పెనుకొండ పార్శ్వ నాథుడి దేవాలయం
యవ్వనంలో ప్రియురాలిని చూస్తే ఎంత వ్యామోహపడతామో, పెనుకొండను చూస్తే నాకు అంతే వ్యామోహం కలుగుతుంది. హంపీకి ఏ మాత్రం తీసిపోని వైభవం పెనుకొండది. నా దృష్టిలో ఆ మట్టిలోనే ఏదో మహత్తు ఉంది. అంతలేనిది అంత మంది యోగులు అక్కడ సిద్ది పొందరు. పెనుకొండ గిరి దుర్గం. అక్కడ ఇంకా రాచరికపు ఆనవాళ్లు పోలేదు. తనను పరిపాలించిన రాజులు పోయినా కూడా వారి కిరీటాలను ఇంకా మోస్తూ ఉంది పెనుకొండ. ఇప్పటికి పది సార్లకు పైగా చూసి ఉంటాను పెనుకొండను. నాకైతే ప్రతి రాయి ఆనాటి విజయనగర రాణుల మరియు సానుల సౌందర్యాన్ని పోతపోసుకున్నట్టు కనిపిస్తుంది. రాళ్లే ఇంత వయ్యారంగా ఉంటే, ఆ రాణులు ఎలా ఉండేవారో కదా అనిపిస్తుంది. ఆ పెనుకొండకు పోతే ఎవరికైనా చారిత్రిక స్పృహ కలుగుతుంది.
ఈ రోజు అనుకోకుండా అహ్మద్ మరియు మరొక కొలీగ్ తో నేను పెనుకొండ వెళ్లడం తటస్థించింది. కొన్ని అలా కలిసి వస్తుంటాయి అంతే. ముందుగా దర్గాను దర్శించుకున్నాము. అక్కడ మా కోసం మిత్రుడు హరీశ్ వచ్చాడు. అతని ఆధ్వర్యంలో నేను ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్న జైనుల పార్శ్వ నాథ స్వామి దేవాలయానికి వెళ్లాము. ఒకప్పుడు బౌద్దం లాగే జైనం ఎంతో వైభవంగా ఇక్కడ వెలుగొందింది. నిజానికి రాయలసీమ మరియు కర్ణాటక ప్రాంతంలో బౌద్దాన్ని మించిన వైభవాన్ని జైనం చవి చూసిందని చెప్పవచ్చు. మనం పూజించే చాలా మంది దేవీ దేవతలు జైన మూలాలు ఉన్నవారే. శైవం వలన బౌద్దం మరుగునపడినట్టుగానే వైష్ణవం వలన జైనం అంతరించింది అని చెప్పవచ్చు.
జైన తీర్థంకరులు మొత్తం 24 మంది. అందులో వర్ధమాన మహావీరుడు బుద్దుడి సమాకాలీకుడు మరియు బుద్దుడి కంటే వయసులో పెద్ద వాడు. ఆ పరంపరలో 19 వ తీర్థంకరిగా మల్ల నాథ అనే స్త్రీ ఉండేదని ఇటీవల ఏదో పుస్తకంలో చదివాను. అలాగే పార్శ్వ నాథుడు 23 వ తీర్థంకరుడు. పెనుకొండ పార్శ్వ నాథ దేవాలయంలో విగ్రహం ఖడ్గాసనంలో నిలుచుండి దర్శనం ఇస్తుంది. కొన్ని చోట్ల పార్శ్వ నాథుడు పద్మాసనంలో దర్శనమిస్తాడు. ఖడ్గాసనంలో లింగం కనపడుతుంది. పద్మాసనం లో లింగం కనపడదు. పార్శ్వ నాథ విగ్రహం పాదాల వద్ద 'హళ కనడ' భాషలో రాసిన శాసనాలు ఉన్నాయి.
పూజారి అజిత ప్రసాద్ గారు చాలా విశేషాలు చెప్పారు. ప్రతి జైన తీర్థంకరుడికి ఒక యక్షుడు మరియు ఒక యక్షిణి శాసన లేదా రక్షక దేవతలుగా ఉంటారు. అలా పార్శ్వ నాథుడికి పద్మావతి దేవి యక్షిణిగా, ధరణేంద్రుడు యక్షుడిగా ఉంటారు. ఇక్కడే నాగ దేవతలు కూడా ఉన్నారు. ఈ నాగ దేవతలు పెనవేసుకుని లేకపోయినప్పటికీ చాలా దగ్గరగా ఉన్నారు. ఇక్కడ ప్రతి అమావాస్యకు కాలసర్ప దోషం ఉన్నవారు రాహు కేతు పూజ చేయించుకుంటారని పురోహితుడు చెప్పాడు. ఋషభ నాథుడు మొదటి తీర్థంకరుడు. ఇతనికి రక్షణగా ఉండే యక్షిణి చక్రేశ్వరి. మరో విశేషం ఏమంటే నేమినాథుడు మరియు మన కృష్ణ పరమాత్మ దాయాదులట. భాగవత పురాణంలో ఈ ఋషభ నాథ మరియు నేమినాథ ప్రస్తావన వస్తుంది. ఈ ఆలయంలో శ్రుత స్కంద యంత్రాన్ని మరియు ఋషి మండలాన్ని చూసాను. శ్రుత స్కంద యంత్రం సరస్వతీ దేవికి ప్రతీక అని, ఈ యంత్రం వద్ద అక్షరాభ్యాసం చేస్తారని పురోహితులు చెప్పారు. శీతలనాథుడి యక్షిణి మానవి. జ్వాలామాలిని కూడా ఒక యక్షిణి. ఇప్పటికీ హైందవ తంత్రంలో యక్షిణీ ఉపాసనను కొందరు చేస్తూ ఉంటారు. విశేషమైన శక్తులు యక్షిణీ ఉపాసన వలన సిద్దిస్తాయని అంటారు. నాకైతే ఉన్న శక్తి చాలు అనిపిస్తుంది. మోతాదు మించిన శక్తి వెల్లువను ఎవరు భరించగలరు??? అందుకే దీనిని ఒక కౌళాచార ప్రక్రియగా పరిగణిస్తారు. అజిత నాథుడి యక్షిణి రోహిణి. కాళీ మరియు మనోవేగ కూడా యక్షిణులే. జైనంలో శ్వేతాంబర మరియు దిగంబర అనే శాఖలు ఉన్నాయి.
ఇదే గుడిలో మరొక ఉపాలయంలో పచ్చ పార్శ్వ నాథుడి విగ్రహం ఉంది. పచ్చతో చేసిన విగ్రహం కాబోలు. ఇంత వైభవంగా వెలుగొందిన జైనం క్షీణించడానికి కారణాలు కర్ణుడి చావుకు ఉన్నన్ని ఉన్నాయి. వీరశైవం ఒక వైపు, వైష్ణవం మరో వైపు జైనం వ్యాప్తిని అరికట్టాయి. చాలా మంది జైనులు చంపబడ్డారని చరిత్ర చదివితే తెలుస్తుంది. మీరు కర్ణాటకలోని గుడులు, గోపురాలు చూస్తే జైన శిల్ప అవశేషాలైన లతలు, ఏనుగులు లాంటివి కనిపిస్తాయి. గజలక్ష్మి అమ్మవారి పక్కన ఉన్న ఏనుగులు జైన శిల్ప కళా రీతి ఆనవాళ్లు అని కొద్దిమంది చరిత్రకారుల అభిప్రాయం. తీవ్ర తపో నియమాలను ఆచరించడం కూడా జైనం క్షీణ దశకు చేరుకోవడానికి మరో కారణం.
నాకైతే ఈ పార్శ్వ నాథ దేవాలయం దర్శించిన తరువాత జీవితం తరించింది అనిపించింది. అలాగే అక్కడ నుంచి పరసక్కర బావికి చేరుకున్నాము. ఈ బావిలో జలాధివాసం చేస్తున్న హనుమంతుడి విగ్రహం ఉంది. బావి నీరు తగ్గితే హనుమంతుడి దర్శనం అవుతుంది. మాకు ఆ భాగ్యం కలుగలేదు కానీ తోవలో ఎవరో ఒక వ్యక్తి తన చరవాణిలోని హనుమంతుడి చిత్రాన్ని మాకు షేర్ చేసాడు.
ఇక అక్కడి నుంచి భోగ సముద్రం చెరువుకు చేరాము. మౌర్యుల కాలంలో రచించబడిన బ్రహ్మాండ పురాణంలో దీనిని యమ తీర్థంగా పేర్కొన్నారు. ఈ చెరువు గట్టు మీద మరువ గంగమ్మ విగ్రహం ఉంది. ఈ గంగమ్మ నోటి వరకు నీళ్లు వస్తే అప్పుడు మరువ పారుతుంది. భోగ సముద్రం పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. ఈసారి మీరు పెనుకొండకు వెళితే ఇవన్నీ చూసేయండి. మరో ప్రయాణంలో మిమ్మల్ని మళ్లీ పలకరిస్తాను. స్వస్తి.






జైన దేవాలయ విశేషాలు అద్భుతంగా ఉన్నాయి sir
ReplyDeleteజైన దేవాలయ విశేషాలు అద్భుతంగా ఉన్నాయి sir
ReplyDelete