Sunday, February 23, 2025

                                                                   కథా కార్యశాల 




అనంతపురం లోని లలిత కళా పరిషత్ లో ఈ రోజు హిందూపురం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రగతి మేడం ఆధ్వర్యంలో కథా కార్యశాల జరిగింది. సుమారు 20 మంది వరకు ఔత్సాహిక రచయితలు కథలు రాయడంలో ఒడుపులు నేర్చుకోవడానికి సదస్సుకు వచ్చారు. ఉదయం 10 గంటలకు కథా రచయిత సింగమనేని నారాయణ గారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి సమర్పించడంతో కార్యశాల మొదలయ్యింది. ప్రముఖ రచయితలు కెంగార మోహన్, వేంపల్లి షరీఫ్, శశికళ, శ్రీనివాస మూర్తి మరియు మారుతి పౌరోహితం కథా రచనలో ఉన్న మెళుకువలు నేర్పడానికి శిక్షకులుగా విచ్చేసారు. 

మొదటగా వేంపల్లి షరీఫ్ కథా రచనకు సంబంధించి ఈ క్రింది అంశాలు తెలియజేసారు. 

  • కథకు ప్రధానమైన ముడి సరుకు జీవితం. రచయిత తన జీవితం నుంచి గానీ, చుట్టూ ఉన్నవారి జీవితాల నుంచి గానీ కథకు, కథనానికి కావలసిన ముడిసరుకును గ్రహించాలి. 
  • కవిత్వం ఆవేశం నుంచి వస్తే, కథ ఆలోచన నుంచి వస్తుంది. 
  • కథను కదిలించేది సంఘటన 
  • కథా ప్రారంభం ఆసక్తి కలిగించేలా, ముగింపు ఆలోచింపజేసేలా ఉండాలి. 
  • ఎవరైనా సరే టెక్నిక్ ను manage చేయగలిగితే మంచి కథ రాయవచ్చు. కథను మలుపు తిప్పే ఒడుపే టెక్నిక్ అంటే. 
  • నిజానికి కథకు, కవితకు క్లుప్తత గుండెకాయ లాంటిది. 
  • రచయితకు పాత్ర స్వభావం గురించి స్పష్టత ఉండాలి. 
  • పాత్రకు తగిన కంఠ స్వరం ఉండాలి. 
  • అన్నిటికంటే ముఖ్యంగా రచయిత కథను ప్రేమించాలి. 
  • ఇప్పుడున్న Busy life లో కథాంశం దొరకడమే కష్టం. 
  • పదాలలో లయ ( rhythm ) ఉంటే పాఠకులు పట్టుకోగలగుతారు. 
  • కథ కు ప్రధానమైన ఉద్దేశ్యం అనుభూతి ఐక్యత
  • రావి శాస్త్రి పేర్కొన్నట్టుగా కథ రాసేటప్పుడు ఏ మంచికి చెడు చేయకు, ఏ చెడుకు మంచి చేయకు. 
వేంపల్లి షరీఫ్ గారు  దేశ విభజన నేపథ్యంలో రాసిన "రావి పారా" అనే కథ గురించి హృద్యంగా వివరించారు. 















రెండవ సెషన్ లో శశికళ మేడం గారు రాయలసీమ కథల గురించి ప్రస్తావించారు. రాయల సీమ నీళ్లకు, కథలకు ఏదో పీట ముడి పడిపోయింది అన్నారు. ఈమె ప్రస్తావించిన మరి కొన్ని అంశాలు ఈ క్రింద పేర్కొంటున్నాను. 

  • కథ అంటే పిప్పరమెంటు చప్పరించినట్టు ఉండాలి. 
  • కథ ఒక్కోసారి వెర్రి కుక్కలా వెంటబడుతుంది 
  • రాయలసీమ లో శ్రామిక వర్గాలు ఎక్కువ కథలను సృష్టించాయి. 
  • కడప జిల్లా రచయిత కేతు విశ్వనాథ రెడ్డి రచించిన 'నమ్ముకున్న నేల', 'గడ్డి' కథలను చక్కగా విశ్లేషించారు. 
  • చిత్తూరు  జిల్లా రచయిత మధురాంతకం రాజారాం పేర్కొన్నట్టుగా కథకులు ఎప్పుడూ దొంగ చూపులు చూస్తుండాలి అని చెప్పారు. మధురాంతకం రాజారాం మూడు వందల కథలు రాసారు. చిత్తూరు జిల్లా నాకు తెలిసినంతవరకు కథల కాణాచి. బాపూ, రమణ లను సైతం మైమరిపించిన నామిని రాసిన మిట్టూరోడి కథలు నేను కూడా చదివాను. తిరుపతి లో చాలా కాలం కాపురమున్నా కూడా నాకు నామినిని  కలిసే అదృష్టం పట్టలేదు. మధురాంతకం నరేంద్ర రాసిన మనోధర్మ పరాగం నవల కూడా నేను మూడు రోజుల్లో చదివేసాను. అంతెందుకు తిరుపతి లో నాకు తెలిసిన మరో రచయిత పేటా శ్రీ. ఈయన రాసిన తిరుపతి కథలు, కొండ కథలు చదివితే వేంకటేశ్వర స్వామి కళ్యాణం లడ్డు చప్పరించినంత కమ్మగా ఉంటాయి. 
  • మధురాంతకం రాజారాం రాసిన జీవన్ముక్తుడు గురించి చక్కగా వివరిస్తూ శశికళ గారు రచయిత సామాన్యుడి వైపు నిలబడడం శ్రేయస్కరం అన్నారు. 
  • కర్నూల్ జిల్లా రచయిత శ్రీనివాస మూర్తి గారి కథల గురించి ప్రస్తావించారు. 
  • అనంతపురం జిల్లా రచయితలు సింగమనేని రాసిన 'మకర ముఖం' , బండి నారాయణ స్వామి రాసిన 'నీళ్ల కథలు' లాంటి వాటిని సామాజిక మరియు ఆర్థిక కోణాలలో విశ్లేషించారు. 
  • శశికళ గారు "మహిళ రాయడం అంటే, తల్లి రాయడమే' అన్నమాట శ్రోతలకు హత్తుకుపోయింది. 
  • గల్పిక గురించి నేను మొదటిసారి ఈ సదస్సులో వినడం జరిగింది. గల్పిక లో హాస్యం మరియు వ్యంగ్యం ఉంటాయట.  
మద్యాహ్నం భోజన విరామం ఇచ్చారు. ఇక్కడ ప్రదర్శనలో పెట్టిన ఆరుద్ర రాసిన "కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు"  పదిహేను రూపాయలు పెట్టి కొన్నాను. 

భోజనానంతరం శ్రీనివాస మూర్తి గారి సదస్సు జరిగింది. ఇది జరిగేటప్పుడే ప్రగతి మేడం గారు అందరినీ రౌండ్ టేబల్ తరహాలో కూచోపెట్టారు. ఈ round table సమావేశం జరుగుతుండగానే, పై కప్పు పెచ్చు ఊడి అందరి మధ్యలో ఉరుమురిమి పెనం మీద పడినట్టు పడింది. ఆ పెచ్చు మామూలు పెచ్చు కాదు. అది concrete slab. నా లాంటి తల లేని వాళ్ల మీద పడితే పర్లేదు కానీ, ఔత్సాహిక రచయితల తలల మీద పడి ఉంటే చాలా కథలను సమాజం కోల్పోయేది. ఇక లోపలే సదస్సు కొనసాగితే తిరిగి ఏ పెచ్చో మీద పడే ప్రమాదం ఉందని, అప్పుడు అది anti climax అవుతుందని భావించి అందరం బయటకు వెళ్లి కూచున్నాము. శ్రీనివాస మూర్తి గారు ఈ క్రింది అంశాలు ప్రస్తావించారు. 

  • స్పురించిన భావనలను వెంటనే document చేసుకోండి. 
  • రష్యన్ రచయిత మైకో విస్కీ ప్రకారం రచయిత అవడానికి నిబంధనలు అంటూ ఏమీ లేవు. 
  • భిన్న రచయితలు భిన్న మార్గాలలో ప్రవేశిస్తారు. 
  • సాధన వల్లనే కథలో పరిణితి వస్తుంది. 
  • రచయితకు నిషిద్ధ వస్తువు అంటూ ఏమీ లేదు. 
  • సాహిత్యం లోని ఏ వనరైనా కథ రాయడానికి ఉపయోగపడుతుంది. 
  • రాయడం మొదలెడితేనే మంచి కథను సృష్టించగలరు. 
  • కథను బాగా రాయడానికి వయసు ద్వారా వచ్చే పరిపక్వత ఉపయోగపడుతుంది. వయో పరిపాకం లేని రచయితలు కొన్ని రసాలను పండించడం లో లౌల్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. 
  • కథా రచయిత భారత దేశం అనేక జాతుల సమాఖ్య అని మరువకూడదు. ఏ  జాతి ఆత్మ గౌరవాన్ని భంగపరిచే రీతిలో కథలు రాయకూడదు. 
  • కథను judge చేసే మంచి పాఠకుడు ప్రతి రచయితకు అవసరం. 
  • కథలో ఉటంకించిన సంఘటన పూర్వ చరిత్ర తెలుసుకుంటే, కథాంశానికి పరిపుష్టత వస్తుంది. 
  • రచయిత ఎప్పుడూ కూడా సాధ్యం కాని ముగింపులు ఇవ్వకూడదు. 
  • రచయితకు అన్ని ప్రజా ఉద్యమాల పట్ల అవగాహన ఉండాలి. రాజ్యాంగాన్ని కాపాడడం కూడా రచయితల కర్తవ్యం. మారుతున్న సామాజిక మరియు ఆర్థిక పరిణామాలను గుర్తించకుంటే, రచయిత వెనకపడతాడు. 
  • ఈ కాలం లో బాల్యం నుంచీనే మనిషి ఒంటరి వాడవుతున్నాడు. కాబట్టి బాల సాహిత్యం సృష్టించాలి. 
  • రచయితకు దృక్పథం ముఖ్యం. 
  • ఏ అనుభవం, అనుభూతి వృధా పోదు. 
  • మంచి కథ రాయడానికి triggering point దొరికే వరకు, ఏళ్ల కొద్ది అయినా సరే వేచి ఉండే ఓపిక రచయితకుండాలి. 
  • రచన సామాజిక ఉత్పత్తి. అంతరంగ పరిణితి లేకుండా మంచి కథ రాయలేరు. 
  • ఇక్కడ ఒక రహస్యం చెప్పారు. మనకు వచ్చే ఆర్థికేతర సమస్యలన్నీ స్వయంకృతాలే అన్నారు. 
  • మీ కథకు మీరే అంతిమ నిర్ణేతలు. 
  • నమ్మకం ఎక్కడో ఒక చోట ఆగి, reasoning ప్రవేశించాలి. 
  • కథ ఎప్పుడూ oppressed of most oppressed వైపు వకాల్తా పుచ్చుకోవాలి.  కథ కేవలం reporting లా పేలవంగా ఉండకూడదు. మరో విశేషం కూడా చెప్పారు. అదేమంటే "writer is going to be educated by his own writings" . ఈ వాక్యం నా స్వీయానుభవం. 
చివరగా ప్రణయ హంపీ  రచయిత మారుతీ పౌరోహితం చక్కగా ప్రసంగించారు. ఆయన ఈ నవల రాయడానికి చేసిన పరిశ్రమ గురించి చక్కగా చెప్పారు. ప్రణయ హంపీ రచన చదివి హంపీ రాజమాత ఆనేగొంది కి పిలిచి ఆయనను సన్మానించిన తీరు గురించి వివరించారు. ప్రణయ హంపీ నవల లోని పాత్రలకు పేర్లు పెట్టడానికి మారుతి గారు కన్నడ భాషా శాసనాలను కూడా చదివారట. వెయ్యి పేజీల నోట్స్ తయారుచేసుకున్నారట. నేను ఈ ప్రణయ హంపీ పుస్తకం గురించి మొదటగా  నా మిత్రుడు ఆనంద భాస్కర్ చెపితే విన్నాను. విచిత్రంగా ఈ ప్రణయ హంపీ పుస్తకం ప్రస్తావన వచ్చినప్పుడే మిత్రుడు ఆనంద భాస్కర్ సదస్సుకు విచ్చేశారు. నేను కూడా హంపీ తో ప్రేమలో పడిన తీరు తెలుసుకుని మారుతీ పౌరోహితం గారు నాకు ప్రణయ హంపీ పుస్తకాన్ని బహుకరించారు. 

చివరగా ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్న రషీద్ మరియు ఆనంద భాస్కర్ మాట్లాడారు. కెంగార మోహన్ గారు ఎవరైనా రచనలు పంపితే ప్రస్థానం పత్రిక లో పరిశీలించి ప్రచురించుకునే అవకాశం ఉందని తెలియజేసారు. 

చివరగా ప్రజాశక్తి రవిచంద్ర వందన సమర్పణ చేసారు. ఫోటోస్ పంపిన యూసఫ్ గారికి ధన్యవాదాలు. 

ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్మాణాత్మకంగా నిర్వహించిన ప్రగతి గారికి కైమోడ్పులతో ముగిస్తున్నాను. 






2 comments:

                           Collaborative Work With District Science Center, Anantapur   In collaboration with the District Science Center an...