Thursday, January 11, 2024






 జనవరి 10, 2024 ఉదయాన్నే ఆరున్నరకు నేను, శ్రీదేవి మేడమ్ గారు నా కియా కారెన్స్ లో కడపకు బయలుదేరాము.  యోగి వేమన లో నా పరిశోధన నిమిత్తం చేపల వ్యర్థాలను, పేగులను, మొప్పలను ప్యాక్ చేసుకుని బయలుదేరాము. నేను వాటిని ముట్టింది లేదు గానీ, మేడమ్ గారు మరియు కల్యాణదుర్గం లోని నా పూర్వ విద్యార్థులు కలిసి కొన్ని చేపలను మార్కెట్ లో కొని, వాటి పొట్ట చీల్చి, పేగులు తీసి మరీ ప్యాక్ చేశారు. మార్కెట్ నుంచి చేపల వ్యర్థాలను కూడా తీసుకుచ్చారు. నేను చేపలను అసలు ముట్టకనే, పరిశోధన ముగించేలా ఉన్నానని నిర్ధారణకు రాకండి దయచేసి. ముదిగుబ్బ వద్ధ, నా శిష్య సమానుడు మరియు సహ పరిశోధకుడు అయిన మనోహర్ శ్రీనివాస్ నాయక్ మా కోసం కాచుకునివున్నాడు. అతనిని కారులో ఎక్కించుకుని ముందుకు సాగాము. ప్రయాణం చేస్తూ ఉంటే కారు నిండా నీచు వాసన కమ్మేసింది. నా బుర్రను ఆలోచనలు కమ్మేశాయి. కారు ముందుకు పోతూ ఉంటే, కాలం లో నేను వెనుకకు ప్రయాణించడం మొదలెట్టాను. 1997 లోనే గేట్ పరీక్ష ప్యాస్ అయి, నేను S V University లో  ప్రొఫెసర్ ఇందిరా శ్రీ రామ్ గారి వద్ధ పరిశోధక విద్యార్థి గా చేరాను. సుమారు ఒక సంవత్సరం , మూడు నెలల పాటు జూనియర్ రిసెర్చ్ ఫెల్లో గా పనిచేశాను. నెలకు మూడు వేలు స్టైఫండ్ గా వచ్చేది. S V University లో  F block లో ఉండేవాడిని. ఆల్బినో ఎలుకల మీద నా పరిశోధన. వాటి మెడ మీద వేళ్ళు పెట్టి, తోక లాగి, చంపేవాడిని. ఈ ప్రక్రియను cervical dislocation అంటారు. నా పరిశోధన ఆల్కహాల్ మీద కాబట్టి, దానిని తాపించి, ఎలుకలను చంపి, అవయవాలు వేరు చేసేవాణ్ణి. ఎలుకలకు ప్రత్యేకంగా కాలనీ ఉండేది అప్పట్లో. ఆ సమయం లో జంతువుల హక్కులను సంరక్షించే చట్టాలు ఇంకా మన దేశం లో అంతగా అమలుచేయబడలేదు కాబోలు. ఇలా ఓ వంద వరకు మూషికాలను సంహరించి ఉంటాను. ఏ మూషికమో నేనిచ్చిన ఆల్కహాల్ తాగి, ఆ తప్ప తాగిన స్థితిలో నన్ను "నీచుడా, మా మూషిక జాతి ని సంహరించడానికే నీవు పరిశోధన చేపట్టినట్టున్నావు. నీకిదే నా శాపం. నీ పరిశోధన ఇక కొన సాగదు " అని తీవ్రంగా శపించినట్టు ఉంది. అంతే కొన్ని రోజుల తరువాత పెట్టె, బేడ ( ఈ బేడ ఏమిటో, నేను దానిని ఎప్పుడు సర్దుకున్నానో మరి ) సర్దుకుని అనంతపురం చేరి పోయాను. ఈ మూషిక శాపం, నే చేసిన పాపం నన్ను చాలా కాలం వెన్నాడి, నాకు ఓ రెండు సంవత్సరాల కాలం చివరకు ప్రైవేట్ ఉద్యోగం కూడా రాలేదు. శాపానుగ్రహ సమర్థత మూషికాలకు ఉన్నదా అని వెర్రి బొర్రి ప్రశ్నలు సంధించకండి. 

సరి.. సరి.. ఇలా జీవన భృతి ని కోల్పోయిన నాకు 2002 లో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం రావడం, చిన్న ఓరంపాడు, చవట గుంట లాంటి ప్రదేశాల లో పనిచేయడం జరిగిపోయాయి. 2010 డిగ్రీ కళాశాల లెక్చరర్ గా పదోన్నతి మీద కల్యాణదుర్గం వచ్చాను. తరువాత నేను చదువుకున్న అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు బదిలీ మీద వచ్చాను. ఇలా పదోన్నతి వచ్చిన పుష్కర కాలానికి తిరిగి నన్ను పరిశోధన పురుగు తొలచడం మొదలెట్టింది. అందరూ డాక్టర్ పట్టా పుచ్చుకుంటున్నారు, మనకు లేకుంటే మా చెడ్డ నామోషీ గా ఉంటుందని తలచి, ఇదిగో ఇలా యోగి వేమన విశ్వ విద్యాలయం లో చేరిపోయాను. ఇప్పుడు మత్స్యాల మీద నా పరిశోధన. అప్పుడు మూషికాలు, ఇప్పుడు మత్స్యాలు  అంతే తేడా. "అందరి మొగుళ్ళు పి హెచ్ డి చేసి డాక్టర్ల వుతుంటే , నా మొగుడు పి హెచ్ డి చేసి, చేపలు పడుతుండే" అని ఒక రోజు నా అర్ధాంగి పాడుతుండగా విని ఉడుక్కోవడం కూడా జరిగిపోయింది. 
ఇలా నా ఆలోచనలు కొనసాగుతుండగానే, పులివెందుల లో ఓ హోటల్ వద్ధ టిఫినీ ల కోసం కారు ఆపాడు మా డ్రైవరు బాషా. అల్పాహారం అధికంగా గైకొని, తిరిగి కడప వైపు ప్రయాణం మొదలెట్టాము. నేను ఈ చేపలతో ఏమి పరిశోధన చేశాను అనేది రెండు సంవత్సరాల తరువాత నా థీసిస్ లో చూడవచ్చు. దానికి ఇప్పుడే తొందర లేదు. 
ఈ ట్రిప్ లోనే ఒక వంద పుస్తకాలను తీసుకుని కడప లో ఉన్న సి. పి బ్రౌన్ గ్రంథాలయానికి donate చేశాను. అంటే గ్రంథ వితరణ చేశాను. ఆ సందర్భం లో తీసుకున్న చిత్రాలే పైవి. 
ఈ పుస్తకాలు ఇవ్వడానికి తగిన ప్రేరణ ఇచ్చింది మాత్రం మా మిత్రుడు, ప్రస్తుతం SKR & SKR Government College ( W) (A) kadapa ప్రిన్సిపల్ డాక్టర్ సలీం  బాషా. 
మత్స్యాల మీద నా పరిశోధన ముగిసేలోగా, ఇలాంటి మంచి పనులు చాలా చేస్తానని మాట ఇస్తూ.. 

స్వస్తి 

1 comment:

                                        My newly published book "టీ టైమ్ కథలు"