ప్రణయ హంపీ
హంపీ పేరు తలుచుకుంటేనే నేనో 'చంద్ర ముఖుడిని' అయిపోతాను. అప్పుడే పుట్టి ఉంటే అని అనేక సార్లు ఆక్రోశించాను. నా మొదటి క్రష్ మరియు చివరి క్రష్ హంపీనే అని ఘంటాపథంగా చెప్పగలను. ఎవరైనా వ్యక్తులతో ప్రేమలో పడతారు. నేను మాత్రం హంపీ అనే ప్రదేశం తో ప్రేమలో పడ్డాను. ఇంతా చేస్తే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అదో శిథిల నగరమే. ఈ శిథిల నగరాన్ని నా వయసు శిశిరం లో ఉండగా చూడడం జరిగింది. చిన్నప్పటి నుంచి నాకు హంపీ పేరు కన్నా ఆనేగొంది పేరు సుపరిచితం. దానికి కారణం అది మా పితామహి స్వంత ఊరు. ఆమె బాల్యం లో ఆనేగొంది పాఠశాలలో చదువుకునేటప్పుడు, కొన్ని కారణాల వల్ల ఆమె చదవలేక పలక, బలపం మరియు ఇతర చిన్నా చితకా పుస్తకాలను తుంగభద్ర లో గిరాటేసిందని నాకు చెప్పేది. అంటే ఆమె చదువును తుంగభద్ర మింగేసింది. ఇలా నేను మా పాటి (అవ్వ) ద్వారా ఆనేగొంది పేరు బాల్యం లోనే విన్నాను. కానీ విధి విలాసమేమో మరి నేను ఇంతవరకు ఆనేగొందిని చూడలేకపోయాను. హంపీనే వృద్ధాప్యం లో చూసిన నేను, ఆనేగొంది నగరం లోకి ప్రవేశించలేకపోయినప్పటికీ, పుట్టి లో తుంగభద్ర దాటి నవ బృందావన వరకు వెళ్లాను. హంపీకి మాత్రం 50 ఏళ్ల వయసు మీద పడిన తరువాత ఐదు సార్లు వెళ్లి ఉంటాను.
హంపీ లో పుట్టిన ప్రతి ఒకరు నా దృష్టిలో అదృష్టవంతులు. ఈ నిర్ణయానికి నేను రావడానికి కారణం తిరుమల రామచంద్ర రాసిన 'హంపీ నుంచి హరప్పా దాకా' అన్న పుస్తకం. ప్రతి విద్యార్థి చదివి తీరవలసిన పుస్తకాలలో ఇది ఒకటి. నేను ఇప్పటికే రెండు సార్లు చదివాను. మొదటి సారి యుక్త వయసులో ఉండగా చదివాను. రెండో సారి 53 ఏళ్ల వయసులో చదివాను. తిరుమల రామచంద్ర గారి లాగా దేశమంతా తిరగాలనే వ్యామోహం నాకూ ఉంది. కానీ కొన్ని పరిమితుల కారణంగా ఒక నిర్ధిష్ట ప్రాంతానికే అంటిపెట్టుకుని జీవిస్తున్నాను. పరిస్థితుల గురుత్వాకర్షణ నుంచి బయట పడలేకున్నాను. అలా పరిస్థితులకు తలవంచడం లో కూడా ఎంతో మాధుర్యం ఉందనుకోండి.
ఇలా హంపీ తో నా రొమాంటిక్ జర్నీ కొనసాగిస్తుండగా కొన్ని రోజుల క్రితం ఒక అద్భుతం జరిగింది. మిత్రుడు ఆనంద భాస్కర్ మా ఇంటికి వచ్చినప్పుడు, అతనికి నా వద్ద ఉన్న 'హంపీ నుంచి హరప్పా దాకా' పుస్తకం చదవడానికి ఇచ్చాను. నేను చదివిన పుస్తకాలను, వీలైనంత మందితో చదివించడం నాకు ఇష్టం మరి. ఆ పుస్తకాన్ని అందుకున్న ఆనంద భాస్కర్, అతని మిత్రుడు మారుతీ పౌరోహితం గారు రాసిన 'ప్రణయ హంపీ' నవల గురించి నాతో ప్రస్తావించాడు. అలా ప్రణయ హంపీ పేరు నేను వినడం తటస్థించింది. ప్రేమ కథలో ఎన్నో కాకతాళీయాలు ఉన్నట్టే, తరువాత కొన్ని రోజులకు జరిగిన కథా కార్యశాలలో రచయిత మారుతి పౌరోహితం గారి చేతుల మీదుగా ప్రణయ హంపీ పుస్తకం ఫిబ్రవరి 23,2025 న నాకు అందింది. తరువాత మూడు రోజులకు వచ్చిన శివరాత్రి పర్వ దినాన ప్రణయ హంపీ చదవడం మొదలెట్టి, ఆ రోజే ముగించాను. ఈ పుస్తకం చదవడానికి ముందే నేను హంపీ చూసి ఉండడంతో ఆ పుస్తకంతో బాగా కనెక్ట్ అయిపోయాను. ఈ నవలలో విజయనగర విస్తృతి, వైభవం అన్నిటినీ ఆవిష్కరించిన తీరు అద్బుతం. హంపీ చూడని వారు సైతం ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు. నేనైతే విజయనగర చరిత్ర తో సంబంధం ఉన్న పెనుకొండ, చంద్రగిరి లాంటి ప్రదేశాలు కూడా చూసి ఉండడంతో, ఈ నవల చదివేటప్పుడు అనుభూతి ఐక్యతను పొందాను.
దీనిలో కథాంశం సంబజ్జ గౌడ మరియు ముద్దు కుప్పాయి ల ప్రేమ. వారి ప్రేమ చిగురించి, బలపడుతున్న సమయంలోనే రక్కసి తంగేడి యుద్దం జరగడం, దానిలో సంబజ్జ గౌడ పాల్గొనాల్సి రావడం నవల లో ఒక ప్రధాన మలుపు. చారిత్రక నేపథ్యంలో కల్పనా పాత్రలను సృష్టించి, వాటిని, చారిత్రక స్పూర్తి మరియు దీప్తి చెడకుండా, ఆ దేశ, కాలమాన పరిస్థితులలో వాటిని తిప్పడం లో రచయిత అనితర సాధ్యమైన ప్రజ్ఞను ప్రదర్శించారు. ఈ నవల చదువుతున్నంత సేపు పాఠకుడు ముద్దుకుప్పాయి, సంబజ్జ గౌడ ల ప్రేమ ఫలిస్తుందో, లేదో అనే ఆందోళన కు గురవుతాడు. ప్రేమలో, యుద్ధం లో ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా!!! యుద్దాలలో ముగిసిపోయిన ప్రేమ కథలు ఎన్నో ఉన్నట్టే, యుద్దాలకు దారి తీసిన ప్రేమ కథలు కూడా ఉన్నాయి. కానీ ఇది యుద్ధ నేపథ్యం లో సాగే ప్రేమ కథ, ప్రేమ ఆయుధంగా సాగే యుద్ధ కథ.
మరో విచిత్రం ఏమంటే ప్రధాన పాత్ర అయిన సంబజ్జ గౌడ విస్తృతి దీనిలో చాలా తక్కువగానే ఉంది. కానీ కథ మొత్తం ఆ పాత్రే పరుచుకుని కనపడుతుంది. కథ మొదట్లో దున్నపోతు ను నరికేటప్పుడు దాని మూపురం క్రింద ఉన్న మెడ మందాన్ని అంచనా వేసి, ఎంతో ఒడుపుతో కత్తిని దింపి మహిషాన్ని తుదముట్టించిన సంబజ్జ గౌడ రక్కసి తంగేడి యుద్దం లో అళియ రామరాయలను రక్షించాలనే స్వామి భక్తి తో ముందూ, వెనుకా చూడకుండా మద గజాన్ని ఎదుర్కోవాలనుకోవడం అతని పరోపకార పరాయణతకు పరాకాష్ట. యుద్ధ సమయంలో సంబజ్జ గౌడ మనస్థితి కళింగ యుద్ద సమయం లో అశోకుడిని గుర్తుకుచేస్తుంది. యుద్ధం గురించి చదువుతూ ఉంటే ఎవరి గెలుపోటములతో యుద్దానికి పనిలేదని అర్థమవుతుంది. యుద్ధ కాంక్ష రాజ్య దాహం వలన వస్తుంది. అన్ని రాజ్యాలు యుద్ధాల వల్ల కూలిపోతాయి. చదరంగం లో చచ్చేది బంట్లే అన్నట్టుగా ఏ యుద్ధం లోనైనా నష్టపోయేది సామాన్యులే. ఈ విషయం ఈ రాక్షస తంగేడి యుద్దం లో కూడా నిరూపించబడింది. అళియ రామరాయలు మరణం తరువాత తిరుమల రాయలు కోశాగారం లో నున్న సంపదను పెట్టెలలో పెట్టుకుని ఏనుగుల మీద పెనుగొండకు తరలిపోతాడు. హంపీ మాత్రం హాళు హంపీ గా మిగిలిపోతుంది. అవని గోపాలయ్య శెట్టి లాంటి వణిజులు ఏ ఆదవానికో తరలిపోగలరు. కొద్ది పాటి సంపద ఉన్న ఏ సలకం తిమ్మయ్య లాంటి వాళ్లో దేవతార్చన గృహం లో గొయ్యి తీసి మట్టి కుండలో దాన్ని కప్పెట్టగలరు. కానీ హంపీ నే నమ్ముకున్న సామాన్య ప్రజలు తమ కొంపలు వదిలేసి అడవులలో ఉన్న గుహలలో తలదాచుకున్నారన్న వాస్తవం పాఠకుడికి కన్నీరు తెప్పిస్తుంది. సామాన్యుడి పట్ల సానుభూతి కలిగి పాఠకుడి కళ్లలో తుంగభద్ర పోటెత్తుతుంది.
యుద్దము, ప్రేమా పడుగు పేకగా సాగే ఈ కథను చదువుతూ, నా ఊహా ప్రపంచం లో ఆవిష్కరిచుకున్న విజయనగర సామ్రాజ్యం లో కొన్ని చోట్ల కాస్త ఎక్కువ సేపు విహరించాను. అలా కాస్త ఎక్కువ సేపు విహరించిన లేదా ఆగిన ప్రదేశాలలో ఒకటి సూలే బజారు. పేరే విచిత్రం. ఈ పేరు చాలు విజయనగర సామ్రాజ్యం లో తీరిక వర్గాలకు ఎంత భోగ లాలసత ఉండేదో తెలియడానికి. సూలే బజారు లో కనిపించేది కేవలం విట కోలాహలం. సానులలో కూడా తారతమ్యాల నిచ్చెన మెట్లు ఉండేవి. ధనికులైన సానులు చాలా ప్రజోపకర కార్యక్రమాలు చేపట్టేవారు. వారు సంపాదించిన సొమ్మును దైవ కార్యాలకు కైంకర్యంగా ఇచ్చేవారు. గుళ్లకు మాన్యాలు ఇచ్చేవారు. దేవాదాసీ వ్యవస్థ అప్పటికే వేళ్ళూనుకుని ఉంది. ఏదో పుస్తకం లో చదివాను.. అప్పటి ఒంటి మిట్టలో శాపానుగ్రహ సమర్థురాలైన ఒక సిద్ద సాని ఉండేదని. ఎంతవరుకు నిజమో విజ్ఞులకు ఎరుక. నాకేమెరుక?
వలంది అనే పడుచు పాత్ర ఈ కథ లో పాఠకుల అందరి సానుభూతిని పొందుతుంది. ఈమె ఒక వేశ్య. వేశ్యల లో కూడా ఉన్నత భావాలు ఉన్నవారుంటారని వలంది పాత్ర ద్వారా తెలుస్తుంది. ఈ వలంది కి యజమానురాలు (దొరసాని అనొచ్చా) నాగసాని. అప్పటి విజయనగర చరిత్రలో సానుల స్థితి గతులను వలంది పాత్ర ద్వారా రచయిత చెప్పించి మెప్పించారు. ఈ సుకుమార వార వనితల యాతన యుద్ద సమయం లో ఎలా ఉండేదో తెలిసి వచ్చి అప్పటి రాజుల పట్ల జుగుప్స వస్తుంది. ఎవరి పరిపాలనలో కూడా అన్ని వర్గాలు సుఖపడిన దాఖలా చరిత్రలో ఎక్కడా కనపడదు. దోపిడి వర్గాలు మారతాయి. దోపిడి మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అప్పట్లో వేశ్యలు చాలా మంది సాహిత్య పరిజ్ఞానం ఉండేవాళ్లే. వలందికి కూడా ఆమె యజమానురాలు చదవు నేర్పింది. వలంది యజమానురాలు నాగసాని వీణ వినసొంపుగా వాయించేదట. ఏది ఏమైనప్పటికీ అలా సూలే బజారులో నిలిచిపోయిన నా మనస్సుకు ఆ బజారు మొత్తం నట విట గాయక సమ్మిళితంగా తోచింది. వలంది చెప్పిన విషయాలు చదివితే అప్పటి వేశ్యల పరిస్థితికి పాఠకుడు కదిలిపోతాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే కన్యలు ఈ వృత్తిలోకి ప్రవేశించేవారు అప్పట్లో. Prostitution is the oldest trade అనేది నాకు అర్థం అయ్యింది. చైత్ర మాసం లో పౌర్ణమి రోజు అద్దం చూసుకోవడం అనే క్రతువు ద్వారా కన్యలు వేశ్యా వృత్తిలోకి ప్రవేశించేవారని వలంది చెపుతుంది. ఈ అద్దం చూసుకోవడాన్ని 'ముద్రాధికోత్సవం' అనేవారు. మరో వైచిత్రి ఏమంటే ఈ అద్దం మీద కూడా పన్ను ఉండేది అప్పట్లో. వేశ్యలు అద్దం చూసుకున్నందుకు కట్టే పన్నును 'సులేధం' అనే వారని ఒక కథలో వంశీ (పసలపూడి కథలలో అనుకుంటా ) ప్రస్తావించారు. వేశ్యా వృత్తి మీద పన్ను కాకుండా, ఈ అద్దం పన్నును అదనంగా చెల్లించాలి మరి. ప్రజలను ఆపన్నులుగా భావించి ఆదుకోవాల్సిన మహారాజులే, ఆ పన్నులు, ఈ పన్నులు వేసి ప్రజల నడ్డిని నడి వీధుల్లో విరిచారు మరి. కానీ అప్పటి బజారుల్లో రత్నాలు రాశులు పోసి అమ్మారు. ఏ చారిత్రక నగరాల్లో అయినా సరే బజార్లు బలిసి కొట్టుకుంటూ కనిపిస్తాయి. ముప్పై ఆరు రకాల పన్నులు వేసేవారట విజయనగర రాజులు. అప్పట్లో వేశ్యలకు ఎంత సాహిత్య పరిజ్ఞానం ఉండేది అంటే వారిలో కొద్ది మంది కావ్య రచన కూడా చేశారు. గణికలు చెరువులు తవ్వించారు, దేవాలయాలు కట్టించారు.
యుద్దం లో సైనికుల శారీరిక అవసరాలను తీర్చడానికి వేల మంది వేశ్యలను యుద్ధ భూమికి బలవంతంగా తరలించేవారు. కొన్ని లక్షల మంది సైన్యం, వేల సంఖ్య లో ఉన్న వేశ్యల మీద ఆధారపడితే , వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఆలోచించినప్పుడు మాత్రం అప్పట్లో పుట్టకపోవడం మంచిదయ్యింది అని నిట్టూర్చాను. ఇలా హంపీ లో పుట్టిఉంటే బాగుండేదనే నా పూర్వపు ఆలోచన నుంచి విముక్తి పొందాను.
సైనికుల వికృత, విపరీత ప్రవర్తన వల్ల తనువు పుండై, కాదు.. కాదు.., తనే ఒక పుండై వలంది వడలి రాలి పోతుంది. సంబజ్జ గౌడ, ముద్దుకుప్పాయిల పరిణయాన్ని కళ్లారా చూడాలనే ఆకాంక్ష తీరకనే వలంది కళ్లు మూస్తుంది. "అసలు వేశ్యల మీద హక్కు సైనికులకు ఎవరిచ్చారు?" "యుద్ధ ఖైదీలకు కూడా ఇలాంటి అమానవీయ అనుభవాలు ఎదురుకావు కదా?" లాంటి ప్రశ్నలు ప్రణయ హంపీ చదువుతుంటే పాఠకుల మదిని తొలుస్తాయి.
ముద్దు కుప్పాయి నాట్యం లో దిట్ట. కూచిపూడి భాగవుతుల కుటుంబం ఆమెది. ఆమె పూర్వీకులు దేశ దిమ్మరులుగా వచ్చి విజయనగర లో స్థిరపడతారు. రంగనాథుడికి ముద్దు కుప్పాయి పుష్ప కైంకర్యం చేస్తున్న ఘట్టం చదువుతుంటే 'ఆముక్తమాల్యద' లోని 'చూడి కుడుత్త నాచ్చియార్' కాస్త తొంగి చూసినట్టు అనిపిస్తుంది. దానికి నేను పెరిగిన నేపథ్యం కారణం కావొచ్చు.
యుద్ధం లో సంబజ్జ గౌడ పాల్గొనే ఘట్టాలు చదువుతూ ఉంటే, ఆ కదన రంగం లో కూడా వీర రసాన్ని, కరుణ రసం అధిగమించిందని చెప్పవచ్చు. ఆ యుద్ధ వర్ణన చదువుతుంటే నాకు కూడా పుస్తకం వదిలేసి "గరుడ, గరుడ" అని రంకెలేసుకుంటూ ఉరకాలనిపించింది. ఆలీ ఆదిల్షా నిస్సహాయత ఒక మహా సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసిన తీరు తలుచుకుంటే, అతని పట్ల కోపం కంటే కూడా సానుభూతే ఎక్కువ కలుగుతుంది. హుసేన్ నిజాం షా అళియ రామరాయల తలను ఉత్తరించిన తీరు కనులకు కట్టి మనసు కకావికలు అవుతుంది. నెత్తురు తో కలిసి ప్రవహిస్తున్న తుంగభద్ర తీరం వెంబడి గుర్రం మీద స్వారీ చేస్తూ రణ క్షేత్రం నుంచి తప్పించుకు వెళ్లిపోతున్న తిరుమలరాయల రూపు ఇప్పటికీ సజీవంగా దర్శనమిస్తుంది. ఇక్కడితో మాత్రమే ఆగిపోయి ఉంటే ప్రణయ హంపీ ప్రళయ హంపీ లాగా మారిపోయేది. కానీ యుద్దం లో విజయ నగర రాజులు ఓడిపోయినా కూడా సంబజ్జ గౌడ మరియు ముద్దుకుప్పాయిల కథ సుఖాంతం కావడం వలన నవల చదువుతున్న పాఠకుడి కి సానుభూతి కన్నా కూడా రసానుభూతి ఎక్కువగా కలుగుతుంది. ఏ నవలకైనా కూడా రస సిద్దే ప్రధాన ఉద్దేశ్యం. చాంద్ బాడి తవ్వకం లో యుద్ధ ఖైదీ గా నియమించబడిన సంబజ్జ గౌడను ముద్దు కుప్పాయితో సూఫీ భావాలున్న సల్మాన్ అహమ్మద్ ఫరూకి కలపడం వలన అన్ని మతాల, భావజాలాల మధ్య సమన్వయం కుదిరిన అనుభూతి పాఠకుడికి కలుగుతుంది.
ప్రణయ హంపీ చదివిన తరువాత హంపీ పట్ల నా ప్రేమ ముదిరి పాకానికి పడింది. ఇప్పుడు నేను ఒక సగటు పాఠకుడిని కాను. ఇప్పుడు నేనో రస సిద్దుడిని. ఈ సారి హంపీకి వెళ్లినప్పుడు ఆనేగొంది ని దర్శిస్తాను. రాక్షస తంగేడి యుద్దం జరిగిన ప్రాంతానికి కూడా వెళతాను. యుద్దాలు చేసిన గాయాలకు ప్రేమ మలాములు పూస్తూ, సూలే బజార్, విఠ్ఠల్ బజార్, విరూపాక్ష స్వామి దేవాలయం అన్నిటినీ చుట్టబెట్టేస్తాను. హాళు హంపీ ని ప్రణయ హంపీ గా మారుస్తాను.