కొన్ని కోరికలు వెంటనే తీరిపోతాయి. మరికొన్ని కోరికలు అనుభవానికి రావడానికి చాలా ఏళ్లు పట్టొచ్చు. నాకు విశాఖపట్నం మీద మోజు ఈనాటిది కాదు. బాల్యం నుంచి నాకు ఈ విశాఖపట్నం చూడాలని ఒకటే దుగ్ధ. కానీ ఇది సిద్దించడానికి నాకు 55 ఏళ్లు పట్టింది.
"Census -2027 Phase II లో భాగమైన జనగణనకు మీరు master trainers గా ఎన్నుకోబడ్డారు. కాబట్టి నవంబర్ 3, 2027 నుంచి నవంబర్ 6, 2027 వరకు మీకు విశాఖపట్నంలో శిక్షణ ఉంటుంది. మీరు వాల్తేరు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకోండి" అని ఉప తాశీల్దారు ఉత్తర్వు జారీ చేయడంతో నేనూ , కిరణ్ దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నాము. అనంతపురం నుంచి రైలు టిక్కెట్స్ దొరకలేదు. కాబట్టి గుంతకల్ నుంచి బయలుదేరే తిరుపతి - విశాఖపట్నం రైలులో మేమిద్దరం నవంబర్ 2 వ తేదీ సాయంత్రం బయలుదేరాము. లగేజి ఎక్కువగానే ఉంది. ఆరు రోజుల ప్రయాణం మరి. నాకైతే మరుసటి రోజున విశాఖపట్నం చూడబోతున్నాను అన్న ఉద్వేగం ఊపేస్తోంది. ఈ ప్రయాణంలో కొన్ని ఊర్లను చూడాలని ముందస్తుగా ప్రణాళిక సిద్దం చేసుకున్నాము. దానిలో భాగంగా మొదటి రోజు అరసవెల్లి , శ్రీకూర్మం మరియు శ్రీముఖ లింగం చూడాలని అనేసుకోవడమే తడవు, ఆన్లైన్ సవారి పోర్టల్ లో కారు బుక్ చేసుకున్నాము. రైలులో రాత్రికి ఇంట్లో కట్టిచ్చిన చపాతీ రోల్స్ తినేసాము. రేపటి నుంచి ఎలాగూ బయట తిండే కదా!!!! రైలు మూడు గంటలు ఆలస్యంగా మమ్మల్ని విశాఖ చేర్చింది. మా కోసం సవారీ వారి క్యాబ్ వేచి ఉంది. స్టేషన్ నుంచీ మా శిక్షణా కేంద్రమైన SMILE ( State Management Institute of Livestock Entrepreneurship) కు చేరుకున్నాము. ఇది హనుమంతవాకలో ఉంది. కాసేపు వేచి ఉండమని క్యాబ్ డ్రైవరుకు చెప్పి, మాకు కేటాయించిన 212 గదికి వెళ్లి స్నానాదులు ముగించుకున్నాము. మాతో పాటు గోవింద రెడ్డి మాస్టారు కూడా బయలుదేరారు. ఈయన కర్నూల్ జిల్లా లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. 11 గంటలయ్యింది మేము ప్రయాణం మొదలుపెట్టడానికి.
భోగాపురం, రణస్థలం, శ్రీకాకుళం మీదుగా మొదట అరస వెల్లి చేరిపోయాము. అప్పటికి మధ్యాహ్నం ఒంటిగంట కావొస్తోంది. మా కోసం DEO Office attender వేచి ఉన్నాడు. అతనే మాకు అరసవెల్లి సూర్య నారాయణ స్వామి దర్శనం ఏర్పాట్లు చేయించాడు. దర్శనం తరువాత దేవాలయంలోనే అన్న ప్రసాదం లభించింది. భోజనం రుచిగా, శుచిగా ఉంది. మాకు DEO Office attender చెరి ఒక పావు కేజీ పలాస జీడి పప్పు పాకెట్లు, పులిహోర మరియు లడ్డు ప్రసాదాలు అందించాడు. ఇక అక్కడి నుంచి శ్రీ కూర్మం బయలుదేరాము. కళింగ పట్నం వైపు వెళ్లే కొద్దీ వాతావరణం ఆహ్లాదంగా ఉంది. తుఫాన్ ప్రభావం ఇసుమంత లేదు. నిజానికి మేమున్న వారం రోజులలో మా మీద ఒక చినుకు కూడా పడలేదు. మేము శ్రీ కూర్మం చేరే సరికి 2.30 అయ్యింది. దేవాలయ పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉన్నాయి. ప్రాకార శిల్ప కళ అద్బుతంగా ఉంది. కోనేటి పరిసరాలు చాలా శుభ్రంగా ఉన్నాయి. దేవాలయం లోపల నక్షత్ర తాబేళ్ల పార్క్ ఉంది. గర్భాలయం లోపలి వరకు ప్రతి భక్తుడు వెళ్లి కూర్మ నారాయణుడి దర్శనం చేసుకోవచ్చు. అది కూడా ఉచిత దర్శనమే. శని దోష నివృత్తికి కూర్మ నారాయణ దర్శనం చేసుకుంటారని పూజారి చెప్పాడు. అసలు అలాంటి వారిని కూర్మ నారాయణుడు పిలిపించుకుంటాడని కూడా ఆయన చెప్పాడు. నాకు ప్రస్తుతం అష్టమ శని నడుస్తోందని తెలుసు. అలా నేను దైవికంగా శ్రీ కూర్మం వెళ్లడం జరిగిపోయింది. 'కాల చక్రం జగచ్చక్రం యుగ చక్రంచ కేశవ' అని కదా శాస్త్ర ప్రమాణం. శ్రీ కూర్మం నుంచి మత్స్య లేశం బీచ్ కు వెళ్లాలి అనుకున్నాము. కానీ ఆకాశం మొత్తం కరి మబ్బులు కమ్మేసి కనబడ్డాయి. వాన కుమ్మేస్తుంది అని భయపడి పర్ల కిమిడి మీదుగా శ్రీ ముఖ లింగం వైపు ప్రయాణించడం మొదలెట్టాము. కానీ ఆ మబ్బులు మాతో ప్రయాణించలేక వెనకబడి పోయాయి. పర్ల కిమిడి లో తేనీరు సేవించి మేము సాయంత్రం నాలుగింటికి శ్రీ ముఖ లింగం చేరాము. నాకైతే ఆ గోపురాలు చూస్తుంటే కుండలిని జర జర పాకి సహస్రారం చేరినంత పనయ్యింది. గోపుర శిఖరాలన్నీ కోణాకారంగా ఉండి అలంపూర్ నవ బ్రహ్మ ఆలయాలను తలపిస్తున్నాయి. ఇక్కడ మా వెంట వచ్చిన గోవింద రెడ్డి ఒక విషయం చెప్పారు. మూడవ శతాబ్దం ముందు కట్టిన దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉండవట. తరువాత జనాభా తగ్గిపోవడంతో జనాలలో లైంగిక విజ్ఞానం పట్ల అవగాహన కల్పించడానికి బూతు బొమ్మలు చెక్కడం మొదలయిందట. నిజమెంతో నాకైతే తెలియదు. నేను సివిల్ సర్వీసెస్ కు సిద్దమవుతున్నప్పుడు తాపీ ధర్మారావు గారి "దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?" పుస్తకం కడు ఇష్టంగా చదివాను. శ్రీ ముఖ లింగంలో చాలా మంది బ్రాహ్మలు దక్షిణ కోసం మా చుట్టూ చేరిపోయారు. ఇక్కడ కూడా ఉత్తర భారతంలో లాగా గర్భాలయం లోకి వెళ్లి దర్శనం చేయవచ్చు. శిల్ప కళ చూసి ఒక గొప్ప అనుభూతికి లోనయ్యాము అందరం. నేనైతే కొన్ని శిల్పాల వద్ద నిల్చుని ఫోటోలకు ఫోజిచ్చాను. ఇక అక్కడే కాలహరణం చేయడం మంచిది కాదని ఎంచి విశాఖ వైపు బయలుదేరాము. ఆకలో అని సహచరులు గగ్గోలు పెడుతుంటే శ్రీ ముఖ లింగం శివారులో ఆగి అరసవెల్లిలో మా ప్రాప్తానికి వచ్చిన పులిహోర మరియు లడ్డూలను మొత్తంగా ఆరగించేసాము. పులిహోర అయితే నిజంగా అదుర్స్. ఇలా మూడు క్షేత్రాలను ముచ్చటగా చూసుకుని మా హాస్టల్ చేరుకునే సరికి రాత్రి 8 గంటలయ్యింది.
మరుసటి రోజు అంటే, 3 వ తారీఖు ఉదయం 9.30 కి శిక్షణా తరగతులు మొదలయ్యాయి. ఈ శిక్షణ 6 వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుంది. నిన్నటి లాగా ఊర్లు చుట్టబెట్టడానికి వీలు కాదు. కాబట్టి ఉదయం తొమ్మిదింటి లోపు, సాయంత్రం 6.30 తరువాత ఇచ్ఛ వచ్చిన చోటికి వెళ్లి పోవాలని నిశ్చయించుకున్నాము. శిక్షణ చాలా బాగా ఇచ్చారు. ఒక ల్యాప్టాప్ బ్యాగ్, డైరీ, పెన్ డ్రైవ్ అందరికీ ఇచ్చారు. ప్రసన్న కుమార్ గారు మరియు శ్రీనివాస్ గారు మాకు అర్థమయ్యే విధంగా బోధించారు.
మూడవ తేదీ రాత్రి శిక్షణ ముగిసిన తరువాత నేనూ, కిరణ్ R K బీచ్ కు వెళ్లాము. నేను రాత్రి పూట సముద్రం చూడడం ఇదే మొదటి సారి. ఆ సముద్ర ఘోష భయంకరంగా ఉంది. ఎప్పటి లానే సముద్రం ఒడ్డున నేను నా అనుష్టానంలో మునిగిపోయాను. వెనుకకు తిరిగి చూస్తే కిరణ్ గవ్వలు ఏరుకుంటూ కనపడ్డాడు. కురుసుర జలాంతర్గామి మ్యూజియం కూడా చూసేసాము. వర్షం మొదలయ్యే సూచనలు కనపడడంతో క్యాబ్ బుక్ చేసుకుని తొమ్మిదికల్లా వసతి గృహం చేరి పోయాము.
మరుసటి రోజున ఉదయం 5.15 కల్లా లేచేసి ఒక గంటలో కాల కృత్యాలు, స్నాన పానాదులు ముగించేసుకుని సింహాచలం బయలుదేరాము. రానూ పోనూ వెయ్యి రూపాయలు రుసుముగా ఇవ్వడానికి బేరం కుదిరింది. సింహాచలం కొండ ఆకుపచ్చ రంగు పులుముకుని ఉంది. కొండ మీద అంతా ఆధ్యాత్మిక వాతావరణమే. మూడు వందల రూపాయలు చెల్లించి, నేనూ, కిరణ్ ప్రత్యేక దర్శనం చేసుకున్నాము. నా జీవితంలో నాకు ఇలాంటి దర్శనం అవుతుందని ఊహించలేదు. అసలు అలాంటి దర్శనం ఉంటుందని కూడా నాకు తెలియదు. గర్భగుడిలోకి వెళ్లి, స్వామి వద్ద నిలుచుకోవచ్చు. గర్భగుడిలో స్వామి వద్ద సుమారు పదిహేను నిమిషాలు నిలుచుకునే అవకాశం దొరికింది. చందనం పూసుకుని స్వామి వారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈతి బాధలు మెండుగా ఉన్నవారికి నరసింహ స్వామి దర్శనం ఎంతో స్వాంతన చేకూరుస్తుంది. అంగారక గ్రహ సంబంధ దోషాలు, ఋణ బాధలు నరసింహ స్వామి దర్శనంతో తొలగిపోతాయి. ఇలా దివ్యమైన దర్శనం చేసుకుని, హాస్టల్ కు తిరిగి వచ్చి టిఫిన్ చేసేసాము. బయట ఎక్కడా ఏమీ తినడం లేదు. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించడం నేర్చుకోవాలి ఎవరైనా. అలా అని సౌకర్యాల వద్ద రాజీ పడకూడదు. యాత్రలో ప్రతి నిమిషం సద్వినియోగం చేసుకోవాలి. మళ్లా ఇటు వైపు రామేమో అన్నంత ఆబగా వీలైనన్ని పరిసరాలు చుట్ట బెట్టాలి. అలసిపోయినప్పుడు ఆపేయాలి. శరీరాన్ని, డబ్బును, సమయాన్ని తగినట్టు గౌరవిస్తూ యాత్రలు చేయాలి. నచ్చిన వారితోనే ప్రయాణించాలి. కోపం, అసూయ మరియు పరనింద చేసే వారితో ప్రయాణించకూడదు. అప్పు చేసి యాత్రలు చేయకూడదు.
మరుసటి రోజు పెందలాడే లేచి ఋషికొండ బీచ్ వెళ్లిపోయాము. అక్కడ పాపిట తీసినట్టు నల్ల బండ రాళ్లు సముద్రం వైపు పరుచుకుని ఉంటాయి. అలలు వచ్చి శిలలను వేగంతో వచ్చి తాకుతుంటాయి ఇక్కడ. అయినా మొండి బండలు కదలవు, బెదరవు. కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము. సుమారు గంటన్నర సేపు ఋషికొండ బీచ్ లో గడిపాము.
ఇంకో రోజు తెన్నేటి పార్క్ కు వెళ్లాము. విశాఖపట్నం వెళ్ళిన ఎవరూ కూడా ఈ తెన్నేటి పార్క్ బీచ్ ను చూడకుండా రాకండి. ఇక్కడ Pre Wedding shoots చాలానే జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్లి తంతులో ఎంత మార్పు వచ్చింది. కాబోయే జంటలు రకరకాలుగా నిలబడి వీడియోలకు ఫోజులు ఇస్తున్నారు. ఇది మంచా, చెడా అనే విచికిత్స మనకు అనవసరం. కాలం తెచ్చిన మార్పులను ఎవరైనా అంగీకరించక తప్పదు అంటాను. మీరేటంటారేటి? అసలు మన అభిప్రాయాలతో ఆ జంటలకు పనేంటి????? ప్రతి జంటా ఒక అర్ధ నారీశ్వరం. నీవు సగం, నేను సగం అన్నట్టు కలసిపోవడం మంచిదే కదా. ఆ అన్యోన్యత కలకాలం వర్ధిల్లు గాక. ఈ సంద్రం ఎన్ని జంటలను చూసి ఉంటుందో కదా!!!!! ఈ ఇసుకలో ఎంత మంది ప్రేమికుల పాద ముద్రలు పడి ఉంటాయో కదా!!!!!.
ఇలా మేము తెన్నేటి తీరాన్ని ఆస్వాదిస్తుండగా మిత్రుడు జయచంద్ర ఫోన్ చేసారు. "సర్ !!!మేము చంద్రపాలెంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ కు వెళుతున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద స్కూల్. పదవ తరగతిలోనే పదిహేను సెక్షన్లు ఉన్నాయి. మంచి రన్నింగ్ ట్రాక్ ఉంది. 120 మంది టీచర్లు ఉన్నారు. మీరెక్కడ ఉన్నా క్యాబ్ తీసుకుని 8.30 కల్లా చంద్రపాలెం స్కూల్ కు వచ్చయండి" అన్నాడు. వెంటనే క్యాబ్ చేసుకుని మధురవాడ వద్ద ఉన్న చంద్రపాలెం వెళ్లి పోయాము. చాలా పెద్ద క్యాంపస్. హెడ్ మాస్టర్ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. టీచర్లను పరిచయం చేసారు. మాకందరికీ పుష్ప గుచ్చాలు ఇచ్చి ఆహ్వానం పలికారు. కాసేపు స్కూల్ నిర్వహణ ఎలా ఉందో తెలుసుకుని మా ట్రైనింగ్ సెంటర్ కు బయలుదేరాము. ఈ చంద్రపాలెం స్కూల్ చూడడం మాకెంతో సంతృప్తినిచ్చింది.
చివరి రోజు రాత్రి కైలాసగిరికి ఆరు మంది మిత్రులు కలిసి వెళ్లాము. రోప్ వే లో వెళుతుంటే నాకు చాలా భయం వేసి గట్టిగా అరవాలి అనుకున్నాను. కానీ అరుపు కూడా బయటకు రానంత భయం వేసింది. దీని తాడు తెగితే నా పరిస్థితి ఏటవుతదేటి!!!!!!! మా మిత్రులు కూడా బిగుసుకుపోయే కనిపించారు. తినింది అరగక ఎక్కాము దీన్ని. ఈ వయసులో ఇంత సాహసం అవసరమా అనిపించింది. క్రిందికి దిగిన వెంటనే అందరం ఊపిరి పీల్చుకున్నాము. శివ పార్వతుల విగ్రహం దగ్గరికి, త్రిశూలం వద్దకు వెళ్లి ఫోటోస్ తీసుకున్నాము. Glass bridge పైన నడిచాము. ఇదొక దుస్సాహసం అనిపించింది నాకు. క్రిందకు చూసాను. అంత చీకటిలోనూ లోయ కనిపించింది. భయపడిపోయి మా మిత్రులను పట్టుకుందామని చూస్తే ఒక్కరూ నా పక్కన లేరు. వెనుకకు తిరిగి చూస్తే అందరూ క్రిందకు చూసుకుంటూ భయానికి బిగదీసుకుని కనిపించారు. నాకైతే కదలడానికి కూడా భయం వేసింది. ఇక ఆలస్యం అవుతుందని క్యాబ్ బుక్ చేసుకుని ట్రైనింగ్ సెంటర్ చేరిపోయాము.
ఏడవ తేదీ న ఆలస్యంగా లేచాము నేనూ, కిరణ్. మా తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 12.30 కు ప్రశాంతి ట్రైన్ లో. 10.30 కు తిరుపతిలో ఒకప్పుడు మా పక్కింటిలో నివాసం ఉన్న మిత్రుడు మోహన్ వచ్చి కలిసారు. కాసేపు మాట్లాడుకుని, రైల్వే స్టేషన్ కు బయలుదేరాము. Platform no 5 కు Prashanthi Express వస్తుందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నాము. రైలు రావడానికి కాసేపు ముందు నా కళ్యాణదుర్గం శిష్యుడు హనుమంత రాయ చౌదరి వచ్చి కలిసాడు. మాడుగుల హల్వా మా కోసం తెచ్చాడు. గోధుమలు నానబెట్టి నేతిలో ముంచి చేసే హల్వా ఇది. దీనిని చూస్తే నాకు తిరునెల్వేలి హల్వా గుర్తుకు వచ్చింది. ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా అక్కడి స్పెషల్ తినుబండారాలు తింటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటది మరి. విజయవాడ స్టేషన్ లో పూరీ, ఇడ్లీ స్విగ్గీ ద్వారా తెప్పించుకుని తినేసాము, మరుసటి రోజు నిద్ర లేచేసరికి అనంతపురం platform మీద బండి ఉంది. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి అనుకుంటూ ఇల్లు చేరిపోయాము. మరో ప్రయాణంతో మళ్లీ కలుద్దాం.

































