస్తకాలంటే తగని మక్కువ. అసలు ఈ లంకమల దారుల్లో పుస్తకం చదువుతుంటే నాకైతే  "counter clockwise studies" చేస్తున్నట్టుగా అనిపించింది.  పుస్తకం పేజీలు తిప్పుతుంటే నేను నా గతంలోకి జారుకున్నాను. నా ఉద్యోగ ప్రస్థానం కడప జిల్లా రైల్వే కోడూరు వద్ద ఉన్న చిన్న ఓరంపాడు లో మొదలయ్యింది. అక్కడ కొత్తగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ పెట్టారు. అక్కడ నాకు 2002లో పోస్టింగ్ ఇవ్వడం తో కడప జిల్లాతో నా అనుబంధం మొదలయ్యింది. ఓబులవారి పల్లె రైల్వే స్టేషన్ లో inter city రైలు దిగి, చేతిలో కారియర్ బ్యాగ్ తో చిన్న ఓరంపాడు కు నేనూ, నా సీనియర్ మిత్రుడు గంగాధర్ రెడ్డి మూడు కిలోమీటర్ల మేర ప్రతి రోజు నడిచి చేరుకునేవాళ్లం. అంతే గాక ప్రతి వేసంగి సెలవుల్లో స్పాట్ వాల్యుయేషన్ కోసం కడప జిల్లా కేంద్రం లో మకాం వేసేవాడిని. విష్ణు ప్రియా లాడ్జీ లో దిగే వాడిని. ఇలా నా ఉద్యోగ ప్రస్థానం కడప లో జరుగుతున్న సమయం లో రచయిత వివేక్ పుస్తకం లో ప్రస్తావించిన ప్రదేశాలు చూడడం తటస్థించింది. లంకమల ఆడవులంతా వివేక్ ఆత్మ పరుచుకున్నట్టే అనిపించింది పుస్తకం చదువుతుంటే. నేను ఈ అడవుల గుండానే కొన్ని నెలల  క్రింద సిద్దవటం నుంచి బద్వేల్ దగ్గర ఉన్న లక్ష్మీ పాళ్యెం అగ్రహారానికి వెళ్లాను. ఈ పుస్తకం అప్పుడే చదివి ఉంటే, డిపార్ట్మెంట్ వారి సహకారంతో కొద్దిగా అడవి లోపలికి వెళ్ళేవాడినేమో!!!!

అడవి సౌందర్యం అంతా దాని స్వేచ్ఛ లోనే ఉంది. ఈ పుస్తకం చదవక ముందు నాకు అసలు అడవులు ఎందుకు తగలడతాయో తెలిసింది కాదు. అడవి తనను తాను కాల్చుకోవడం ద్వారానే పునరుజ్జీవనం పొందుతుందని, కొన్ని విత్తనాలు కాలితే తప్ప మొలకెత్తవనే ప్రకృతి రహస్యం నాకు అవగతమయ్యింది. ప్రతి అడవి మాఘం, పాల్గుణం లో కాలి బూడిదయ్యేది తిరిగి చిగురించడానికే. వైశాఖానికంతా అడవి తనను తాను ఎలా సిద్దం చేసుకొంటుందో చక్కగా వర్ణించారు ఈ పుస్తకంలో. అడవిలో నడవడం వలన సహజమైన పద్దతిలో nature healing జరుగుతుంది. అడవి స్థల కాల పరిస్థితులకీ అతీతంగా ఎలా నిలబడగలిగిందో  నాకు అర్థమయ్యింది.  గోజీతలు, కొండ పిచ్చుకలు, అడవి కోళ్లు , బెల్లగాయిల గురించిన వర్ణన చదివేటప్పుడు అడవిని మొత్తం కాన్వాస్ మీద చిత్రీకరించినట్టనిపించింది. యానాదులంటే, అనాది కాలంగా ప్రకృతిలో కలసి మమేకమై జీవించేవారని ఎంత చక్కగా తెలియజేశారో ఈ పుస్తకం లో. మధ్యవర్తుల ఉచ్చులో పడి మోసపోతున్న వలస కూలీల గురించి తెలుసుకున్నప్పుడు బాధేసింది. పుస్తకం లో ఒక చోట 'ఉతిత్తీరు .. ఉతిత్తీరు ' అని అరిచే ఉత్తిసిత్తు గాడు తారసపడ్డాడు. పక్షులు రకరకాల ధ్వనులు ఎలా చేస్తాయో ఒక జువాలజీ మాస్టారు గా నాకు తెలిసి ఉండడం వలన ఇలాంటి వర్ణనలను నేను బాగా ఎంజాయ్ చేసాను. రచయిత కేవలం అడవి ప్రయాణాన్ని అక్షరీకరించడంతో ఆగలేదు. ఆయన ప్రయాణంలో తారసిల్లిన యానాదుల జీవన విధానాలను సేకరించి, వాటిని ఆర్డీవో వెంకట రమణ గారి దృష్టికి తీసుకువెళ్లారు. వారికి ఆధార్ కార్డులు మంజూరు అయ్యేలా చేసారు. ఆ విధంగా ఈ రచన ఒక సామాజిక ప్రయోజనాన్ని సాధించింది. 

మిట్టమానుపల్లె వద్ద బ్రిటీష్ సైనికుడిని చంపిన మల్లుగాడి గురించి చదివినప్పుడు, ఇలాంటి అజ్ఞాత స్వాతంత్ర సమర యోధులు ఎందరు ఉన్నారో కదా అనిపించింది. మిన్నాగు విషం నాకి మల్లుడు బలవంతుడైన తీరు ఆసక్తి కరంగా ఉంది. దివిటీ పట్టుకుని తిరిగే ఈ మల్లన్నను, నిశీధి సమయం లో సానితో రతి చేస్తుండగా బంధించి, సూరు బొక్కల్లో నుంచి ఈటెల తో పొడిపించి చంపించిన బ్రిటీష్ వాడి జిత్తులమారితనం గురించి చదివినప్పుడు నా మనసు మిన్నాగు విషం పడిన తొణకల బావి నీటిలా తొణికింది, వణికింది. తెల్లదొర మనసు మిన్నాగు కంటే విషపూరితం కదా!!!!! దివిటీ మల్లిగాడి "ఉన్నోళ్లను కొట్టు, లేనోళ్లకు పెట్టు" అనే నినాదం ఇంకా ఆ లంకమల లో మారుమోగుతున్నట్టే ఉంది. లంకమలలో  ఒకప్పుడు ఏనుగులు తిరిగి ఉండొచ్చు అనే విషయం నాకు చాలా ఆసక్తిని కలిగించింది. 

కార్తె మారే ముందు, మారిన తరువాత లేచే పుట్టగొడగులను ఇబ్బడి, ముబ్బడిగా పండించడం ఎలానో ఈ తరాలు నేర్చుకుంటే, ఆకలి సమస్యలు కొందరికైనా తీరొచ్చు. మన బతుకుల్లోని చాలా సమస్యలకు అడవి పరిష్కారం చూపిస్తుందనేది నిజం. కానీ మనం అడవి నుంచి దూరంగా జరిగిపోయాము. నది నుంచీ దూరంగా వచ్చేసాము. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కడప జిల్లా ప్రవాసినై ఉన్నప్పుడు సగిలేరు సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలకు practical examiner గా వెళ్లాను. అప్పుడే కాశిరెడ్డి నాయన జీవ సమాధి అయిన జ్యోతి ని చూసాను. ఎప్పుడో 2004 మాట ఇది.  అహోబిలంకు అక్కడ నుంచి నడక దారి ఉందని అప్పుడే  విన్నాను. మునుపు నే రాసిన సమీక్షలు చదివిన వారికి నేనో భక్తుడను అనే విషయం అర్థమై ఉంటుంది. జ్యోతి క్షేత్రాన్ని 2004 లో   దర్శించినప్పుడు నేనో చిన్న బత్తాయిని, ఇప్పుడు పెద్ద బత్తాయిని అంతే తేడా. అప్పట్లో ఏ రోజో ఒక రోజు జ్యోతి నుంచి అహోబిలం వరకు నడిచి పోక పోతానా అని అనుకున్నాను. కానీ ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. నడక ప్రయాణం చేయాలంటే బద్దకం ఉండకూడదు. ప్రయాణానికి కావలసింది ప్రణాళిక. నాకు లోపించింది అదే. అందునా అడవులంటే పులి ఉంటుందేమో అన్న గిలి. నాకున్న భయం నాలోని భక్తిని చంపేసింది. ఈ లంక మల దారుల్లో పులి రెండు కాళ్ల మనిషిని ఎందుకు వేటాడదో చక్కగా వివరించారు. మా జువాలజీ లో ప్రతి వేటాడే జంతువుకి తను భక్షించే జీవికి సంబంధించిన  ఒక image ఉంటుందని చెపుతారు. దానినే prey image అంటారు. అందుకే పులి రెండు కాళ్ల మనిషిని వేరే విధి లేకుంటే తప్ప వేటాడదు. ఈ పులి గిలి వల్లనే నేను జ్యోతి నుంచి అహోబిలం వరకు నడక చేపట్టలేక పోయాను. ఏదో 'మారం రాజశేఖర్' పుణ్యమా అని అహోబిలం అడవుల్లో కొద్దిగా తిరిగాను అంతే. 

నాకు అడవంటే భయం పెరగడానికి మరో కారణం మిత్రులతో కలిసి రైల్వే కోడూరు దగ్గర ఉన్న గుండాల కోన కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటన. గుండాల కోన లోపలికి వెళ్లాము జీపుల్లో. మాకు గైడ్ గా ఆ కాలేజీ లో చదువుతున్న ఒక స్టూడెంట్ వ్యవహరించాడు. వాడు ముందుండి నడిపిస్తే, మేము వాడి వెనక నడిచాము. గుండాల కోన గాంభీర్యాన్ని చూస్తే నాకు గుండెల్లో వణుకు మొదలయ్యింది. ఏ వైపు చూసినా కూడా కోట గోడల్లా ఆకాశాన్ని చుంబిస్తున్న తూర్పు కనుమలు. మా జీపు ముందుగా ఉన్నట్టుండి ఒక నక్కల గుంపు వచ్చింది. కొన్ని నక్కలు  నా నక్క జిత్తులను పసిగట్టినట్టుగా నన్ను వింతగా చూసాయి. నేను నా నక్క వినయాలతో వాటిని పక్కదావ పట్టించాను. మా మిత్రులలో ఒకడు మన అదృష్టం పెంచుకోవడానికి జీపు దిగి వాటి తోకలు తొక్కుదాం అని కూడా ప్రతిపాదించాడు. పంచతంత్రంలో కరటక, దమనకులనే నక్కల గురించి వినడమే గానీ, వాటిని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి. అక్కడ నుంచి కోన వద్దకు మమ్మల్ని మా స్టూడెంట్ గైడ్ పిలుచుకువెళ్లాడు. మా మిత్రులంతా ఆ నీళ్ల గుంటలో ఈతలు కొడుతుంటే, నేను మాత్రం బిక్కు, బిక్కు మంటూ ఒక గుండు మీద కూచున్నాను. అక్కడ ఒక బిలం ఉండడం గమనించాను. సాధారణంగా అడవుల్లో నీటి కుంట దగ్గరికి దాహం తీర్చుకోవడానికి క్రూర మృగాలు వస్తాయనే విషయం నా బుర్రకు తట్టి ఇంకా భయం వేసింది. అందరి ఈత ఉత్సాహం నీరు గారిన తరువాత, మాతో తీసుకుపోయిన ఏవో తినుబండారాలు తిన్నాము. వెనక్కు వచ్చేటప్పుడు మా స్టూడెంట్ గైడ్ కు స్మృతి భంగమై , 'అయ్యోర్లు !!!! తోవ మరిచితిని' అని అనడంతో మా అందరి పరిస్థితి తినింది అరగక హిమాలయాలకు వెళ్లి, అక్కడ చిక్కుకున్న ప్రవరాఖ్యుడి లాగా అయిపోయింది. నాకే ఎందుకో అనుమానం పెను భూతమై వేధించి, ఆ సగటు విద్యార్థిని పక్కకు పిలుచుకు వెళ్లి " రేయ్ !!! నాయనా!!! నీకు పుణ్యం ఉంటుంది. నిజం చెప్పు నీకు మాలో ఎవరి మీద కోపం ఉంది?????" అని అడిగాను. వాడో గడుసు పిండంలా ఉన్నాడు. "భలే కనుక్కున్నారు సర్!!!! మా ఇంగ్షీషు సర్ అంటే నాకు కసి. నన్ను మా క్లాస్ అమ్మాయిల ముందు ఇంగ్షీషులో తిట్టాడు సర్!!! అందుకే ఈ దోవ మరచినట్టు నటిస్తున్నాను" అన్నాడు. "ఒరేయ్ !!! ఆ ఇంగ్షీషు సర్ తరపున నేను క్షమాపణ చెపుతాను రా!!!! నీవు కనికరించకుంటే నేను ఏ నక్క తోక పట్టుకునో  ఈ అడవి దాటాలి రా!!!" అని మొరపెట్టుకున్నాను. తరువాత ఆ శిష్య రత్నం మమ్మల్ని ఎలాగోలా అడవి బయటకు తీసుకువచ్చి విసిరేశాడు లెండి. అప్పట్నుంచి నాకు అడవి అంటే ఒకటే భయం.  

స్థానికులు వంట చెరుకు కోసం అడవులను నరకకుండా ఉండటానికి సీమ తుమ్మ చెట్లను అప్పట్లో నాటించారని పుస్తకం చదివిన తరువాతనే తెలిసింది. వీటి విత్తనాలను అప్పట్లో హెలికాఫ్టర్స్ లో చల్లించారనే ముచ్చట బాగుంది. కానీ అప్పట్లో అడవి రక్షణ కోసం నాటిన సీమ తుమ్మ చెట్లే ఇప్పుడు స్థానిక వృక్ష జాతులను కబళిస్తున్నాయి. కంచే చేను మేయడం అంటే ఇదేనేమో. 

కలివి కోడి అస్థిత్వాన్ని ప్రపంచానికి చాటిన ఐతన్న, ఆ కలివి కోడిని చూడడం కోసం పక్షి శాస్త్రజ్ఞుడైన భరత్ భూషణ్ లంకమలకు రావడం, బాంబే నుంచి సలీం అలీ గారు ఉరుకుల పరుగుల మీద రావడం, కానీ సలీం అలీ గారు వచ్చే లోపే ఆ పక్షి ప్రాణాలు గాలిలో కలసిపోవడం లాంటి సంఘటనలు రచయిత హృద్యంగా డాక్యుమెంట్ చేసారు. మనిషి తాకిన గూడు దగ్గరికి బెల్లగాయిలు మళ్లీ రావు అనే భయం పెట్టడం మంచిదే. ఆ మాత్రం పాప భీతి మనిషిలో లేకుంటే ఈ పాటికి బెల్లగాయి అంతరించిన జాతులలో చేరిపోయేది. 

సంబెట నరసింహ రాజు తవ్వించిన రాజుల చెరువు ఉదంతం, పగలు చీకటి కోన లో దివిటీ మల్లన్న బంగారం దాచిన వైనం చదువుతుంటే తెగ థ్రిల్లింగ్గా అనిపించింది. మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవడానికైనా అప్పుడప్పుడు ప్రయాణాలు చేస్తుండాలి అని రచయిత చెప్పిన మాట అక్షరాలా నిజం. 

2004 లో నేను కడప జిల్లాలో ఉన్నప్పుడు కడప జిల్లా లోని చాలా ప్రదేశాలు చుట్టబెట్టేసాను. హత్తిరాల లోని పరుశురామ క్షేత్రం మొదలుకొని, నందలూరు, ఒంటిమిట్ట, దేవుడి కడప, పుష్పగిరి, బ్రహ్మంగారి మఠం, జ్యోతి లాంటి ప్రదేశాలు అన్నిటినీ ఎర్ర బస్సుల్లో అప్పట్లో తిరిగేసాను కానీ అప్పట్లో ఎప్పుడూ కూడా సిద్దవటం కానీ, లంకమల గానీ, ఇంకా గండికోట గానీ పోలేకపోయాను. కారణం తెలియదు. నింగి ఋణం, నేల ఋణం అన్నట్టుగానే ఏదైనా ప్రాంతానికి వెళ్లాలి అంటే నీటి ఋణం ఉండాలేమో!!!! కానీ ఇటీవల యోగి వేమన విశ్వవిద్యాలయం లో part time PhD జువాలజీ లో చేరిన తరువాత అనంతపురం నుంచీ కడపకు నెలకో సారన్నా తిరుగుతున్నాను. అలా నేను ఇటీవలనే అల్లాడపల్లి, సంగమేశ్వరం చూసాను. ఇక్కడ చెప్పొచ్చేదేమంటే పుస్తకం లో ప్రస్తావించిన గండికోటను చూసినప్పటికీ, దాని చారిత్రక నేపథ్యాన్ని పట్టుకోలేక పోయాను. గ్రేట్ కాన్యాన్ సౌందర్యం ఎంతో నచ్చింది నాకు. ఈ గండికోటను మీర్ జుమ్లా కుతంత్రంతో ఆక్రమించిన తీరు పుస్తకం లో చక్కగా వివరించారు. 

లంకమల అరణ్యం మాత్రం కొద్ది కాలం క్రిందటే బద్వేలు వద్ద ఉన్న లక్ష్మీ పాళ్యెం అగ్రహారం లోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లినప్పుడు చూసాను. కానీ కొండ పొలం సినిమాలో చెప్పినట్టు అడవిని చూస్తే సరిపోదు, గమనించాలి. ఆటవిక న్యాయాన్ని తక్కువగా అంచనా వేస్తాము కానీ, ఈ jungle law వల్లనే అడవి అనేక ఆహారపు గొలుసులకు ఆశ్రయమిస్తోంది. సిద్దవటం మట్లీ రాజుల కోటను కూడా నేను, కడప SKR & SKR Govt College for women కాలేజీ Principal అయిన నా మిత్రుడు సలీం తో కలిసి చూసాను. 

సామాజిక వేదికల గురించి నాకున్న అభిప్రాయం కూడా ఈ పుస్తకం చదవడం వలన మారిపోయింది. 'జలధారలు', 'Into The Nature' లాంటి గ్రూపుల గురించి చదివినప్పుడు, అలాంటి గ్రూపులలో విద్యార్థులు సభ్యులుగా చేరితే ఎంత బాగుంటుందో కదా అనిపించింది.  అడవి ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడక్కడ చక్కగా వివరించారు. అడవి యాత్రికులకు పులి, ఎలుగ్గొడ్ల కంటే పరిక ప్రమాదకరం అని తెలసుకున్నాను. ఈత కాయలంటే ఎలుగుబంట్లకు ఇష్టం అని మొదటిసారి తెలుసుకున్నాను. జంతుశాస్త్ర అధ్యాపకుడిగా నేను పాఠాలు చెపుతున్నప్పటికీ నాదంతా పుస్తక పరిజ్ఞానమే. ఈ పుస్తకం చదివితే ఎవరికైనా తమిళ స్మగ్లర్ల పట్ల సానుభూతి కలుగుతుంది. ఈ పుస్తకం చదువుతుండగానే, త్వరలో M V రమణా రెడ్డి గారి ఆత్మకథ 'గతించిన రోజులు' చదవాలని సంకల్పించుకున్నాను. ఈ లంకమల దారుల్లో ట్రావెలాగ్ చదువుతూనే రాత్రి పూట కొండ పొలం సినిమా చూసేసాను. ఆదిమానవుల ఆవాసాల 'బిలం ప్రయాణం' ఉదంతం ఆసక్తికరంగా ఉంది. చెయ్యేరు వరద భీభత్సం వివరించేటప్పుడు రచయిత ఈత నేర్చుకోవడం ఒక ప్రాథమిక అవసరం అని ఎంత చక్కగా చెప్పారో!!!!! అలాంటి ఈత నేను ఇప్పటికీ నేర్చుకోలేక పోయాను. బెంగళూరుకు వెళ్లినప్పుడు బేబీ స్విమ్మింగ్ పూల్ లో నేను వచ్చీ రాని మునకలు వేస్తుంటే, నన్ను చూసిన కన్నడ పిల్లలు నన్ను mentally retarded fellow గా భావించి గుస...... గుస పోవడం నాకింకా గుర్తు. ఎద్దుల కోసం ప్రాణాలు వదిలేయడానికి సిద్దమైన వారి గురించి చదివినప్పుడు హృదయం ఆర్ద్రం అయ్యింది. విధ్వంసం, ఉపశమనం రెండూ ప్రకృతిలో భాగాలే అని తెలుసుకోవడానికి ఎంతో పరిపక్వత కావాలి. సిద్దవటం మట్లీ రాజుల కొలువులో ఉన్నారని చెప్పిన అష్ట దిగ్గజ కవుల్లో కవి చౌడప్ప పేరు మాత్రమే నేను విన్నాను. చెయ్యేరు వరదకు ఎదురొడ్డి నిలిచిన పులపత్తూరు గురించి చదువుతుంటే, నేను ఎంత భద్రమైన ప్రదేశంలో ఉన్నానో కదా అనిపించింది. పిల్లంకట్ల కళా రూపం గురించిన వివరణ ఆసక్తికరంగా ఉంది. పాలేగాళ్లకు తిరగబడ్డ వొన్నూరమ్మ ధైర్యానికి ఆశ్చర్యపోయాను. పరిస్థితులకు తిరగబడడం అంత సులువు కాదు. నల్లమల లోని మల్లేలమ్మకు ఎద్దుల నీటి కోసం 'తల పండు' సమర్పించున్న భైరవ కొండన్న గురించి చదువుతుంటే వెన్నులో చలి పుట్టింది. ఆ మొండి భైరవకోనను ఏ రోజో ఒక రోజు చూడాలి. 

ఈ పుస్తకం చదివిన తరువాత నాకు అర్థమయ్యిందేమంటే, ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ప్రత్యక్షంగా ఎంత చూసామన్నదే ముఖ్యం అని. ప్రత్యక్షానుభవం మనం చరిత్రను అర్థం చేసుకునే తీరును మారుస్తుంది. ముఖ్యంగా చరిత్ర విద్యార్థులు చదవడం తో ఆగకూడదు. చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశాలను దర్శించాలి. రకరకాల ఆధారాలను సేకరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే వాస్తవాన్ని, కల్పనను విడదీసే నేర్పు వస్తుంది. ఆది మానవుడికి అడవులతో ఉన్న అనుబంధం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఆకలి, నిద్ర, మైధునం మాత్రమే తెలిసిన ఆది మానవుడు అభద్రతా భావంతో చాలా తీరిక లేని రోజులు గడిపాడు. కొద్దిగా భద్రతా, తీరుబాటు జీవితంలో చొరబడగానే, emotional గా ప్రకృతితో connect అయిపోయాడు. ఇదంతా గమనింపు వల్ల వచ్చింది. ఆదిమానవుడు ద్రవ్య ప్రధాన సమాజం వైపు ఎలా ప్రయాణించాడనే విషయాన్ని చక్కగా తెలియజేసారు. అసలు ఏ అవసరం ఆది మానవుడిని అడవి నుంచి మైదానం వైపు తరిమింది? అడవి లోని ఆహారపు గొలుసుల్లో భాగంగా ఉండకుండా, మానవుడు ఆహారోత్పత్తి వైపు దృష్టి ఎందుకు సారించాడు? అడవిలో ఏం తక్కువైందని తల్లి ఒడి లాంటి అడవిని వదిలాడు? ఈ ఆది మానవుడి మస్తిష్కం లోకి ఆశ ఎప్పుడు ప్రవేశించింది? పుస్తకం చదువుతుంటే, ఇలాంటి ప్రశ్నలతో నా మనసు లోతెంతో తెలియని 'మంచాల గుండం' లా తయారయ్యింది. అడవిలో ఆది మానవుడు నిత్య ఘర్షణ పడలేక, భద్రత కోసం మైదానం వైపు వచ్చి ఉండవచ్చు. భద్రత వల్ల ఒక చోట చేరిన మనుషులు కుటుంబాలుగా, గ్రామాలుగా, రాజ్యాలుగా పరివర్తన చెంది ఉండవచ్చు అంటారు ఒక చోట రచయిత. అడవిని వదిలిన మానవుడు పంచుకోవడం మానేసి, పోగేసుకోవడం మొదలెట్టాడు. తన వాళ్లను కాపాడుకోవడం కోసం రాజ్యాలు ఏర్పరుచుకున్నాడు. అడవిలో ఉండి ఉంటే సంఘర్షణ మాత్రమే ఉండేది. రాచరికాలు మొదలవడంతో, మానవ మస్తిష్కంలో యుద్ధోన్మాదానికి బీజం పడింది. నిజానికి మనమందరం యుద్ధోన్మాదులుగా మారిపోయాము. ఎవరితో ఒకరితో, ఏదో ఒక రకంగా యుద్దాలు చేస్తూనే ఉన్నాము. 

తీరిగ్గా కూచుని తేరగా వచ్చింది మెక్కుదామనుకునే వారికే ధన రాశుల పుకార్లు రుచిస్తాయి. బుస్సా నాయుడి కోటలో ధన రాశులు, బంగారం ఉన్నాయనే పుకార్లు షికార్లు చేయడానికి కారణం మానవుడికి ధనం మీద ఉన్న యావే. చివరకు బుస్సా నాయుడు కూడా ఉంపుడుకత్తె కుతంత్రం వల్ల చస్తాడు. ఎవడి చావు వాడే తెచ్చుకుంటాడు. చాలా మందికి మరణం కాంతా, కనకాల వల్లనే వస్తుంది.  ఈ పుస్తకంలో పేర్కొన్న తురుకల సరి, ముండమోపుల రేవుల ఉదంతాలు తమాషాగా ఉన్నాయి. అనాది కాలంగా కాపాలిక శైవానికి ఆలవాలమైన లంకమల ఇలాంటి రహస్యాలను ఎన్నో దాచుకుందని నాకు అర్థమయ్యింది. సాకిరేవులో భల్లు గుడ్డు ( కబాడీ ) ఆడుతున్న సుగాలోళ్లను గంగమ్మ శపించడం స్త్రీల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. తురకల సరి వద్ద ఉన్న ఏనుగు బొమ్మ ఉన్న 'సుబ్బమ్మ రాతి బీరువా' గురించి చదివిన తరువాత, నా జీవితంలో ఎప్పుడో ఒకసారి దీనిని చూడాలని సంకల్పం చేసుకున్నాను. మా ఇంట్లో బీరువా చూడడానికే నాకు అటు తీరికా, ఇటు ఓపికా లేదు. ఇక ఈ సుబ్బమ్మ బీరువా ఏం చూచ్చానబ్బా!!!! తురకల సరి వద్ద చాకలి విసుగు తంత్రం ప్రస్తావన భలే గమ్మత్తుగా ఉంది. 

మొదటిసారి అడవికి వచ్చిన వాళ్లు ఒక్కో రాయి విసరడం వల్ల ఏర్పడిన మల్లాలమ్మ గుట్ట గురించి చదివినప్పుడనిపించింది చతుర్లాడడం కూడా ఒక్కోసారి మంచిదేనని. రాణీ బండ గురించి చదివినప్పుడు, ట్రెక్కింగ్ కు అవకాశమున్న ఇలాంటి స్థానిక ప్రదేశాలను ప్రభుత్వం పూనుకుని అభివృద్ధి చేస్తే బాగుంటుందనే వివేక్ గారి సలహా ఎంతో విలువైనది కదా అనిపించింది.  లంకమల యాత్ర తో ఆగకుండా, అడవంతా ఆరువేల seed balls చల్లడం నిజంగా ప్రశంసనీయం. ఈ విషయాన్ని మా కాలేజీ NSS Program officers దృష్టికి తీసుకువెళతాను. రచయిత చెప్పినట్టుగా అతి జాగ్రత్త, అతి గారాబం వలన ఈ తరం పిల్లలు ప్రకృతికి దూరం అవుతున్నారు. ప్రస్తుత తరం ప్రకృతికి దగ్గరగా జరగాలి అంటే వివేక్ గారి లాగా  అడవి బాట పట్టాలి. 

స్థానికంగా ఉన్న అడవులను కాపాడుకోవాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలి. పుస్తకం లో ప్రస్తావించినట్టు No plastic Lankamala, Restore Rajulacheruvu లాంటి ఉద్యమాలు బయలుదేరినప్పుడే, ప్రయాణాల యొక్క సామాజిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.  ప్రతి ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం సామాజిక శ్రేయస్సే కావాలి. ప్రతి యాత్రా ఏదో ఒక ఆదర్శంతో ముగియాలి. నేను కూడా వ్యక్తిగతంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకం మా విద్యార్థులచే చదివిస్తాను. 

G L N PRASAD
Lecturer in Zoology
Govt Arts College
Anantapur 

9 comments:

  1. మీ అనుభవాలు మరియు మీ ప్రయాణం వివరించి మమ్ములను కూడా అడవిలోకి తీసుకెళ్లి విహరించినట్లుంది...మంచి పుస్తకం పరిచయం చేసినందుకు ధన్యవాదములు తెలుపుచూ మేము కూడా "లంకమల దారుల్లో" చదువుతానిని తెలుపుచూ 💐🌹👌🌹🤝🌹🇮🇳🌹💐

    ReplyDelete
  2. Thank you so much for detailed analysis sir.

    మీ ఆర్టికల్ చదువుతుంటే మళ్లి లంకమల దారుల్లో చదువుతున్నట్టుగా ఉంది

    ReplyDelete
  3. Please share above book sir if you have soft copy

    ReplyDelete
    Replies
    1. నా దగ్గర పుస్తకం ఉంది. రేపు కాలేజీ లో అందజేస్తాను మిత్రమా

      Delete
  4. లంకమల దారుల్లో పుస్తకం చదివితీరాలి అనిపించే విధంగా వ్రాశారు సార్.చాలా గమ్మత్తుగా కూడిన విశేషాలను చాలా ఓపిక తో సేకరించి వ్రాసిన రచయిత కి, పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు. నేను కడప జిల్లా లో నే పుట్టి పెరిగాను, కానీ ఈ విశేషాలను గురించి మాకు తెలియదు.

    ReplyDelete
    Replies
    1. మేడం గారు! ధన్యవాదాలు. నిజానికి ప్రతి డిగ్రీ కళాశాలలో పిల్లలకు ఇలాంటి సమీప అడవిలోని ప్రదేశాలను చూపించాలి. అప్పుడు జీవ వైవిధ్యం పట్ల అవగాహన కలుగుతుంది. ట్రెక్కింగ్ కు కూడా విద్యార్థులను తీసుకెళ్లాలి. వీలైతే మీ ప్రిన్సిపల్ ద్వారా రచయితను విద్యార్థులకు పరిచయం చేయండి. లంకమల కు క్యాంప్ వేయించండి

      Delete

                                Multiple Activities in Our College Today  1. Meeting is convened in the examination committee with the membe...