రెండు రోజుల ముందు మిత్రులు ఆనంద భాస్కర్ మరియు మేడా ప్రసాద్ ఫోన్ చేసి నన్ను జాతీయ బాలల సైన్స్ సదస్సుకు జ్యూరీ సభ్యుడి గా ఆహ్వానించారు. మరో జ్యూరీ సభ్యుడిగా కెమిస్ట్రీ లెక్చరర్ రాజశేఖర్ రెడ్డి ని పిలిచారట. ఎగిరి గంతేసి మరీ ఒప్పుకున్నాను. ఆడిట్ లో తలమునకలై ఉన్నా కూడా ఒక తరానికి వారసులైన పిల్లల ప్రతిభా పాటవాలు గమనించే అవకాశం రావడం నా అదృష్టంగా భావించి ఒప్పుకున్నాను. ఇంచు మించు 60 వరకు ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈ పిల్లలని చూస్తుంటే నాకు మహదాశ్చర్యంగా ఉంటుంది. సి నా రె " ఎవడి లోతని కొలవను? ఒక్కొక్కడు ఒక్కో మహా సముద్రం.. తోలు కంటితో చూస్తే ఊరి చెరువులా ఉంటాడు.. ఎవడి ఎత్తని కొలవను? ఒక్కొక్కడో మహా శిఖరం.. చూడడానికి మాత్రం మొహం మీద సిరా మరకలతో మొద్దబ్బాయిలా ఉంటాడు" అని అననే అన్నాడు. అచ్చు అలాంటి వాళ్ళే నాకు ఈ రోజు తారసపడ్డారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చారు. లాగ్ బుక్స్ తీసుకుని, ప్రోగ్రామ్ బుక్స్ తీసుకుని వచ్చారు. చాలా మంది అక్షరాలు స్పష్టంగా పలుకుతున్నారు. సైన్స్ పట్ల వీరికున్న అవగాహన నన్ను అబ్బురపరిచింది. వారి వయసు లో నేనో పెద్ద శుంట కాయ. పదో తరగతి పాసవడానికే నా తల ప్రాణం తోకకొచ్చింది.
ఒక పిల్లవాడు సేంద్రీయ క్రిమిసంహారక మందులను సీసా లో వేసుకువచ్చి వివరించడం మొదలెట్టాడు. ఆ ఉత్సాహం లో ఆ మందులను నా మొహం మీద పిచకారీ చేయబోయాడు. కొంచముంటే, క్రిములేమో గానీ నేను చచ్చి ఉండేవాడిని. మరొకడు కోతుల బెడద నుంచి ఎలా తప్పించుకోవాలో ఒక ప్రాజెక్టు చేసేశాడు. వాడు ఒక సంచి లో సెన్సర్ అమర్చాడు. ఆ సంచి ని ముట్టుకుంటే కోతులకు షాక్ కొడుతుందట. ఆ సంచిని నన్ను ముట్టమని బలవంతం చేశాడు. నాలో కోతి పోలికలు కనిపించినట్టున్నాయి ఆ బడుద్దాయికి. ఆశ.. దోస.. అప్పడం.. మనం దొరుకుతామా ఏంటి?
ఒక అమ్మాయి ఘనాపాటి లాగా ఆవర్తన పట్టికను ముందు నుంచి వెనకకు, వెనక నుంచి ముందుకు అప్పగించేసింది. నాకైతే పూనకాలు లోడింగ్ అయిపోయాయి.
మాంటిసోరి స్కూల్ నుంచి ఏకంగా 7 బ్యాచ్ లు వచ్చేశాయి. Blazer వేసుకుని వాళ్ళు ఆంగ్లం లో సైన్స్ సిద్ధాంతాలను వేదిక మీద విశదీకరిస్తుంటే, తెగ ముచ్చటేసింది. ఒకడి తో blazer బాగుందిరా అన్నాను. "మీకు బాగానే ఉంటుంది సర్ చూడడానికి .......... మాకు ఉక్కపోతకు కాలుతుంటుంది" అని వాపోయాడు.
అసలు ఇన్ని ఐడియా లు ఈ బుడతలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి!!!!!!!! ఎవడు నా దేశం వెనకబడింది అని చెప్పింది. వీళ్ళను చూస్తే తెలుస్తుంది మన దేశ భవిత ఉజ్వలంగా ఉంటుందని. వీరిని తీర్చిదిద్దిన గైడ్ టీచర్స్ కు వంద వందనాలు.
చివర్లో పిల్లలతో మేము ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. తరువాత judgement షీట్ ఆనంద భాస్కర్ మరియు మేడా ప్రసాద్ కు ఇచ్చేసి నేనూ, రాజ శేఖర్ రెడ్డి కాలేజీ తోవ పట్టాము.
No comments:
Post a Comment