Sunday, September 6, 2026

                                 Teachers' Day 2026 Celebrations at Our College & Joyalukkas










ప్రతి సంవత్సరం ఆచార్య స్మరణ చేసుకునే teachers' day ఈ ఏడాది కూడా వచ్చేసింది. ఈ అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో నేను చదువుకున్నది మూడేళ్లు ( 1988- 91 ). అప్పుడు కలలో కూడా అనుకోలేదు ఈ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసే అవకాశం వస్తుందని. మొదటి సారి హిందూపూర్ బాలాజీ విద్యా విహార్ లో అధ్యాపకుడిగా పని చేసే సమయంలో గురు పూజోత్సవంలో గురువుకు విద్యార్థులు ఇచ్చే ప్రాధాన్యత నాకు అనుభవానికి వచ్చింది. విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయబద్దంగా నారికేళ ఫలం ఇచ్చి కాళ్ల మీద 'గురుభ్యోనమః' అని వరుస కట్టి పడుతూఉంటే ఎంతో సంబర పడ్డాను. ఆ సంబరం ఎంతో బాధ్యతను మోసుకొచ్చింది అని కూడా గుర్తించాను. "అసలు దేనినైనా గురువు మార్చగలడా ? కనీసం శిష్యుడినైనా మార్చగలడా? " అని మనసులో తర్జన భర్జన పడినా, శిష్య సమూహంలో నాకున్న గౌరవం నన్ను వారి పట్ల సదా విధేయుడిగానే ఉంచింది. గురువు శిష్యుడన్న గుడ్డెద్దు చేనురా అన్న చందంగా ఉంటే శిష్యుడు తరిస్తాడు. ఈ గురు శిష్య తత్వ విచికిత్స తీరికగా మరో పోస్ట్ లో చూసుకుందాము గానీ ఇంతకు ఈరోజు ఎలా జరిగిందో చెపుతాను. 
మా ఆర్ట్స్ కళాశాల కామర్స్ సెమినార్ హాలులో మా గురువులు మరియు మాన్యులు పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య సుధాకర్ బాబు గారికి మరియు D N సత్యనారాయణ గారికి సన్మానం చేసాము. ఆచార్య సుధాకర్ బాబు గారు చక్కని సందేశం ఇచ్చారు. గురవుకు గంభీరమైన గాత్రం ఉండడం అదనపు హంగు. 
కొసమెరుపు ఏమిటంటే మలబార్ గోల్డ్ వారు కార్యక్రమం చివరలో లాటరీ తీసి ముగ్గురు అధ్యాపకులకు బహుమతులు అందించి సత్కరించారు. 
మరో విశేషం ఏమంటే నన్ను Joyalukkas వారు సాయంత్రం గురు పూజోత్సవానికి ఆహ్వానించడం. నాతో పాటుగా అహ్మద్ , బసిరెడ్డి శ్రీదేవి మరియు P S లక్ష్మీ మేడమ్ కు ఆహ్వానం అందింది. అందరం సాయంత్రం 5.30 కు Joyalukkas కు చేరుకున్నాము. అక్కడ చాలా మంది ఉపాధ్యాయులు అప్పటికే వచ్చి కూచున్నారు. పరిసరాలు గురువుల విజ్ఞానం తోను, అపరంజి కాంతి తోను ధగ ధగలాడుతున్నాయి. అక్కడ సరస్వతీ మరియు లక్ష్మీ ఇరువురు కలసిపోయిన వైభవం కనిపిస్తూ ఉంది. చదువు, ఐశ్వర్యం రెండూ కూడా ఒక వ్యక్తికి అబ్బితే అదో యోగం. ఒకే వ్యక్తికి సరస్వతీ మరియు లక్ష్మీ కటాక్షాలు కలగడం అరుదు. నిజానికి నేను బంగారును ఎప్పుడూ పట్టి కూడా చూడలేదు. నాకూ, సంపదకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ ఒక స్థిరాంకమే. డబ్బు విషయంలో మాత్రం నా ఆశ వ్యామోహం స్థాయికి చేరకుండా జాగ్రత్త పడ్డాను. విద్యకు, సంపదకు తేడా ఏమంటే విద్య ఎంత ఉన్నా బరువు కాదు కానీ సంపద మోతాదు మించితే బరువై కూచుంటుంది. కాపాడాల్సిన ధనం మోతాదు మించితే కబళిస్తుంది. డబ్బు మరియు జ్ఞానం విషయంలో ఏ ఒక్కడూ తోపు కాలేడు. ఒకడిని మించి ఒకడు తగులుతూనే ఉంటారు. అక్కరకు రాని విద్యా, సంపద రెండూ వృధానే!!!! Joyalukkas లో పని చేసేవారిలో వినయం, సహనం రెండూ ఉండడం వారి బంగారానికి తావి అబ్బినట్టుగా అయ్యింది. మాకు ఒక memory contest పెట్టారు. గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు. నేను దారుణంగా ఓడిపోయాను. నా సహచరులు కూడా ఓడి పోవడం నాకు తులం బంగారం అప్పటికప్పుడు నా సొంతమైనంత ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి memory contest లు మా విద్యార్థులకు మేము కూడా పెట్టాలి. సంపద గురించి, బంగారం, వెండి, ప్లాటినం గురించి కొన్ని విషయాలు నా ఉపన్యాసంలో పంచుకున్నాను. నీవేమన్నా కోటీశ్వరుడా ఇవన్నీ చెప్పడానికి అని మెలిక ప్రశ్న వేయకండి. డబ్బు గురించి మాట్లాడే వాడి వద్ద డబ్బు ఉండక పోవచ్చు. గుడ్డు పెట్టే కోడి వద్ద ఆమ్లెట్ ఉంటుందా ఏంటి.. మీ చిలిపితనం కాకపోతే. ఆమ్లెట్ వేసుకునే వాడు గుడ్డు పెడతాడా ఏంటి ? కొన్ని విని తలలూపాలి.. కవ్వించే ప్రశ్నలు వేయకూడదు. మా గురువులతో Joyalukkas వారు కేక్ కూడ కట్ చేయించారు. 
చుట్టూతా బంగారం కనిపిస్తున్న ఆ నేపథ్యంలో మాకు Joyalukkas వారు చేసిన సన్మానం నేను ఈ జన్మలో మరచిపోలేను. ఇలా ఈ teachers' day మాకు ఒక మధురానుభూతిని మిగిల్చింది. 

No comments:

Post a Comment

Report: Resource Person Visit to STSN Government Degree College, Kadiri — Student Induction Programme   Dr. B. Sreedevi and I were invited a...