Tuesday, March 18, 2025


ఆకాశవాణి తో నా అనుబంధం 









మీకో రహస్యం చెపుతాను. గట్టిగా అనుకోవాలి గానీ ఏ సంకల్పం అయినా ఇట్టే నెరవేరిపోతుంది. కొన్ని త్వరగా నెరవేరవచ్చు. కొన్ని సంకల్పాలు సిద్దించడానికి కాస్తా ఎక్కువ సమయం పట్టొచ్చు అంతే. ప్రతి కోరికకు ఒక time capsule ఉంటుంది. నేను అలా చిన్నప్పుడు అనుకున్నవన్నీ, నేను కాస్తా పెద్దగా అయిన తరువాత సహజంగానే జరగడం మొదలెట్టాయి. నేను నా బాల్యంలో నాన్నా, అమ్మతో కలిసి హైదరాబాద్ ఆకాశవాణికి వెళ్లాను. అప్పుడు మా బంధువు తరిమెల గోపాల కృష్ణమాచార్యులు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం లో డ్యూటి ఆఫీసర్ గా పనిచేసేవారు. అప్పుడు నేను మూడో తరగతో, మరి నాలుగో తరగతో చదువుతున్న జ్ఞాపకం. ఆకాశవాణి అనే పేరే నాకు తెగ నచ్చేసింది. ఈ ఆకాశవాణి అనే పేరు పెట్టింది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అని నాకు తెలియడానికి చాలా కాలం పట్టింది. అప్పటికే భాగవతం కథలో కంసుడికి ఆకాశవాణి వినపడిన ఘట్టం నాన్న ద్వారా, తాత ద్వారా విని ఉన్నాను. మేము ఆ హైదరాబాద్ కేంద్రం లోకి ప్రవేశించడానికి ముందే ఎవరూ కూడా అరవకూడదు, గుస గుసలాడకూడదు అని హెచ్చరించారు. మా ఇంటిల్లిపాది తో నేను ఈ ఆకాశవాణి కేంద్రం లోకి ప్రవేశించే సమయానికి నాకు ఎక్కడి లేని దగ్గు, ఎప్పుడూ లేని దగ్గు రావడంతో, ఆ పసి వయసులో దానిని నేను ఉగ్గబట్టుకోవడానికి పడిన మల్ల గుల్లాలు అంతా ఇంతా కావు. అప్పట్లో నాకు ఆకాశవాణి ఉద్యోగుల మీద జాలి కూడా కలిగింది. ఉద్యోగం చేస్తున్నంత సేపు వీళ్లు 'దగ్గేదేలే' కదా అనుకున్నాను. అప్పట్లో రేడియో announcers కు సినిమా నటులకు ఉన్నంత క్రేజ్ ఉండేది. చాలా మంది లబ్ధ ప్రతిష్టులు ఆకాశవాణిలో పనిచేసేవారు.  ఏది ఏమైనా ఆ బాల్యం లో నేను రేడియో స్టేషన్ ను సందర్శించడం అనేది నాకో మధుర జ్ఞాపకం గా మిగిలిపోయింది. అప్పుడే ఒక సంకల్పం చేసుకున్నాను. అదేమంటే ఏనాటికైనా నా వాణి ఆకాశవాణిలో వినిపించాలని. 
తరువాత నేను తిరుపతి లో చదువుకునేటప్పుడు నా మిత్రుడు చక్రపాణి కార్యక్రమాలు రేడియో లో ప్రసారమయ్యేవి. అతను ఎక్కువగా రేడియో కార్యక్రమాలు వినేవాడు. తరువాత కాలంలో అనేక ప్రైవేట్ tv ఛానెల్స్ ప్రవేశించడం తో శబ్ధ మాధ్యమం మీద దృశ్య మాధ్యమాలు పట్టు సాధించాయి. నేను కూడా అందరి లాగే ఈ tv ఛానెల్స్ మాయలో పడిపోయాను. 'ఈ tv ' 'జెమినీ  tv' లు తెగ చూసేవాడిని. 
2002 లో నాకు జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చిన చాలా కాలానికి నా మొదటి కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం ద్వారా ప్రసారమయ్యింది. రికార్డింగ్ స్టూడియో లోకి ప్రవేశించినప్పుడు నేను అనుభవించిన థ్రిల్ అంతా ఇంతా కాదు. నా రేడియో కల సాకారం కావడానికి కారణం ఆకాశవాణి లో లైబ్రేరియన్ గా పని చేసే నా class mate నాగేశ్వర. అతని వలన నాకు దేవరబొట్ల మురళి గారు, నాగేశ్వర రెడ్డి గారు, హేమంత రాజు గారు పరిచయం కావడంతో తరువాత కాలంలో నా వాణి, బాణీ ఆకాశవాణి లో చాలా సార్లు ప్రతిధ్వనించాయి. వీరందరికి నేను ఋణపడి ఉన్నాను. నేను ఆకాశవాణి లో అనేక అంశాల మీద విస్తృతంగా ప్రసంగించాను. నా ఇంటర్వ్యూ లు కూడా ప్రసారం అయ్యాయి. ఇంకో అంశం ఏమంటే మనకు జీవితం లో అందిన కిక్ అందరికీ కూడా అందుబాటులోకి రావాలి అనేది నా అభిలాష. అందుకే నా సహోద్యోగుల అందరి వాణి ఆకాశవాణిలో వినిపించేలా అవకాశాలు కలుగజేస్తున్నాను. నా విద్యార్థులు కూడా రేడియో కార్యక్రమాలలో పాల్గొన్నారు. వారితో క్విజ్ లు నిర్వహించాను. కల్యాణదుర్గం లో ఉన్నప్పుడైతే ఏకంగా విద్యార్థులతో ఇంగ్షీషు నాటిక వేసాము. 
శబ్ధం మీద, దృశ్యం మీదా సాధికారత సాధించినవాడు ప్రపంచాన్ని జయించగలడు. అలాంటి జయించే ఉద్దేశ్యం లేని వారికి ఈ సాధికారత జీవితంలో ఒక రసానుభూతిని మిగిలిస్తుంది. 
నా జీవితం రసమయం కావడానికి సహకరించిన ఆకాశవాణి ఉద్యోగులందరికి నా బ్లాగ్ సాక్షిగా శతాధిక ప్రణామాలు. 

 

No comments:

Post a Comment

                                            Multiple Activities today 9th April 2025 PG Practical Examination: Examiner Dr V Anu Prasanna, A...