బిల్ల సర్గం ప్రయాణం
చాలా కాలంగా నేను చూసి తీరాలి అనుకుంటున్న ప్రదేశాల జాబితాలో ఉన్న బిల్ల సర్గం గుహలను నేను ఈ 2026 దసరా సెలవుల్లో చూడడం జరిగింది. ప్రణాళికా బద్దంగా చేసే ప్రయాణాలలో థ్రిల్ ఉండదు. అనుకోకుండా పెట్టె, బేడ సర్దుకుని వెళ్లి చూడడంలోనే మజా ఉంటుంది. బిల్ల సర్గం చూడడం మాత్రం నా మూడేళ్ల కల. దీనికి సంబంధించిన వీడియోలు ఇంస్టా మరియు ఇతర సామాజిక వేదికలలో చాలా హల్ చెల్ చేయడమే ఇందుకు కారణం. సామాజిక వేదికల వలన రాత్రికి రాత్రే ప్రచారంలోకి వచ్చిన ప్రాంతాలు ఇప్పుడు చాలానే ఉన్నాయి. జనాలు అనుకుంటే ఎవరినైనా ఆకాశానికి ఎత్తేయగలరు లేదా అధ: పాతాళానికి తొక్కేయగలరు.
దసరా సెలవులు ప్రకటించిన రెండు రోజులు రాత్రి, పగలు మొద్దు నిద్ర పోవడం వలన మనసు పర్యటనల మీదికి పోయింది. ఏది వెళ్లి చూసొస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటే, బిల్ల సర్గం గుహలు ఠపీమని గుర్తుకువచ్చాయి. మనోహర్ నాయక్ కు ఫోన్ చేసి "వస్తావా నా తోటి బిల్ల సర్గం" అన్నాను. వెంటనే "13 వ తేదీ పోదాము సర్ " అన్నాడు. మా డ్రైవర్ బాషాకు చెప్పేసాను. మాతో పాటుగా మరో మిత్రుడు శ్యామ్ ప్రసాద్ వస్తాను అన్నాడు. అలా ప్రణాళికా సిద్దం అయిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రయాణం ఇలా దసరాలో అనుభవానికి వచ్చింది.
13 వ తేదీ ఉదయం 6.30 కు బాషా వచ్చేసాడు. శ్యామూ మరియు మనోహర్ కూడా సరైన సమయానికే వచ్చేసారు. మూడు వేల రూపాయలకు డీజిల్ పట్టించాము. కారు చక్రాలలో గాలి కొట్టించుకున్నాము. పూర్వము ఇలాంటి ప్రయాణాలకు సద్ది కట్టుకువెళ్ళేవారు. "ఎద్దు లేని సేద్యం, సద్ది లేని ప్రయాణం వృధా" అని నానుడి. ఇప్పుడు అలా కాదు. మనకు టిఫినీలు ఏర్పాటు చేసే హోటళ్లు కోకొల్లలు. ఇప్పుడు ఎక్కడ చూసినా హోటళ్లు కనపడతాయి. గుత్తిలో ఉన్న అన్నపూర్ణ హోటల్ లో ఇడ్లీ, వడ (సాంబార్ డిప్ ) మరియు మసాలా దోసె ఆరగించాము. అక్కడ నుంచి ద్రోణాచలం మీదుగా బేతంచర్ల చేరుకున్నాము. బేతంచెర్లకు కూతవేటు దూరంలోనే ఈ బిల్ల సర్గం గుహలు. ఒక ఐదు కిలోమీటర్లు మాత్రం రోడ్డు అధ్వాన్నంగా ఉంది.
ఈ బిల్ల సర్గం పేరు విచిత్రంగా ఉంది కదా!!! బిలం అంటే గుహ లాంటి నిర్మాణం అని అర్థం. సొరంగం లాగా ఈ గుహలు ఉన్నాయి కాబట్టి వీటికి ఈ పేరు వచ్చి ఉండొచ్చు. 'బిల సొరంగం' అనే పేరే క్రమంగా జనాల నోళ్లలో పడి బిల్ల సర్గంగా మారి ఉంటుంది. నీటి ఒరిపిడి వలన సున్నపు రాయి క్షోభ్యతకు గురై ఏర్పడిన గుహలు ఇవి. ఈ సహజ శిలలు అనేక ఆకారాలుగా ప్రకృతి చేత మలచబడ్డాయి. ఒక శిల అయితే ఏకంగా నిలువెత్తు గణపతిని పోలి ఉంది. ఆకారాలది ఏముంది లెండి.. ఎలా భావిస్తే అలా దర్శనం అవుతుంది. సృష్టి అంతా చూసే వారి దృష్టిని బట్టే ఉంటుంది. ఈ మట్టి పొరలలో ఎన్నో జీవ పరిణామ రహస్యాలు ఇమిడి ఉంటాయి. పాత మరియు కొత్త రాతి యుగాల నాటి మానవులు వాడిన ఆయుధాలు, పాత్రలు దొరికాయి అని, అవి దేశ, విదేశాలలో వివిధ మ్యూజియంలలో భద్రపరచబడ్డాయని చెపుతున్నారు. ఏది ఏమైనా ఈ మట్టి నిక్షిప్తం చేసుకున్న జ్ఞాపకాలను తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎన్నో మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన గుహలు ఇవి. ఒక ప్రదేశం నుంచి చూస్తే ఈ బిల్ల సర్గం గుహల పై భాగం నుంచి ఆకాశం దర్శనమిస్తుంది. రాత్రి పూట ఇక్కడ నిలబడి అంతరిక్షాన్ని చూస్తే ఒక ప్లానెటోరియంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. కానీ రాత్రి అక్కడ ఉండే తెగువ ఎవరికి వస్తుంది???? గుహలలో పావురాల రెట్టల వాసన ముక్కులను అదరగొడుతోంది. కానీ గుహలు open గా ఉండడం వలన ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు మాలో ఎవరికీ ఎదురుకాలేదు. ఈ గుహలలో కొన్నిటికి 'కేథడ్రెల్' 'పవిత్ర గుహ' లాంటి పేర్లు కూడా పెట్టేసారు. ఎముకలతో చేసిన పనిముట్లు ఇక్కడ జరిపిన తవ్వకాలలో బయటపడ్డాయి. అలాగే ప్లిస్టోసీన్ కాలానికి చెందిన జంతుజాల శిలాజాలు కూడా దొరికాయి. అలా ఈ బిల్ల సర్గం గుహలు మానవ జీవ మరియు సాంస్కృతిక పరిణామ క్రమానికి documentary evidences గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇలాంటివే వాల్మీకి గుహలు, సన్యాసుల గుహలు ఉన్నాయట. వీలు పడినప్పుడు చూడాలి. యాగంటి గుహలు చాలా సార్లు చూసాను. ఏది ఏమైనా కానీ ఆ కాలంలో ఆది మానవులు ఇక్కడ ఎలా జీవించి ఉంటారో అనే విషయాన్ని ఊహించుకుంటే థ్రిల్లింగా అనిపించింది. ఈ గుహలలో ప్రవేశించిన మేమందరూ ఉన్న పళంగా ఆది మానవులుగా మారి పోతే ఎలా ఉంటుంది !!!!!!. ఈ ఊహను మనోహర్ నాయక్ కు చెప్పాను. "సర్ !!!! మన PhD ఎలా అని ఆందోళనగా చూసాడు. ఊహే కదా అని నేను ఊదార్చేసరికి ఊరట చెందాడు.
ప్రవేశ రుసుము ఒకరికి కేవలం అరవై రూపాయలు. మేము వెళ్లినపుడు సిగ్నల్స్ లేకపోవడం వలన Phone Pay పని చేయలేదు. కొద్ది దూరం పోయి ప్రయత్నిస్తే సిగ్నల్స్ అందాయి. ప్రయాణాలలో అంతో, ఇంతో నగదు తీసుకొని వెళ్లడం శ్రేయస్కరం అని మాకు తెలిసివచ్చింది. ఒక రెండు గంటల పాటు బిల్ల సర్గం గుహలను మా చరవాణిలో ఛాయా చిత్రాలు మరియు వీడియోల రూపంలో బంధించుకుంటూ గడిపేసాము. ఇక్కడి నుంచి నేను చాలా కాలంగా చూడాలి అనుకుంటున్న కొత్తూరు సుబ్బారాయుడి గుడికి వెళ్లాలి అనుకున్నాను. ఆ విషయమే మిత్రులతో చెపితే అలాగే.. అలాగేనంటూ తలలెగరేసారు. బిల్ల సర్గం నుంచీ కొత్తూరు 26 కిలోమీటర్లు. పలుగూరు, రామకృష్ణాపురం మీదుగా వెళ్లాలి. Single road అయినా బాగుంది. కొత్తూరుకు వెళ్లి సుబ్బారాయుడి దర్శనం చేసుకున్నాము. గర్భ గుడిలో సర్పాకృతిలో వెలసిన సుబ్రమణ్యుడికి అభిషేకాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ ఊర్లో చాలా మంది పేర్లు సుబ్బరాయుడు అని ఉంటుందట. సుబ్బరాయుడు అని గట్టిగా పిలిస్తే ఊరు ఊరంతా వెనక్కి తిరిగి చూస్తుందేమో!!!!! 'కొత్తూరు రావు' అనే పేరు కూడా ప్రసిద్దమేనట. మంగళవారం సుబ్రమణ్యుడికి శ్రేష్టం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు.
తరువాత బనగాన పల్లె మీదుగా అనంతపురం పోదామని బయలుదేరాము. త్రోవలో నందవరం చౌడేశ్వరి దర్శనం చేసుకున్నాము. శరన్నవ రాత్రిలో చౌడేశ్వరి మాత సర్వాలంకార శోభితంగా దర్శనం ఇచ్చింది. నేను నందవరం చాలా సార్లు చూసాను.
బనగాన పల్లె వద్ద వీర బ్రహ్మేంద్ర స్వామి నేల మఠం వెళ్లాము. ఈ మఠంలో బ్రహ్మం గారి ఆత్మ లింగం ఉంది. ఇక్కడనే అన్నాజయ్య, అచ్చమాంబల అంధపుత్రుడైన గరిమిరెడ్డి బ్రహ్మానంద రెడ్డికి బ్రహ్మంగారు చూపు ప్రసాదించారు. తరువాత బనగాని పల్లిలో అరోమా టీ సెంటర్ లో ఒక అమృతోపమానమైన తేనీటిని సేవించాము. అలసట అంతా తీసేసినట్టు అనిపించింది. ఇక్కడి నుంచి గరిమిరెడ్డి అచ్చమాంబ మఠం గా పిలువబడే చింతమాను మఠం వెళ్లాము. బ్రహ్మం గారి కాల జ్ఞాన ప్రతులు ఇంకా ప్రచారానికి నోచుకొనివి అసంఖ్యాకంగా ఈ మఠంలోని చింతమాను క్రింద నిక్షిప్తం చేయబడ్డాయట. ఈ బనగాని పల్లె లో వీరప్పయ్య స్వామి పేరుతో బ్రహ్మం గారు సుమారు 23 సంవత్సరాలు సంచరించారట. బాల్యంలో సీనియర్ ఎన్టీయార్ నటించిన "శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర" సినిమా ఉరవకొండలో చూసిన తరువాత నాకు బ్రహ్మంగారి మీద ఆసక్తి కలిగింది. బ్రహ్మం గారి తత్వాలు చాలానే చదివాను. ఈ చింతమాను మఠంలో ఉచిత అన్న ప్రసాదం ఆరగించాము మేము.
అలాగే అనంతపురం త్రోవలో బనగాని పల్లికి దగ్గరగా ఉన్న నవాబుల ప్యాలెస్ చూసాము. ఇక్కడే అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది. మనోహర్ నాయక్ కు తెగ నచ్చేసింది ఈ ప్యాలెస్.
ఇలా ఇన్నేసి ప్రాంతాలు చూసి మేము అనంతపురం చేరేసరికి సాయంత్రం ఐదు గంటలయ్యింది.












No comments:
Post a Comment